కో-ఆప్షన్ సందడి

- మున్సిపాలిటీల్లో మొదలైన ఎన్నికల సందడి
- జిల్లాలో ఆరు పురపాలక సంఘాలు.. 24 కోఆప్షన్ పదవులు
- భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో నోటిఫికేషన్ విడుదల
- మిగతా పురపాలికల్లో రేపో,మాపో రాక
- ముఖ్యనేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు
- గెలుపు ఏకపక్షమే అంటున్న గులాబీ పార్టీ శ్రేణులు
- చాన్నాళ్ల తర్వాత ఎన్నికల కోలాహలం
పురపాలికల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో చాన్నాళ్ల తర్వాత మున్సిపాలిటీల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఏడాది జనవరిలోనే మున్సిపాలిటీ ఎన్నికలు జరగగా, రెండు నెలల్లోపే కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కరోనా ప్రభావం, లాక్డౌన్ నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడింది. తాజాగా ఎన్నికల నిర్వహణకు డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో అన్ని మున్సిపాలిటీల్లో కోలాహలం ప్రారంభమైంది. ఇప్పటికే భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాగా, మిగతా వాటిల్లో రేపో మాపో విడుదల చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలుండగా, ఒక్కోదాంట్లో నలుగురు చొప్పున 24 మంది కోఆప్షన్ సభ్యులు ఉంటారు. నలుగురిలో ఇద్దరు మైనార్టీల నుంచి, మరో ఇద్దరు జనరల్ కేటగిరీ నుంచి ఎన్నుకుంటారు. పురపాలికల్లో పారదర్శక పాలన అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో నలుగురు కోఆప్షన్ సభ్యులను నియమిస్తున్నది. చేతులెత్తే పద్ధతిన ఈ ఎన్నిక నిర్వహించనుండగా, ఈ ప్రక్రియను దాదాపు నెలాఖరులోపు పూర్తి చేయనున్నారు. వివిధ సమీకరణాల వల్ల పదవులు దక్కనివారు కోఆప్షన్ గిరి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలాగైనా పదవి దక్కించుకునేందుకు ముఖ్యనేతల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఆరు పురపాలికల్లో గులాబీ పార్టీ కార్యవర్గాలే కొలువుదీరాయి. -యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,నమస్తేతెలంగాణ
జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య - 6
ఒక్కో మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యులు -4
వీరిలో మైనార్టీలు - ఇద్దరు (ఒకరు మహిళ)
జనరల్ - ఇద్దరు (ఒకరు మహిళ)
ఎన్నిక విధానం - చేతులెత్తే పద్ధతిన
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ‘మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 6 మున్సిపాలిటీలు భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు ఉండగా.. వీటి పరిధిలో 24 కో-ఆప్షన్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గాలు ఈ ఏడాది జనవరిలోనే కొలువుదీరగా.. రెండు నెలల వ్యవధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికను కూడా పూర్తి చేయాల్సి ఉన్నది. కానీ కరోనా.. లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే తాజాగా ఈనెల 8న కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఒకటి రెండు మున్సిపాలిటీల్లో నోటిఫికేషన్ జారీ కాగా, మిగతావాటిల్లో నేడో రేపో నోటిఫికేషన్ వెలువడనున్నది. దీంతో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా మున్సిపాలిటీల్లోని పాలకవర్గ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వీలుని బట్టి తేదీలను ఖరారు చేసుకొని ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రతి మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులు
ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఇదే క్రమంలో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచింది. దీంతో జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో నలుగురు కో-ఆప్షన్ సభ్యుల చొప్పున 24మంది కో-ఆప్షన్ సభ్యులు ఉండనున్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఉండే నలుగురు కో-ఆప్షన్ సభ్యుల్లో ఇద్దరు మైనార్టీ, మరో ఇద్దరు జనరల్ సభ్యులను ఎన్నుకోనున్నారు. వీరిలో మైనార్టీ నుంచి ఒక మహిళా సభ్యురాలిని, జనరల్ నుంచి ఒక మహిళా సభ్యురాలిని ఎన్నుకునేలా ప్రాధాన్యత కల్పించారు. మైనార్టీ కోటా కిందకు ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్దిస్ట్, పార్సీలు రాగా, జనరల్ సభ్యులుగా పోటీ చేసేందుకు పంచాయతీ, మున్సిపాలిటీలో నిర్ణీత పదవీకాలం పూర్తి చేసిన ప్రజాప్రతినిధులు అర్హులు. వీరితో పాటు గెజిటెడ్ హోదాలో రిటైర్డ్ అయిన వారికి కో-ఆప్షన్ సభ్యులుగా పోటీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. వీరంతా మున్సిపాలిటీలో ఓటు హక్కును కలిగి ఉండడంతో పాటు 21 ఏండ్లు నిండి ఉండేలా ప్రభుత్వం నిబంధన పెట్టింది.
