మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Jul 21, 2020 , 23:36:04

కరోనా నివారణకు.. శ్రీ సుదర్శననారసింహహోమం

కరోనా నివారణకు.. శ్రీ సుదర్శననారసింహహోమం

ఆలేరు : శ్రావణమాసం మొదటి రోజు సందర్భంగా మంగళవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా అమ్మవారు, స్వామివార్లకు నిత్య కైంకర్యాలు శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా బాలాలయంలో యాదాద్రి స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన నారసింహ హోమం జరిపామని ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.

శాస్ర్తోక్తంగా నిత్యపూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. ఉదయం బాలాలయంలో ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. 

పట్టువస్ర్తాలను ధరింపజేసి స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా జరిపారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. మహా మంటపంలో అష్టోత్తరం నిర్వహించారు. ఇదిలా ఉంటే పవిత్ర పుణ్యమాసమైన శ్రావణమాసం శుభముహూర్తంలో స్వామివారి నూతన గర్భాలయం శుద్ధి చేశామని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.

శ్రీవారి ఖజానాకు రూ. 97,676 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ. 97,676 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 1,100, ప్రసాద విక్రయాలతో రూ. 83,740, మినీబస్సు ద్వారా రూ. 820, అన్నప్రసాదంతో రూ. 1,116, వాహనపూజల ద్వారా రూ. 3,400, కొబ్బరికాయలతో రూ. 7,500, ఇతర విభాగాలతో కలిపి శ్రీవారి ఖజానాకు రూ.  97,676 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ప్రత్యేక కలశ పూజలు

ఆగస్టు 5న అయోధ్యరామ జన్మభూమిలో జరుగబోయే భూమి పూజ కార్యక్రమానికి దేశంలో వివిధ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, జలాలను వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి గోశాల వద్ద వీహెచ్‌పీ బృందం తులసీ వనం వద్ద మట్టిని సేకరించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక కలశపూజలు నిర్వహించి, హైదరాబాద్‌లోని విశ్వహిందూ రాష్ట్ర కార్యాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లా సహ కార్యదర్శి తోట భానుప్రసాద్‌, ఉపాధ్యక్షుడు పోత్నక్‌ రఘు, జిల్లా సహ కార్యదర్శి కర్రె ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo