సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 20, 2020 , 00:09:03

నాటు కోడి... హాటు ధ‌ర‌

నాటు కోడి...  హాటు ధ‌ర‌

  • నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి
  • తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదన 
  • 20 కోళ్లతో ప్రారంభమై 15 వందల కోళ్లు


రాజాపేట : మార్కెట్‌లో నాటుకోళ్లకు ఉన్న డిమాండ్‌తో ఓ రైతు నాటుకోళ్ల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఏడాదిన్నర క్రితం 20 కోళ్లను తెచ్చి పెంచడం ప్రారంభించాడు. అదే నేడు అతనికి ఉపాధిగా మారింది. ఇప్పుడు అతని వద్ద 15 వందల కోళ్లు ఉన్నాయి. నాటుకోళ్లతో అధిక ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

20 కోళ్లతో షురూ.. 

రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామానికి చెందిన ఎడ్ల నరేశ్‌రెడ్డికి వ్యవసాయమే జీవనాధారం. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను చూసి సరదాగా అతను కూడా తీరిక వేళల్లో స్వల్ప ఖర్చుతో నాటుకోళ్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏడాదిన్నర క్రితం మండలంలోని సింగారంలో రూ. 250 చొప్పున 17 కోడిపెట్టలను, రూ. 300 చొప్పున 3 కోడిపుంజులను కోనుగోలు చేశాడు. వాటిని పెంచుతూనే కొన్నాళ్లకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ప్రభుత్వం సబ్బిడీపై రూ.20కు ఒకటి చొప్పున అందించిన 200 కోడి పిల్లలను తీసుకువచ్చాడు. వీటిని తన వ్యవసాయ బావి వద్ద ఉన్న చిన్న షెడ్డులో పెట్టి పెంపకాన్ని ప్రారంభించాడు. అవి పొలంలో స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు కల్పించడంతో పెద్ద ఖర్చు లేకుండానే అవి పెరిగాయి. అలా 20 కోళ్ల నుంచి ప్రారంభమైన పెంపకం నేడు 15 వందల కోళ్ల వరకు చేరుకున్నది. 

కోడిపిల్లల ఉత్పత్తి

తన వ్యవసాయబావి వద్ద పెంచుతున్న కోళ్లు గుడ్లు పెట్టగానే వాటిని షెడ్డులోనే పొదిగేశాడు. నెలకు ఒకసారి 300 నుంచి 400 వరకు కోడి పిల్లల ఉత్పత్తి జరుగుతుంది. కోడిపిల్లలను షెడ్డులోనే ఉంచి రూ. 50 చొప్పున విక్రయిస్తున్నాడు. కోడిపుంజులను కిలోకు రూ. 350 చొప్పున విక్రయిస్తూ కోడిపెట్టలను మాత్రం పెంచుకుంటున్నాడు. కోడి పెట్టెల ద్వారా రోజుకు కనీసం 200 గుడ్లు వస్తున్నాయి. వాటితో కోడిపిల్లలను కూడా విక్రయిస్తూ లాభాలు పొందుతున్నాడు.

సరదాగా ప్రారంభించి...స్వయం ఉపాధి అయి..


నేను సాధారణ రైతుని. నాకు వ్యవసాయమే జీవనాధారం. మార్కెట్లో నాటుకోళ్ల డిమాండ్‌ను గమనించి సరదాగా పెంపకం ప్రారంభించాను. నాటుకోళ్లపై ఉన్న ఆసక్తే నా అదనపు ఆదాయానికి మార్గం అయింది. 20 కోళ్లు తెస్తే ఇపుడు 1500 కోళ్లకు సంఖ్య పెరిగింది. సరదాగా ప్రారంభించిన నాటుకోళ్ల పెంపకం ఇప్పుడు నాకు స్వయం ఉపాధి మార్గం అయింది. కోడి పిల్లలు, పుంజుల విక్రయంతో లాభాలు మంచిగనే వస్తున్నయి. 

- ఎడ్ల నరేశ్‌రెడ్డి, పాముకుంట రైతు


VIDEOS

logo