గురువారం 03 డిసెంబర్ 2020
Yadadri - Jul 18, 2020 , 23:32:40

రెండోరోజూ.. కరోనా పరీక్షలు

 రెండోరోజూ..  కరోనా పరీక్షలు

ఆలేరుటౌన్‌ : ఆలేరు పట్టణంలోని సీహెచ్‌సీ దవాఖానలో రెండో రోజు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మరో పాజిటివ్‌ కేసు నమోదు అయినట్లు మండల నోడల్‌ వైద్యాధికారి జ్యోతీబాయి తెలిపారు. గుండ్లగూడెం గ్రామానికి చెందిన ఒక వృద్ధుడికి పాజిటివ్‌ రాగా, అతడిని ప్రత్యేక గదిలో క్వారంటైన్‌ చేశామన్నారు. వృద్ధు డి కుటుంబసభ్యులను, ప్రాథమిక కాంటాక్ట్‌లను హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. 

 బీబీనగర్‌ పీహెచ్‌సీలో... 

బీబీనగర్‌ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేసే ఓ ఏఎన్‌ఎంకు శనివారం కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆమెను హోం క్వారంటైన్‌లో ఉంచామన్నారు. ప్రతి బుధవారం వాక్సినేషన్‌ డేలో భాగంగా ఆమె విధులకు హాజరయ్యారు. ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించి హోంక్వారంటైన్‌ చేయనున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. 

 మోత్కూరులో... 

మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రం లో శనివారం మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి చైతన్యకుమార్‌ తెలిపారు. గత ఆదివారం అస్వస్థతతో హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి దవాఖానకు వెళ్లగా, అక్కడ పరీక్షలు జరిపి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారని తెలిపారు. అక్కడే అతడికి మెరుగైన వైద్య సేవలు అందిస్తుండగా, ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్న ఐదుగిరిని హోంక్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట పీహెచ్‌సీ ఫార్మాసిస్టు సత్యనారాయణరెడ్డి, హెల్త్‌ అసిస్టెంట్‌ కృష్ణ, వైద్య సిబ్బంది ఉన్నారు.

 మహిళా ఉద్యోగికి... 

రామన్నపేట : మండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌  మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి రవికుమార్‌ తెలిపారు. భువనగిరి ఏరియా దవఖానా లో శుక్రవారం ఆమె పరీక్షలు చేయించుకోగా శనివారం కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఆమె తో పాటు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు ఆరోగ్య విద్యాబోధకుడు సత్యనారాయణ తెలిపారు.

 గణేశ్‌నగర్‌లో..  

చౌటుప్పల్‌ :  మున్సిపాలిటీ పరిధిలోని గణేశ్‌నగర్‌కు చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. ఈ నెల 2న సదరు వ్యక్తి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానలో పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌ వచ్చింది. వెంటనే అతని కుమారుడికి కూడా పరీక్షలు చేయించగా పాజిటివ్‌ అని తేలిం ది. వీరి రిపోర్టులు శనివారం మండల వైద్యాధికారి డా. శివప్రసాద్‌రెడ్డికి రావడంతో ఆయన వారిద్దరిని హోంక్వారంటైన్‌కు తరలించారు. 

 మున్సిపల్‌ అధికారికి...  

ఆలేరు : యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో విధులు నిర్వర్తించే ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ వచ్చిం ది. హైదరాబాద్‌లోని నాగోల్‌ ఉంటూ మున్సిపాలిటీకి విధులకు హాజరయ్యే వారని, నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో పరీక్షలు నిర్వహించగా సదరు అధికారితోపాటు అత ని భార్య, ఇద్దరు కుమార్తెలకు సైతం కరోనా వ్యాధి నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. వీరందరినీ నాగోల్‌లో హోంక్వారంటైన్‌లో ఉంచామని అన్నారు.

హోంక్వారంటైన్‌లో 232మంది 

భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 232మందిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  సాంబశివరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 857 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించామని 16 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచినట్లు చెప్పారు. 

రామన్నపేట ఎస్టీవో కార్యాలయం  వారం రోజులు బంద్‌ 

రామన్నపేట : రామన్నపేట ఎస్టీవో కార్యాలయాన్ని ఈ నెల 20 నుంచి 26వరకు మూసి వేయనున్నట్లు ఎస్టీవో జి.పురుషోత్తంరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారం రోజులు సిబ్బంది హోంక్వారంటైన్‌లో ఉండడం జరుగుతుందని ఆయన తెలిపారు. సందర్శకులు ఎవరూ కార్యాలయానికి వారం పాటు రావద్దని ఆయన కోరారు.