ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 19, 2020 , 22:53:34

ప్రజల శ్రేయస్సు పట్టదా..?

 ప్రజల శ్రేయస్సు పట్టదా..?

  • ప్రభుత్వ వైద్యశాలలో 
  • డ్యూటీ డాక్టర్లు ఎందుకు ఉండడం లేదు?
  • పేదలకు నాణ్యమైన వైద్యమందించేందుకే ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు..
  • చౌటుప్పల్‌ వైద్యశాలను సందర్శించిన 
  • ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి..
  • డాక్టర్లు లేకపోవడం పై విస్మయం..
  • కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ జిల్లా అధికారి 
  • డా. రవిప్రకాశ్‌ను ఆరా తీసిన ఎంపీపీ

చౌటుప్పల్‌ :  పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకే ప్రభుత్వ దవాఖానల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుంది.. కరోనా టెస్టులు సైతం ఇక్కడే చేసేలా లక్షలాది రూపాయాలు ఖర్చు చేస్తుంది..కానీ కొంతమంది డాక్టర్ల వల్ల ప్రభుత్వ వైద్యశాలకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కనీసం ఒక్క డ్యూటీ డాక్టరు సైతం అందుబాటులో ఉండకపోవడం సరైందికాదని, ఆపదలో వస్తున్న వారికి వైద్యం అందించకపోతే ఎలా అని ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్‌ ప్రభుత్వ దవాఖానను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీ డాక్టర్‌ లేడని.. గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని పలువురు రోగులు ఆయన దృష్టికి  తీసుకొచ్చారు. మండలంలోని తూఫ్రాన్‌పేట గ్రామానికి చెందిన వ్యక్తి రెండు కాళ్లకు దెబ్బ తగిలిందని..

దవాఖానకు వచ్చి గంట దాటినా ఇప్పటి వరకు తనకు ఎలాంటి వైద్యం అందలేదని రోదిస్తూ ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే దవాఖాన సూపరింటెండెంట్‌ డా.అలివేలుతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. డ్యూటీ డాక్టర్‌ ఎందుకు లేడని ఆమెను ఎంపీపీ ప్రశ్నించారు. విషయాన్ని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ జిల్లా అధికారి డా.రవిప్రకాశ్‌కు ఫోన్‌లో వివరించాడు. ఇలా అయితే వైద్యం కోసం వచ్చిన వారు కాటికి కాలు చాపాల్సి వస్తదని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల శ్రేయస్సు ప్రభుత్వ దవాఖానలోని కొంతమంది వైద్యులకు పట్టడంలేదని, కనీసం దవాఖానలో ఒక్క డ్యూటీ డాక్టర్‌ లేకపోవడం సరైందికాదన్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్‌-విజయవాడ 65వ జాతీయ రహదారి పక్కనే చౌటుప్పల్‌ ఉందని.. వేలాది మంది ఇక్కడి వస్తారని తెలిపారు. ఇంత పెద్ద సెంటర్‌లోని దవాఖానలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాల్సి బాధ్యత డాక్టర్లపై ఉందని తెలిపారు. 

VIDEOS

logo