గుట్టుగా గంజాయి రవాణా

- విశాఖ టు ముంబై వయా హైదరాబాద్
- జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలింపు
- జాతీయ రహదారిపై విభిన్న రీతుల్లో రవాణా
- సులువుగా సంపాదించేందుకు గంజాయి దందా
- విశాఖ మన్యంలో కిలో రూ.3 వేలు, ముంబయిలో రూ.5 వేల నుంచి రూ.25 వేలు
- ఈనెల 10న పంతంగి టోల్‌ప్లాజా వద్ద మిక్సీల్లో 86 కిలోల గంజాయి పట్టివేత
సులువు మార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఆశతో కొందరు అక్రమార్కులు గంజాయి రవాణా చేస్తూ జేబులు నింపు కుంటున్నారు. రాష్ర్టాలు దాటుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా వక్ర మార్గాల్లో రవాణా చేస్తూ దర్జాగా వ్యాపారం సాగిస్తున్నారు. విశాఖ మన్యం నుంచి విభిన్న మార్గాల్లో గంజాయిని 65వ నంబర్ జాతీయరహదారి మీదుగా ముంబయి, పూణె, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎలాంటి అనుమానం రాకుండా కార్ల సీట్లకింద, బ్యానెట్లలో, మిక్సీ డబ్బాల్లో తరలిస్తున్నారు. గతనెల 26న కట్టంగూరు వద్ద హైవేపై కారు బోల్తా పడగా దాదాపు 80 కిలోల గంజాయి పట్టుబడింది. ఈనెల 4న నకిరేకల్ మండలం చందంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 62 కిలోల గంజాయి దొరికింది. ఈనెల 10వ తేదీన చౌటుప్పల్ సమీపంలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో మిక్సీ డబ్బాల్లో తర లిస్తున్న 86 కిలోల గంజాయిని చూసి పోలీసులే కంగుతిన్నారు. విశాఖతోపాటు ఛత్తీస్‌గఢ్, రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచి భద్రాచలం, ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు గంజాయిని చేరవేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో అడపాదడపా కిలోల కొద్దీ గంజాయి పట్టుబడి కేసులు నమోదవుతున్నప్పటికీ అక్రమ రవాణాకు మాత్రం పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : తెలుగు రాష్ర్టాల్లో గంజాయి గుప్పుమంటోంది. మానవాళి మనుగడకు విఘాతం కలిగించే గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉన్నప్పటికీ ఈ వ్యాపారం విచ్చల విడిగా సాగుతున్నది. స్మగ్లర్లు ఎవరికి దొరకకుండా రోజుకో కొత్త ప్లాన్‌తో గంజాయిని రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నా రు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ర్టాల నుంచి కూడా గంజాయి అక్రమ మార్గాల్లో హైదరాబాద్‌కు చేరుతున్నది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా పోలీసుల కండ్లుగప్పి యథేచ్ఛగా తరలిస్తున్నారు. గంజాయి వాసన రాకుండా రసాయనాలతో తయారైన పేపర్లతో ప్యాక్ చేసి చేతిలో పట్టుకునేందుకు వీలుగా ఉండే సంచు ల్లో నింపి తరలిస్తున్నారు. ఒకప్పుడు అతిపెద్ద సమస్యగా ఉన్న గుడుంబా తయారీ పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఆ వ్యాపారం చాలా వరకు తగ్గిపోయింది.
అయితే ప్రస్తుతం డ్రగ్స్ తరువాత పట్టి పీడిస్తున్న సమస్యల్లో గంజాయి చేరింది. గుడుంబా వ్యాపారంతో జీవితాలను వెళ్లదీసిన ఎంతో మంది తమ అక్రమ వ్యాపారాన్ని వదులుకోలేక గుడుంబా స్థానంలో గంజాయిని ఎంచుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్ మండలానికి చెందిన కొందరు గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఉదంతం ఇదే విషయాన్ని తెలియజేస్తున్నది. కారులో 18 కిలోల గంజాయిని తరలిస్తూ మిర్యాలగూడ పోలీసులకు చిక్కిన వీరంతా గతంలో గుడుంబా తయారీపై జీవనం సాగించిన వారే కావడం గమనార్హం. పోలీసులకు అనుమానం వచ్చి ప్రత్యేక తనిఖీ లు నిర్వహించిన సందర్భాల్లోనూ.. ఎస్వోటీ పోలీసులు ఇచ్చిన సమాచారం వల్లనో..కిలోల కొద్దీ గంజాయి పట్టుబడుతుండగా, ఇంతకు ఎన్నోరెట్ల పోలీసుల కండ్లుగప్పి సరిహద్దులు దాటుతుందన్నది బహిరంగ రహస్యం. ఏదిఏమైనా ఈ అక్రమ దందాలో సామాన్యులు సమిధలుగా మారుతుండగా..వ్యాపారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు.
