శనివారం 31 అక్టోబర్ 2020
Yadadri - Jul 18, 2020 , 23:21:25

ఆలయ పనులు భేష్‌

ఆలయ పనులు భేష్‌

  • సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి 

ఆలేరు : కరోనా విపత్తులో సైతం ఆలయ పునర్నిర్మాణ పనులు భేష్‌గా జరుగుతున్నాయని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి కితాబిచ్చారు. ఆలయ విశిష్టతకు భంగం వాటిల్లకుండా ఇంజినీర్లు, కాంట్రాక్టర్‌లు, స్తపతి పనుల్లో వేగం పెంచాలని ఆయన సూచించారు. శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నెల శనివారం ఆలయ పనుల పరిశీలనలో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరుగుతున్న పనులను క్షుణంగా పరిశీలించారు. జూలై 6న పరిశీలించిన ఆయన ఇప్పటి వరకు అభివృద్ధి పనుల్లో పురోగతిని తెలుసుకున్నారు.  ఈస్ట్‌ నార్త్‌, సౌత్‌ గోపురాలను కలియ తిరిగారు. ప్రధానాలయం, గర్భాలయం, ముఖ మంటపం, బ్రహ్మోత్సవ మంటపం వద్ద ఫ్లోరింగ్‌ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రాకారాలు, మాడవీధులు, భూగర్భ డ్రైనేజీ పనులు, క్యూ కాంప్లెక్స్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్తపతి, డిప్యూటీ స్తపతి, కాంట్రాక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఇంజినీర్లతో పనులను తీరును అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం పూర్తి అయిన పనులు ఆయన పరిశీలించారు. 

ఫోర్‌లేన్‌ రోడ్లు, ప్రెసిడెన్సియల్‌ సూట్లను..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నాలుగు వైపుల నుంచి వచ్చే భక్తుల రాకకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా ఆలయ చుట్టూ నిర్మిస్తున్న వలయదారులు, ఫోర్‌లేన్‌ ప్రధానరోడ్లను పరిశీలించారు. ఆయా ప్రధాన కూడళ్లలో ఉండాల్సిన ప్రదేశాలు ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఫోర్‌లేన్‌ రోడ్ల పురోగతిపై ఆర్‌అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి స్వామివారి దర్శనానికి వచ్చే ప్రముఖుల విడిది కోసం 13 ఎకరాలలో నిర్మిస్తున్న ప్రెసిడెన్సియల్‌ సూట్ల నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం హరిత కాటేజ్‌లో వివిధ శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్నారు. ఆలయ గర్భ గుడి పనులు పూర్తి చేసుకుని ప్రధాన దేవాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించాలని తెలిపారు. ఆయన వెంట వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈవో ఎన్‌.గీత, స్తపతి సలహాదారు ఆనందచార్యుల వేలు, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, ఈఎన్‌సీ రవీందర్‌రావు, ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ వసంతనాయక్‌, శిల్పులు, సహాయ స్తపతులు ఉన్నారు.  

గోపురాలను కలియతిరుగుతూ..

ఒక్కో గోపురానికి క్షుణంగా పరిశీలించి గోపురానికి స్తపతి ఎవరు, కాంట్రాక్టర్‌ ఎవరు అని అడిగి తెలుసుకున్నారు. ఆర్‌ అండ్‌ బీ ఆలస్యం ఏదైనా ఉందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం పనుల్లో ఆలస్యం కావడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. గర్భ గుడి పనులు పురోగతి ఎలా ఉందని పరిశీలించారు. పనుల్లో మౌలిక వసతులను కావాలని కోరిన ఇంజినీర్లకు వెంటనే తగు ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు తెలిపారు.

శివాలయంలో పనులు పరిశీలన

యాదాద్రి కొండపైన నిర్మితమవుతున్న శివాలయంలో ఫ్లోరింగ్‌, సాలాహారాల్లో పొందుపరుస్తున్న విగ్రహాల పొందిక తీరును, శివాలయం లో యాగశాల, నవగ్రహ మంటపం, ఉపాలయాలకు వేసిన కృష్ణ శిలను పోలిన స్టోన్‌కలర్‌ను సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.