శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 15, 2020 , 23:36:53

వ‌ర్షాతిరేకం

వ‌ర్షాతిరేకం

  • జిల్లావ్యాప్తంగా జోరు వాన
  • మోస్తరు నుంచి భారీ వర్షాలు 
  • చెరువులు, కుంటల్లోకి చేరుతున్న వరద 
  • మెట్ట పంటలకు ఊపిరి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ/భువనగిరి/బీబీనగర్‌/ఆత్మకూరు(ఎం)/మోటకొండూర్‌/ఆలేరు/గుండాల:   జిల్లా వ్యాప్తంగా బుధవారం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.  రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో వీధులన్నీ జలమయమయ్యాయి.పొలాల్లోకి సైతం వర్షం నీరు వచ్చి చేరింది.కొన్ని చోట్ల చెట్లు సైతం విరిగిపడ్డాయి. జూన్‌  నుంచి  జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 222.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  జిల్లాలోని 14 మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. గుండాలలో 36.2మిల్లీమీటర్లు,  మోత్కూరులో 19.8 మిమీ,రాజాపేటలో 17.4మిమీ, తుర్కపల్లిలో 15.6మిమీ, ఆత్మకూరు(ఎం)లో 15.2మిమీ, భువనగిరిలో  12.2మిమీ, ఆలేరులో 9.4మిమీ, యాదగిరిగుట్టలో 9.2మిమీ, వలిగొండలో 7.8మిమీ, బీబీనగర్‌లో 7మిమీ, బొమ్మలరామారంలో 5.6మిమీ, రామన్నపేటలో 4మిమీ, భూదాన్‌పోచంపల్లిలో 2.6మిమీ,చౌటుప్పల్‌లో 2.4మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. 

బీబీనగర్‌తో పాటు పలు గ్రామాల్లో జోరు వాన కురిసింది. జమీలాపేట్‌, రాయరావుపేట గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. దీంతో ఇటీవల వేసిన వరినాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నీట మునిగిన పొలాలను ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌ పరిశీలించారు. బీబీనగర్‌లోని హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచి వాహనదారులకు ఇబ్బందిగా మారింది.  ఆత్మకూరు(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో చిరుజల్లులు పడ్డాయి. మోటకొండూర్‌తో పాటు పలు గ్రామా ల్లో  ఓ మోస్తరు వర్షం కురిసింది.  యాదగిరిగుట్ట పట్టణంతో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.  సైదాపురం, మాసాయిపేట, గౌరాయిపల్లి గ్రామాల్లో మోస్తరు వర్షం పడగా, వంగపల్లి, చిన్నకందుకూరు, చొల్లేరు, మర్రిగూడెం, మహబూబ్‌పేట, పెద్దకందుకూరు, బాహుపేట, కాచారం గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.   పత్తి, కంది విత్తనాలు వేసిన రైతులు  ఆనందం వ్యక్తం చేశారు. భువనగిరి పట్టణంలో భారీ వర్షం పడింది. మండలంలోని పలు గ్రామాల్లో మోస్తరు  వర్షం కురిసింది.  గుండాల మండలంలోని  వస్తకొండూరులో మోస్తరు వర్షం పడింది. పలు ఇండ్లలోకి  నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. 

VIDEOS

logo