సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 17, 2020 , 02:12:58

వైభవంగా ఏకాదశి పూజలు

వైభవంగా  ఏకాదశి పూజలు

  • స్వామి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన 
  • కొనసాగిన నిత్య పూజలు 
  • దర్శనానికి పరిమితంగానే భక్తులు 
  • థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే అనుమతి


ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా గురువారం శ్రీస్వామి, అమ్మవార్లకు ప్రధానార్చకులు లక్ష పుష్పార్చనను కనులపండువగా నిర్వహించారు. సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలు కొనసాగాయి. ప్రతిమాసంలోని  శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి పర్వదినాలలో స్వయంభూ పంచ నారసింహుడు కొలువుదీరిన యాదాద్రిక్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చన చేయడం ఆనవాయితీ. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చకబృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ..

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనాలు కొనసాగించారు. క్యూ లైన్ల వద్ద భక్తులను భౌతికదూరం పాటించాలని ఆలయ సిబ్బంది సూచనలు చేశారు. 

శ్రీస్వామివారికి నిత్యపూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం నిత్యపూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఉదయాన్నే ఆలయంలో సుప్రభాతం నిర్వహించిన అర్చకులు బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు పంచామృతాలలో అభిషేకం చేపట్టారు.  శ్రీస్వామి అమ్మవార్లను తులసీ దళాలు, బంగారు పుష్పాలతో అర్చించారు. మంటపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణ వేడుకలు వైభవంగా జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నివేదన జరిపించి, శయనోత్సవం చేపట్టారు. 

VIDEOS

logo