ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 16, 2020 , 00:12:14

ఆశల సాగరం

ఆశల సాగరం

  • నాగార్జునసాగర్‌ ఆయకట్టుపై బోలెడాశలు 
  • ఎగువన పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
  • జూరాల నుంచి శ్రీశైలానికి మొదలైన ప్రవాహం
  • రెండువారాల ముందే కృష్ణానదికి వరద  
  • త్వరలో నీటి విడుదల ప్రణాళిక ఖరారు 
  • డ్యాం మరమ్మతులు పూర్తి : సీఈ నర్సింహ 


నల్లగొండ ప్రతినిధి నమస్తే తెలంగాణ/నాగార్జునసాగర్‌: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ఏడాది కృష్ణానదిలో ముందస్తుగానే జలకళ సంతరించుకున్నది. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో ఇప్పటికే ఆలమట్టి, నారాయణపూర్‌ నిండి జూరాల మీదుగా కృష్ణమ్మ శ్రీశైలం రిజర్వాయర్‌ను ముద్దాడింది. గత ఏడాదితో పోలిస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు వారాల ముందుగానే ప్రవాహం మొదలైంది. దీంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపైన ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం నిండితే ఆ నీరంతా నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌కే వచ్చి చేరనున్నది. ఇదే జరిగితే ఈ ఏడాది కూడా సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలోని దాదాపు 11లక్షల ఎకరాలకు సాగునీటికి ఢోకా ఉండకపోవచ్చు. గత ఏడాది మాదిరిగానే రెండు పంటలకు కూడా సమృద్ధిగా నీరు అందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో సాగర్‌ ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే నీటి విడుదల ప్రణాళికను కూడా అధికారులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. 

నాగార్జునసాగర్‌పైనే ఆశలు 

కృష్ణానదిలోకి కొనసాగుతున్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్‌పైనే ఆశలు చిగురిస్తున్నాయి. గత ఏడాది కంటే ముందుగానే ఈ సారి సాగర్‌కు కూడా వరద రావచ్చని భావిస్తున్నారు. రాష్త్రంలోని జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ నీరంతా మంగళవారం రాత్రి నుంచి శ్రీశైలం రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్నది. దీంతో శ్రీశైలంలో క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. కృష్ణానదిలోకి సాధారణంగానే అక్టోబర్‌ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు జలకళ సంతరించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక నాగార్జునసాగర్‌లోనూ నీటిమట్టం ఈ ఏడాది ఇప్పటికీ ఆశాజనకంగానే ఉన్నది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 41 టీఎంసీల నీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తు తం 529.90 అడుగుల నీరు ఉన్నది. టీఎంసీల లో చూస్తే... 312టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికిగానూ ఇప్పుడు 167.95టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గత ఏడాది జూలై 15వ తేదీన పరిశీలిస్తే ఇదే సమయానికి 507 అడుగుల వద్ద 126 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22అడుగుల మేర 41 టీఎంసీలు అదనంగా నీరుసాగర్‌లో అందుబాటులో ఉన్నది. 

శ్రీశైలంలోకి భారీగా  చేరుతున్న వరదనీరు

ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లు నిండటంతో ఆ నీరు జూరాలను ముంచెత్తుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు పూర్తిస్తాయి సామర్థ్యానికి చేరుకోవడంతో గేట్లను ఎత్తారు. ఆ నీరంతా శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలంలో 24 గంటల్లో ఒక అడుగు మేర నీటిమట్టం పెరిగింది. బుధవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి శ్రీశైలం రిజర్వాయర్‌కు మొత్తం 73,879 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్ల్లోగా వచ్చి చేరుతోంది. ఇందులో హంద్రీ నుంచి 1100 క్యూసెక్కులు వస్తుండగా మిగతాదంతా జూరాల ప్రాజెక్టు నుంచే వస్తోంది. శ్రీశైలంలో బుధవారం సాయంత్రానికి 816.50 అడుగుల నీటిమట్టం ఉండగా 38.30 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా నీటి నిల్వ సామర్థ్యం 215.87 టీఎంసీలుగా ఉన్నది. కాగా జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు  క్రస్ట్‌గేట్ల ద్వారా, పవర్‌ హౌస్‌ ద్వారా నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ వరద దాదాపు మరో మూడు నెలల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  