జిల్లాలో వార్ వన్‌సైడే..
కో-ఆప్షన్ ఎన్నికల నోటిఫికేషన్‌తో మొదలైన పదవుల పందేరం ఆశావహుల్ని ఊరిస్తోంది. ఎప్పటి నుంచో ఈపదవుల కోసం వేచిచూస్తున్న వారంతా తమ పార్టీ అధిష్టానం సహా ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయ్యారు. జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీకి చెందిన వారే చైర్మన్ పదవుల్లో కొలువుదీరి ఉండడంతో కో-ఆప్షన్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్‌గానే నిలువనున్నదని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులకు గాను అధికార టీఆర్ఎస్ పార్టీ 15 వార్డులను గెలుచుకున్నది. ప్రస్తుతం కాంగ్రెస్, వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మద్దతిస్తుండడంతో అధికార పార్టీ బలం 18కి చేరింది. అలాగే యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను అధికార పార్టీ నాలుగు వార్డులను గెలుచుకోవడంతోపాటు ముగ్గురు ఎక్స్ ఆఫీషియో సభ్యుల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నది. మోత్కూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను టీఆర్ఎస్ 9 మెజార్టీ వార్డులను దక్కించుకున్నది. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 8 వార్డులను గెలుచుకున్న టీఆర్ఎస్ సీపీఎంకు చెందిన ముగ్గురు కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నది. భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలో 13 వార్డులకు గాను టీఆర్ఎస్ 10 వార్డులను గెలుచుకున్నది. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో 12వార్డులు ఉండగా.. 8 వార్డులను గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా మద్దతు తెలుపడంతో టీఆర్ఎస్ అభ్యర్థే చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతో జిల్లాలోని అన్ని కో-ఆప్షన్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకుంటుందన్న ధీమాలో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఇదిలా ఉండగా, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఇప్పటికే భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలలో నోటిఫికేషన్ వెలువడగా. మిగతా మున్సిపాలిటీల్లో నేడో.. రేపో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
చేతులెత్తే పద్ధతిలో ఎన్నికలు..
కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చేతులెత్తే పద్ధతిన కో-ఆప్షన్ ఎన్నికను నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తైన 15 రోజుల్లో చైర్మన్లు సభ్యులకు నోటీసులు జారీచేసి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అర్హులైన దరఖాస్తుదారుల జాబితాను కమిషనర్ కౌన్సిల్ ముందు ఉంచిన తరువాత హాజరైన సభ్యుల్లో మెజార్టీ ఆధారంగా కోఆప్షన్లను ఎన్నుకుంటారు. ఈ సమావేశంలో ఇతర అంశాలను చర్చించకుండా కో-ఆప్షన్ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తారు. కోరం లేక ఒకటి రెండు సమావేశాలు వాయిదాపడితే మూడవ సమావేశాన్ని కోరం లేకుండానే నిర్వహించి మూజువాణీ ఓటింగ్‌తో కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేసి కలెక్టర్‌కు, మున్సిపల్ డైరెక్టర్‌కు పంపనున్నారు.
తాజావార్తలు
- అగ్రిహబ్‌కు నాబార్డ్ 9 కోట్లు
- ఉప ఎన్నికలేవైనా.. గెలుపు టీఆర్ఎస్దే
- ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
- కరోనా టీకా తప్పక వేయించుకోవాలి
- వైభవంగా నిర్వహించాలి
- రెన్యూవబుల్ ఎనర్జీలో
- ధర్మపురి ఆలయానికి స్థపతి వల్లినాయగం
- 7న బ్రాహ్మణ పెద్దలతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి
- సినీ హీరోగా సింగరేణి బిడ్డ
- జగిత్యాల జిల్లాలో నెదర్లాండ్ మీడియా ప్రతినిధి