పక్షం రోజుల్లో నాలుగు ఘటనలు..
- విశాఖ ఏజెన్సీ నుంచి విజయవాడ- హైదరాబాద్ జాతీ య రహదారి నంబర్ 65 మార్గంలో హైదరాబాద్ మీదు గా ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తూ స్మగ్లర్లు ఇటీవల పలు సందర్భాల్లో పట్టుబడ్డారు. గత జూన్ 26 నుంచి జూలై 12వ తేదీల మధ్యలో ఎస్వోటీ, స్థానిక పోలీసుల తనిఖీల్లో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో నాలుగుసార్లు పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురైన సందర్భాల్లో అనూహ్యంగా రెండుసార్లు పట్టుబడింది.
- జూన్ 26న సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న బొలేరో ట్రాలీ వాహనం కట్టంగూరు వద్ద జాతీయ రహదారి పక్కన గుంతలో బోల్తా పడింది. వాహనంలోని సీట్ల మధ్య ఇంజిన్ బానెట్‌లో ఉన్న గంజాయి ప్యాకెట్లను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో సుమారు 80 కిలోల గంజాయి పట్టుబడింది.
- ఈ నెల 4న నకిరేకల్ మండలంలోని చందంపల్లి వద్ద 65వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 62 కిలోల గంజాయి పట్టుబడింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంజాయితో వెళ్తున్న కారు ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు తనిఖీ చేసి 62కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
- ఈ నెల 10న చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎల్బీనగర్ ఎస్వోటీ, చౌటుప్పల్ పోలీసులు తనిఖీలు నిర్వహించి ఉత్తరప్రదేశ్‌కు గుట్టుగా తరలిస్తున్న గంజాయి ముఠా గుట్టును రట్టు చేశారు. ఒడిశా రాష్ర్టానికి చెందిన ఓ వ్యక్తి సహకారంతో దందాను సాగిస్తుండగా.. మిక్సీ డబ్బాలో గంజాయి ప్యాకెట్లను పెట్టి రవాణా చేస్తుండడాన్ని చూసిన పోలీసులే విస్తుపోవాల్సి వచ్చింది.
- ఈ నెల 12న నకిరేకల్ పట్టణ శివారులో జాతీయ రహదారి నం.65పై పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి ముంబైకి తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. హైదరాబాద్ వైపుగా వెళ్తున్న స్కార్పియో వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించగా.. వాహనాన్ని ఓ చోట ఆపి అందులో ఉన్న స్మగ్లర్లు పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు సుమారు 80కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జాతీయ రహదారిపై పటిష్ట నిఘా
విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ర్టాలకు జాతీయ రహదారి 65ను కీలకంగా చేసుకొని స్మగ్లర్లు గంజాయిని తరలిస్తున్నారు. మాకున్న సమాచారం మేరకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. ఇటీవలి కాలంలో తరచుగా గంజాయి పట్టుబడటంతో ప్రత్యేక బృందాలు, స్థానిక పోలీసులు నిరంతరం గస్తీ చేపట్టేలా చర్యలు చేపడుతున్నాం. ఇతర రాష్ర్టాలకు చెందిన కీలకమైన వ్యక్తులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసి జైలుకు తరలించాం. ఇతర రాష్ట్రాల వాహనాల రాకపోకలపై 24గంటలు పర్యవేక్షణ ఉంచి మరింత కట్టుదిట్టమైన ప్రణాళికతో గంజాయి రవాణాను పూర్తిగా అడ్డుకుంటాం.
- కె. నారాయణరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, యాదాద్రి భువనగిరి జోన్
తాజావార్తలు
- వృద్ధులతో ప్రయాణమా..ఇలా చేయండి
- బీజేపీ దేశంలో విషం నింపుతుంది: శరద్‌పవార్
- ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
- ‘అధికారులను కర్రతో కొట్టండి’.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- శ్రీశైలం.. ఆది దంపతులకు వరసిద్ధి వినాయకుడి పట్టు వస్త్రాలు
- ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
- ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్