బుధవారం 02 డిసెంబర్ 2020
Yadadri - Jul 18, 2020 , 23:29:15

భూవివాదంలో సీఐ, ఎస్సైపై వేటు

భూవివాదంలో సీఐ, ఎస్సైపై వేటు

  • రామన్నపేట సీఐ, మోత్కూరు ఎస్సై కమిషనరేట్‌కు అటాచ్‌ 
  • సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు

మోత్కూరు :  రామన్నపేట సీఐ ఏవీ రంగా, మోత్కూరు ఎస్సై సీహెచ్‌ హరిప్రసాద్‌పై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వేటు వేశారు. నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామంలో కాసం సత్యనారాయణ వద్ద మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన అంబటి నర్సయ్య, బండ యాదయ్యతదితరులు 10.02 ఎకరాల భూమిని రూ.24లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశారు.

అదే భూమిని చేర్యాలకు చెందిన పెద్ది ప్రశాంత్‌కు రూ. 27లక్షలకు ఎకరం చొప్పున అమ్ముకున్నారు. 25 శాతం డబ్బు చెల్లించి 2019 ఏప్రిల్‌ 20న అగ్రిమెంట్‌ చేసుకున్న ప్రశాంత్‌ వాయిదా ప్రకారం 90 రోజుల్లో మిగతా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు.  ఈ వివాదం ఇలా ఉండగా, మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో గత  సంక్రాంతి పండుగకు గ్రామ దేవత ముత్యాలమ్మకు బోనం చెల్లింపు సందర్భంలో  అంబటి నర్సయ్య అతడి పాలివారైన అంబటి చంద్రయ్య మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు  మోత్కూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు.

గ్రామ పెద్దల సమక్షంలో రాజీ పడి ఫిబ్రవరి 8న కేసు కొట్టేయించుకోవడానికి రామన్నపేట కోర్టులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌కు వెళ్లారు.  సీఐ ఏవీ రంగా, ఎస్సై హరిప్రసాద్‌ జోక్యం చేసుకొని అమ్మనబోలు భూమి తగాద పరిష్కరించుకుంటేనే ఈ కేసు రాజీ కుదురుతుందని లింకు పెట్టి పథకం ప్రకారం కేసు కొట్టేయ్యకుండా చేశారని బాధితుడు అంబటి నర్సయ్య సీపీని ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 14న అడిషనల్‌ సీపీ విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా సీపీ మహేశ్‌ భగవత్‌  శనివారం సీఐ రంగా, ఎస్సై హరిప్రసాద్‌పై చర్య తీసుకొని రాచకొండ కమిషనరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్వర్వులు జారీ చేసినట్లు తెలిసింది.