శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 25, 2020 , 00:06:08

జిల్లాలో మళ్లీ ఊపందుకున్న స్థిరాస్తి రంగం

జిల్లాలో మళ్లీ ఊపందుకున్న స్థిరాస్తి రంగం

  • కొనుగోలుదారులపై కనిపించని కరోనా ప్రభావం
  • ఈ ప్రాంత అనుకూల పరిస్థితులే కారణం 
  • జోరుగా రిజిస్ట్రేషన్లు.. లక్ష్యాన్ని మించి ఆదాయం 
  • యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో అత్యధికం 
  • ఆ తర్వాతి స్థానాల్లో భువనగిరి, బీబీనగర్‌, చౌటుప్పల్‌

కొవిడ్‌-19 నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్ర మందగమనంలో పడింది. కానీ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. లాక్‌డౌన్‌లో రిజిస్ట్రేషన్లు ఆగి ఆదాయం నిలిచిపోయినా.. మే రెండోవారం నుంచి పుంజుకున్నది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా రాబడి పెరిగింది. జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట, భువనగిరి, రామన్నపేట, మోత్కూరు, బీబీనగర్‌, చౌటుప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారా మే నెలలోనే రూ.5.30 కోట్ల ఆదాయం రాగా.. జూన్‌లో రూ.9.58 కోట్లు వచ్చింది. యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలోనే అత్యధిక డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో భువనగిరి, బీబీనగర్‌, చౌటుప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. యాదాద్రి ఆధ్యాత్మిక కేంద్రం కావడం, రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండడం, ఐటీ కంపెనీలు వస్తుండడం వంటి అనుకూల పరిస్థితులే రియల్‌ జోరుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా ఇంతింతై.. వటుడింతై అన్నట్లుగా విస్తరిస్తోంది. సకల సౌకర్యాలు.. సదుపాయాలతో నలు దిక్కులకూ వ్యాపిస్తోంది. రాష్ట్ర రాజధానితోపాటు ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తున్నప్పటికీ జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పరుగులు తీస్తోంది. చేరువనే ఉన్న హైదరాబాద్‌ నగరానికి పెద్ద ఎత్తున వస్తున్న వలసల నేపథ్యంలో పెరిగిన జనాభా కారణంగా రాజధాని కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో సౌకర్యాలు, సదుపాయాల పరంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే స్థాయి సౌకర్యాలతో అదే ధరకే భూములు, ప్లాట్లు, ఇండ్లు లభిస్తుండటంతో  జిల్లాలో రియల్‌  భూం కొనసాగుతుండగా.. యాదాద్రి ఆలయాన్ని మరో వాటికన్‌ సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన నేపథ్యంలో రియల్‌ రంగం మరింత జోరందుకుంది. ఆలయం అభివృద్ధి జరగడం ఒక ఎత్తయితే.. రాజధానికి దగ్గరగా ఉండటం వల్ల కూడా  పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. ఉప్పల్‌ నుంచి యాదాద్రికి హైస్పీడ్‌ మెట్రో రైలు ఏర్పాటు.. ఘట్‌కేసర్‌- రాయగిరి మధ్యన ఎంఎంటీఎస్‌ రైలు నడిపేందుకు  ప్రభుత్వం సంకల్పిస్తుండటం.. ఐటీ పరిశ్రమలు తరలివస్తుండటం వంటి పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కస్టమర్లు, ఇన్వెస్టర్లు యాదాద్రి పరిసర ప్రాంతాల్లో ప్లాట్లు కొంటున్నారు. ఫలితంగా మొన్నటి వరకు రూ.లక్షల్లో ఉన్న భూముల రేట్లు రూ.కోట్లకు పడగెత్తాయి. ఇదే క్రమంలో ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ ఆదాయం సైతం పెరుగుతూ వస్తోంది.

కొనుగోలుదారులపై కనిపించని కరోనా ప్రభావం 


మూడేండ్ల క్రితం పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే  ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ యాక్ట్‌, ఇండ్లు కొనేవారికి రాయితీలు ఇవ్వడం లాంటి చర్యలతో రియల్‌ రంగం కొద్దిగా పుంజుకోగలిగింది. ఆతర్వాత కొవిడ్‌-19 సంక్షోభం అన్ని వర్గాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఈ ప్రభావం రియల్‌ రంగంపై పడ్డప్పటికీ జిల్లాలో జరుగుతున్న దినదినాభివృద్ధి.. ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్‌ వంటి పరిస్థితులు కొనుగోలుదారులను రియల్‌ రంగం నుంచి దూరం చేయలేకపోయాయి. మే మొదటి వారంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చింది. అప్పట్నుంచి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లావాదేవీలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కష్టకాలంలోనూ ప్లాట్ల క్యాన్సిలేషన్‌ పెద్దగా జరగడం లేదు. ఉద్యోగాలు కోల్పోయిన వారు సైతం కరోనా ఉధృతికి ముందు కొన్న ప్లాట్లను ఎవ్వరూ రద్దు చేసుకోవడం లేదు.  కరోనా సంక్షోభం ఉన్న మే, జూన్‌, జులై నెలల్లో కూడా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కావడమే ఇందుకు నిదర్శనమని నిపుణులు పేర్కొంటు న్నారు.  ప్రభుత్వం స్టాంప్‌ డ్యూటీ, భూముల విలువ పెంచకపోయినా రాబడిలో ఏయేటికాయేడు గణనీయ వృద్ధి జిల్లాలో చోటుచేసుకుంటోంది.

VIDEOS

logo