గత ఏడాది రికార్డు స్థాయిలో వరద

 గత ఏడాది వచ్చిన వరద నాగార్జునసాగర్‌ చరిత్రలో ఓ మైలురాయి లాంటిదే. డ్యాం నిర్మాణం అనంతరం ఎన్నడూ లేనివిధంగా సాగర్‌ క్రస్ట్‌గేట్లను అత్యధిక కాలం ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం వరద రికార్డును పరిశీలిస్తే... 2019లో నాలుగు నెలల పాటు 26 క్రస్ట్‌ గేట్ల ద్వారా 698 టీఎంసీల నీటిని దిగువన కృష్ణానదిలోకి విడుదల చేశారు. వందలాది టీఎంసీల నీరు పులిచింతల మీదుగా సముద్రంలో కలిసిపోయింది. 2019లో నాగార్జునసాగర్‌ డ్యాంకు మొత్తం 1374 టీఎంసీల నీరు వచ్చి చేరగా సాగర్‌ ఆయకట్టులో సాగునీటి కోసం ఎడమ కాల్వ ద్వారా 132 టీఎంసీలు, కుడికాల్వ ద్వారా 160 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 219 టీఎంసీలు, క్రస్ట్‌ గేట్ల ద్వారా 698 టీఎంసీల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇక 2009 సెప్టెంబర్‌లో కృష్ణానది ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. శ్రీశైలం క్రస్ట్‌గేట్ల మీదుగా దూకి సాగర్‌ను ముంచెత్తింది. ఆ ఏడాది కూడా సాగర్‌ డ్యాం 26 క్రస్ట్‌ గేట్ల నుంచి నెల రోజులు 473 టీఎంసీల నీరు  సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత మరోసారి 2014లో డ్యాం గేట్లు తెరుచుకున్నాయి. 2018అక్టోబర్‌లోనూ సాగర్‌ పూర్తిగా నిండడంతో ఒక రోజు మాత్రమే రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక 2019లో మాత్రం ఊహించని విధంగా సుదీర్ఘకాలం వరద ప్రవాహం కొనసాగింది.

ఆనందంలో ఆయకట్టు రైతాంగం

కృష్ణానదిలో వరద ప్రవాహం వల్ల నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ముందస్తుగానే సాగునీటి విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు కింద రెండు రాష్ర్టాల్లో కలిపి దాదాపు 11లక్షలకు సాగునీటిని విడుదల చేస్తుంటారు. గత ఏడాది రెండు పంటలకు పూర్తి స్తాయిలో నీటిని విడుదల చేశా రు.  వేసవిలోనూ తాగునీటి అవసరాలతో పాటు చెరువులను నింపేందుకు కూడా కాల్వల్లో నిరంతరం నీటి విడదల కొనసాగింది. అయినా సాగర్‌లో ప్రస్తుతం 529.90 అడుగుల నీరు ఉండడం గమనార్హం. కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా దాదాపు 19 అడుగుల నీరు అదనంగానే ఉన్నది. ఈ ఏడాది నీటి విడుదల ప్రణాళికపై అధికారులు దృష్టి సారించారు. గత సంవత్సరం అగస్టులో నాగార్జునసాగర్‌కు డ్యాంలోకి ఇన్‌ఫ్లో మొదలవ్వగా అదే నెల 11 వతేదీ నుంచి ఎడమకాల్వకు నీటి విడుదల చేశారు. గత ఏడాది రెండు పంటలకు కూడా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో  ఆయకట్టుకు సాగునీటిని అందించారు. ఈ ఏడాది కూడా పరిస్థితి పూర్తి ఆశాజనకంగా కనిపిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

ముందుగానే సాగర్‌కు వరద : డ్యాం సీఈ నర్సింహ

కృష్ణాపరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో నాగార్జునసాగర్‌ జలాశయానికి ముందస్తుగానే వరద రావచ్చని అంచనా వేస్తున్నట్లు డ్యాం సీఈ నర్సింహ తెలిపారు. వరద వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో డ్యాం వద్ద మరమ్మతులు కూడా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. డ్యాంసేఫ్టీ రివ్యూ ప్యానల్‌ కమిటీ  సూచనల ప్రకారం డ్యాం పటిష్టతకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. డ్యాం క్రస్ట్‌ గేట్ల రబ్బర్‌సిలింగ్‌, రోప్‌వైర్లు మార్పిడి, గేట్లకు అమర్చిన మోటర్ల వోరాయిలింగ్‌ల మరమ్మతులు, నిర్వహణ పనులపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. డైవర్షన్‌ టన్నెల్‌ మూసివేత పనులు పూర్తి చేశామని, డ్యాంపై లెఫ్ట్‌ టవర్‌ కంట్రోల్‌రూంలో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వరదనీటిని పర్యవేక్షిస్తామన్నారు. గత రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతి మంచి ఫలితాలు ఇచ్చిందని, ఈ సారి కూడా అదే పద్ధతిలో పంటలకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. 

VIDEOS

logo