ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jul 15, 2020 , 23:48:02

జిల్లాలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌

జిల్లాలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని జూలూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతడిని హోం క్వారంటైన్‌ చేశామని తెలిపారు. అయితే అతని తల్లిదండ్రులతోపాటు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తిని కూడా బీబీనగర్‌ ఎయిమ్స్‌కు తరలించామన్నారు. అదేవిధంగా ప్రైమరీగా కాంటాక్టుగా ఉన్న 12 మంది, సెకండరీ కాంటాక్టుగా ఉన్న 11 మందిని కూడా హోం క్వారంటైన్‌ చేశామని తెలిపారు. ఇటీవల అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి రికవరీ కాగా ఇప్పుడు మరొకరికి పాజిటివ్‌ రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారన్నారు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అదేవిధంగా భీవనపల్లి గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వదంతులు వస్తున్నాయని అధికారికంగా ఎటువంటి రిపోర్టులు అందలేదని చెప్పారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందొద్దన్నారు. 

వంగపల్లిలో ఒకరికి.. 

ఆలేరు : యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాదికారి వంశీకృష్ణ తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో పరీక్షలు చేయించుకోగా బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన యువకుడితో ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న వ్యక్తులను గుర్తించి హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు.

చౌటుప్పల్‌లో మహిళకు..

చౌటుప్పల్‌ రూరల్‌ : మండలపరిధిలోని ఓ మహిళకు బుధవారం కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి డాక్టర్‌ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు ఆమె భర్తకు కూడా వచ్చిందన్నారు. ప్రస్తుతం వారిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు ఆయన తెలిపారు.

సిరిపురంలో యువకుడికి..

రామన్నపేట : మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కరోనా బారిన పడిన యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ నివాసం ఉంటూ అంబర్‌పేటలోని ఓ వైన్స్‌ దుకాణంలో పనిచేస్తుంటాడన్నారు.

హోం క్వారంటైన్‌లో  261 మంది

భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 261 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాంబశివరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 79 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, 723 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించామని చెప్పారు. ప్రభుత్వ క్వారంటైన్‌లో 8 మంది ఉన్నట్లు తెలిపారు.

VIDEOS

logo