మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jul 19, 2020 , 23:04:09

యాదాద్రిలో శాస్ర్తోక్తంగా పూజ‌లు

యాదాద్రిలో శాస్ర్తోక్తంగా పూజ‌లు

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆదివారం ఉదయం నిత్య కైంకర్యాలను అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. బాలాలయంలో శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణ తంతును అర్చకులు జరిపించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మంటపంలోనే ఊరేగించారు. సుమారు గంటన్నరపాటు కల్యాణ తంతును జరిపారు. వేకువజామునే సుప్రభాత సేవ చేపట్టి, ప్రతిష్ఠామూర్తులను ఆరాధిస్తూ హారతి నివేదించారు. ఉత్సవమూర్తులను అభిషేకించి, తులసీ పత్రాలతో అర్చించి, దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన చేశారు. మంటపంలో స్వామివారికి అష్టోత్తర పూజ, శ్రీసుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనారాధన జరిపారు.  కొవిడ్‌-19 నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఆలయ మంటపంలో సేవోత్సవం, రాత్రి అమ్మవార్లకు శయనోత్సవాన్ని నిర్వహించారు. 

రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి  అర్చకులు  ప్రత్యేకపూజలు జరిపారు. పార్వతీదేవిని కొలుస్తూ శివాలయంలో కుంకుమార్చన నిర్వహించారు. 

దర్శించుకున్న నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల

 చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎక్కడా నిర్మించని విధంగా పూర్తి కృష్ణ శిలలతో ఆలయ నిర్మాణం చేయడం గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో యాదాద్రి ఆలయం ప్రపంచపటంలో నిలిచిపోనుందన్నారు.  

శ్రీవారి ఖజానాకు  రూ. 1,59,840 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ. 1,59,840 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 1,875, ప్రసాద విక్రయాలతో రూ. 1,35,175, వాహనపూజల ద్వారా రూ. 6,100, మినీ బస్సుతో రూ. 940, కొబ్బరికాయలతో రూ. 10,200తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ.  1,59,840 సమకూరినట్లు తెలిపారు. 

VIDEOS

logo