ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 17, 2020 , 02:06:34

వందకు చేరువలో..

వందకు చేరువలో..

  • జిల్లాలో విజృంభిస్తున్న కరోనా 
  • రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 
  • గురువారం ఒక్కరోజే 16 కేసులు నమోదు 
  • మాస్క్‌లు, భౌతికదూరం తప్పనిసరి 
  • నేటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో ర్యాపిడ్‌ టెస్ట్‌లు

జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. చాపకింద నీరులా అన్ని గ్రామాలకు వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. పల్లె, పట్నం తేడా లేకుండా రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. గురువారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా 16 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 95కి చేరాయి. వలసొచ్చిన వారితోపాటు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్న వారితో మహమ్మారి సోకుతున్నది. కరోనా..కాదా? అని తేల్చేందుకు నేటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయనున్నారు. లక్షణాలున్న వారు మాత్రమే సదరు కేంద్రానికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి.  


భువనగిరి : కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తొలిరోజుల్లో కరోనా రహిత జిల్లాగా ఉన్న యాదాద్రి భువనగిరి కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులతో దూసుకుపోతుంది. జిల్లాలో గురువారం ఒక్కరోజే 16 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అందులో అడ్డగూడూరు-1, జూలూరు - 3, బీబీనగర్‌-2, భువనగిరి-7, బొమ్మలరామారం-1, శారాజిపేట-1, వలిగొండ-1 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 95 కేసులు నమోదయ్యాయి. 

సెంచరీకి చేరువలో... 

కరోనా రహిత జిల్లా నుంచి రోజు రోజుకూ కేసు లు పెరుగుతూ సంఖ్య సెంచరీకి చేరువలో వచ్చిం ది.ఈ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు పలు పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు కరోనా మహమ్మారిని ఇంటికి తీసుకువస్తారనే ఆందోళనలో కుటుంబీకులు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఎప్పుడు ఎవరికి కరోనా లక్షణాలు బయటపడుతాయో అన్న అనుమానాలతో ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి 

చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిపై వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కరోనాకు ఎవరూ అతీతులుకారని, ప్రతి ఒక్కరూ మాస్కు లు, శానిటైజర్‌ వినియోగించాలన్నారు. కరోనాను జయించేందుకు ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు.

 ఆలేరులో వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ 

ఆలేరుటౌన్‌ : ఆలేరు పట్టణానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి జ్యోతిబాయి గురువారం తెలిపారు. శివాల యం వీధికి చెందిన వృద్ధుడు అస్వస్థతతో ఉండగా, బంధువులు హైదరాబాద్‌లోని కామినేని దవాఖానకు తరలించారని అన్నారు. అక్కడి ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చిందని, అతని కుటుంబసభ్యులు, బంధువులను హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

 వలిగొండలో పదేండ్ల బాలికకు... 

వలిగొండ: మండల కేంద్రంలో పదేండ్ల బాలికకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌కళ్యాణ్‌ గురువారం తెలిపారు. ఇటీవల బాలిక తల్లికి కరోనా సోకిందని, కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించగా బాలికకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. 

జూలూరులో మరో ముగ్గురికి...

భూదాన్‌పోచంపల్లి : మండల పరిధిలోని జూలూరు లో గురువారం మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు. బుధవారం కరోనా బాధితుడితో కాంటాక్టులో ఉన్న ముగ్గురిని బీబీనగర్‌ ఎయిమ్స్‌కు తరలించి పరీక్షించగా పాజిటివ్‌ వచ్చిందన్నారు.

జానకిపురంలో...  

అడ్డగూడూరు: మండలంలోని జానకిపురం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గురువారం మండల వైద్యాధికారి నరేశ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని అపోలో దవాఖానాలో పని చేస్తున్న వ్యక్తి అనారోగ్యానికి గురికాగా, పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందని చెప్పారు. 

 హోంక్వారంటైన్‌లో 245మంది 

భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 245మందిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 95 మందికి పాజిటివ్‌ వచ్చిందని, 772 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించామని 10 మందిని ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచినట్లు చెప్పారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మండల వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ కల్యాణ్‌

వలిగొండ : కరోనా కట్టడికి ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారులు డాక్టర్‌ సుమన్‌కళ్యాణ్‌ అన్నారు. గురువారం మండలంలోని గోకారంలో ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులను పరీక్షల నిమిత్తం బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. అనంతరం గ్రామ ప్రజలతో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్‌, సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు నర్సింహ, సత్యవతి, వెంకటేశం, రాజేశ్వరి, సుజాత, ప్రఖ్యా, నాగమణి, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo