ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 15, 2020 , 01:08:42

కరోనాకు వంటింట్లోనే వైద్యం

కరోనాకు వంటింట్లోనే వైద్యం

కరోనా... పేరు వింటేనే జనం వణికిపోతున్నారు. రోజు రోజుకు విస్తరిస్తున్న వైరస్‌తో కలవరం పెరిగిపోతున్నది. లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉన్న ప్రజల ఆలోచనలు ఒక్కసారిగా మారిపోయాయి. కరోనాతో కలిసి జీవించక తప్పని పరిస్థితుల్లో జీవన విధానమూ పూర్తిగా మారిపోయింది. ఆహారపు అలవాట్లలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కరోనా వ్యాక్సిన్‌ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన వారు, ఇప్పుడు కరోనా రాకుండా జాగ్రత్త పడటమే మేలని భావిస్తునారు. ఇందుకోసం కొవిడ్‌ - 19 నిబంధనలు పాటిస్తూ, శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడమే ఏకైక మార్గం. ఈ క్రమంలో వంటిల్లే వైద్యశాల అయింది. కాఫీ, టీలు పక్కకు పోయి కషాయాలు వచ్చి చేరాయి. హోటల్‌ బిర్యానీలు, జంక్‌ ఫుడ్‌లను దూరం పెట్టి ఇంటి భోజనానికే జై కొడుతున్నారు. మందుల దుకాణాల్లోని మల్టీ విటమిన్‌ మాత్రల కంటే, కిరాణా దుకాణాల్లోని అల్లం, మిరియాలు, సొంటి, దాల్చిన చెక్కలకే గిరాకీ పెరిగింది. ఈ క్రమంలో వంటింట్లోని ఆరోగ్య ప్రదాయినిలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..  

ఆలేరు: ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌తో ప్రజల్లో ఆలోచనలు మారాయి. ఆహారపు అలవాట్లు, ఆరోగ్య చిట్కాలలో మార్పులు వచ్చాయి. నిన్నటి వరకూ పట్టించుకోని పసుపు, అల్లం, మిరియాలు, తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యత వచ్చింది. కరోనాకు విరుగుడుగా గుర్తించిన ఈ కషాయాలను ఇప్పుడు ప్రతి ఇంట్లో వాడటం ప్రారంభమైంది. నాడు పెద్దలు చెప్పిన విధంగా ప్రతి ఇంట్లోనే కరోనాకు మం దులు ఉన్నాయని కేంద్ర ఆయుష్‌శాఖ  ప్రకటించింది. పసుపు వేసుకుని వేడి నీళ్లు, అల్లం, తులసి వంటి కషాయాలను తీసుకుంటే కరోనా వచ్చినా నవ్వుతూ ఎదుర్కొన వచ్చునని చెబుతున్నారు. 

ఆరోగ్యం కోసం వాకింగ్‌, రన్నింగ్‌, యోగ, మొలకెత్తిన గింజలు తినడం.. ఎప్పటికప్పుడు షుగర్‌, బీపీ చెక్‌ చేసుకోవడం.. ఇవీ ఇప్పటివరకు ఉన్న దినచర్య. కానీ కరోనా వైరస్‌ విజృంభణతో ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ప్రకృతి, సంప్రదాయ, దేశీయవైద్యం వైపు ప్రజలు దగ్గరయ్యారు. కరోనాకు మందు లేదని ఇంటి చిట్కాలు, ఆయుర్వేద వైద్యమే మేలని ప్రతి ఒక్కరూ సంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.  

పెరిగిన గిరాకీ

మందుల దుకాణాల్లో మల్టీ విటమిన్‌ మాత్రల కంటే ఆయుర్వేద మందులకు డిమాండ్‌ పెరిగింది. ఎసిడిటీకి కారకాలంటూ పక్కన పెట్టిన మిరియాలు, అల్లం, సొంటి, దాల్చిన చెక్క తదితర విక్రయాలు గణనీయంగా పెరిగాయి. మసాల దినుసులతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఫ్రూట్స్‌ను కూడా ఎక్కువగా తింటున్నారు. కరోనా నేపథ్యంలో మిగిలిన దుకాణాలు వెలవెల పోతుండగా, ఇంటి వైద్య సామానుకు మాత్రం భలే గిరాకీ ఉంటుంది. ఇవి విక్రయించే దుకాణాలు ప్రత్యేకంగా వెలుస్తున్నాయి.

కషాయాలతో కరోనా దూరం

ఆరోగ్య సమస్యలైన షుగర్‌, బీపీ, స్థూలకాయం నివారణ కోసం చేసే వ్యాయామాలను పక్కన పెట్టి, కరోనా నుంచి కాపాడుకోవడానికి టీ, కాఫీ స్థానంలో కషాయాలు వచ్చి చేరాయి. హోటల్‌ భోజనాలు, జంక్‌ఫుడ్‌లు తగ్గించి ఇంటి కూరల్లో దేశీయ వైద్య దినుసులు ఉండేలా చూసుకుంటున్నారు. ఇంగ్లిష్‌ మందులు రోగ క్రిమిని చంపుతాయని, దేశీ వైద్య విధానం రోగ నిరోధశక్తిని ఇస్తుందని పెద్దలు చెబుతుంటే ఆసక్తిగా వింటున్నారు. ఇంటర్నెట్‌లోనూ ఇంటి చిట్కాల గురించి వెతుకుతున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు భౌతికదూరం, శానిటైజేషన్‌, మాస్కుతోపాటు కషాయం కూడా వచ్చి చేరింది. 

తులసి ఆకు..

తులసి ఆకు నేరుగా నమలడం వల్ల సూక్ష్మక్రిములు, వ్యాధికారకాలను బాహ్యంగా, అంతర్గతంగా చంపడానికి సహాయపడుతుంది. అలాగే ఇది రోగ నిరోధక శక్తి పెంచడంలో ప్రాముఖ్యత వహిస్తుంది. 

నల్ల మిరియాలు..

నల్ల మిరియాలు రోజూ భోజనంలో తీసుకుంటే ఇవి సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

పసుపు

పసుపు సహజ సిద్ధమైన యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. కుర్కుమిన్‌ అనే పదార్థంలో యాంటీఇన్‌ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌తో పాటు రోగనిరోధన వ్యవస్థను బలోపేతం చేసే గుణాలున్నాయి. పసుపులో కేన్సర్‌తో పోరాడే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను అడ్డుకునేందుకు పసుపు ఓ ఔషధంగా పనిచేస్తుంది. 
అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అల్లంతో అజీర్తి తగ్గడంతో పాటు జలుబు, ఫ్లూ, కరోనా వైరస్‌ వంటి వ్యాధిని సైతం నయం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

ఇంటి వైద్యమే మేలు 

మా చిన్నతనంలో దవాఖానకు పోవడం చాలా తక్కువ. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే ఇంటి వైద్యమే చేసేవారు. జర్వమొస్తే మిరియాల కషాయం ఇచ్చేవారు. జలుబు, దగ్గుకు కూడా ఇంటి మందులే. వేడి నీటిలో పసుపు, నీలగిరి తైలం కలిపి బాగా ఆవిరి పట్టించేవారు. మళ్లీ ఇన్నాళ్లకు కరోనా కారణంగా దేశీయ వైద్యానికి ప్రాధాన్యం పెరిగింది. - ఉషా కిరణ్‌, జాల గ్రామం, రాజాపేట మండలం.  

కషాయమే మంచిది 

పెరటిమొక్క వైద్యానికి పనికిరాదన్నట్లు సంప్రదాయ వైద్యాన్ని చులకన చేశాం. సరైన సంప్రదాయ వైద్యంతో కరోనాను తగ్గించడానికి ఐదురోజులు చాలు. అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు వేసిన వేడి నీటిలో రుచికోసం కొద్దిగా బెల్లం కలిపి ఆ కషాయాన్ని రోజూ రెండు, మూడుసార్లు తాగాలి. వేడినీటిని పసుపుతో కలిపి పుక్కిలించాలి. ఆవిరి పట్టాలి. వెల్లుల్లిని తరుచూ వాడాలి.  సి-విటమిన్‌ గల ఆహారం తీసుకోవాలి. - డాక్టర్‌ జయశ్రీ, ఆయుర్వేద వైద్యాధికారిణి, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆత్మకూరు(ఎం)

దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క వాడటం వల్ల దగ్గు, పార్శ నొప్పి, స్వరపేటిక వాపు, బొంగురు పోవడం వంటి వ్యాధులతోపాటు కరోనా వ్యాధి తీవ్రతను  అడ్డుకునేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

నిమ్మరసం..

వైరస్‌, బ్యాక్టీరియా నుంచి కాపాడటానికి విటమిన్‌ సి చాలా అవసరం. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్‌ సి  రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 

VIDEOS

logo