ప్రగతి నిధులు తీరుతున్న వెతలు

- జూలై మాసానికి పల్లెప్రగతి నిధులు
- రూ.8.77 కోట్లు విడుదల
- జనాభా ప్రాతిపదికన నిధుల సర్దుబాటు
- కరోనా సంక్షోభంలోనూ అభివృద్ధి మరువని సర్కారు
- పల్లెల బాగే ధ్యేయంగా ప్రతినెలా నిధుల విడుదల
- తొలిసారి మండల, జిల్లా పరిషత్‌లకు డబ్బుల కేటాయింపు
- పైసలకు ఢోకా లేకుండా చూస్తున్న ప్రభుత్వం
- పుంజుకోనున్న డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలు, ప్రకృతి వనాల నిర్మాణాలు
పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రారంభించిన పల్లెప్రగతి పనులు సత్ఫలితాలిస్తున్నాయి. ఐక్యంగా గ్రామస్తులంతా తమ గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటున్నారు. పారిశుధ్య నిర్వహణ చేపడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్లెప్రగతిలో చేపట్టే పనుల కోసం ప్రభుత్వం ప్రకటించినట్లు ప్రతినెలా ఠంఛన్‌గా నిధులు విడుదల చేస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయకుండా నిధులు సమకూర్చుతున్నది.
జూలై మాసానికి సంబంధించి పల్లెప్రగతి నిధులు రూ.8.77 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా, ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 50 శాతం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 50 శాతం నిధులతో కలిపి ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి వెచ్చిస్తున్నది. ఈసారి పల్లెలతోపాటు తొలిసారి జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు నిధులను కేటాయించారు. జిల్లావ్యాప్తంగా జిల్లా పరిషత్‌లకు రూ.29.23లక్షలు, మండల పరిషత్‌లకు రూ.58.47 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.7.89 కోట్లు లెక్కన మొత్తంగా రూ.8.77 కోట్లు విడుదల చేసింది. జిల్లాలో 421 పంచాయతీలు ఉండగా, కేటాయించిన నిధులను జనాభా ప్రాతిపదికన సర్దుబాటు చేయనున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీవో) నుంచి ఖజానా శాఖకు, అక్కడి నుంచి పంచాయతీ ఖాతాల్లో నిధులను జమ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో కొన్ని పొదుపు చర్యలు పాటిస్తూనే ఆ నిధులను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మళ్లిస్తున్నది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు వంటి పథకాలను కొనసాగించి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి నెలనెలా పల్లె ప్రగతి కార్యక్రమం అమలుకోసం నిధులు కేటాయిస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా.. జూలైకి సంబంధించిన నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు 14వ ఆర్థిక సంఘం నిధుల్లో వంద శాతం గ్రామ పంచాయతీలకే కేటాయిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన నిధుల్లో మాత్రం ఈసారి జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు సైతం ప్రాధాన్యత కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు 85 శాతం, మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్‌లకు 5 శాతం చొప్పున నిధులు కేటాయించనున్నారు. 2011 జనాభా ప్రాతిపాదికన మూడు విభాగాల్లో సాధారణ, ఎస్టీ, ఎస్సీల కేటగిరీల వారీగా నిధులు ఖర్చు చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన నిధులతో గ్రామ పంచాయతీలతోపాటు, నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మండల, జడ్పీలకు ఆర్థిక భరోసా కలిగినట్లయింది.
జిల్లాకు రూ.8.77కోట్లు మంజూరు..
జిల్లాలో చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం కోసం జూలైకి ప్రభుత్వం రూ.8.77 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. తాజాగా విడుదలైన నిధుల్లో గ్రామ పంచాయతీలకు రూ.7,89,85,200, మండల పరిషత్‌లకు రూ.58,47,300, జిల్లా పరిషత్‌లకు రూ. 29,23,800 కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని 421 పంచాయతీలకు కేటాయించిన నిధులను జనాభా ప్రాతిపదికన సర్దుబాటు చేయనున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి ట్రెజరీకి.. అక్కడి నుంచి పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. క్యాపిటల్ వర్క్స్ కింద 50 శాతం నిధులు, పారిశుధ్య నిర్వహణకు 25 శాతం, తాగునీటి వసతికి 25 శాతం మేర ఖర్చు చేసేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సీసీ రోడ్లు, మురుగు నీటి కాల్వల నిర్మాణానికి 50 శాతానికి మించి ఖర్చు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
చేయాల్సిన పనులు ఇవే..
- గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ మెరుగులో భాగంగా మురుగునీటి కాల్వల నిర్మాణం, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ఖర్చు చేయవచ్చు.
- తాగునీటి పైపులైన్ల ఏర్పాటుతోపాటు మోటార్ల కొనుగోలు, చేతిపంపులు, పవర్ బోరు నిర్వహణ తదితరాలకు ఖర్చు చేయవచ్చు.
- అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు మరమ్మతులకు నిధులు వెచ్చించవచ్చు.
- అంగన్వాడీ కేంద్రాలు, ఏఎన్ఎం, సబ్ సెంటర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, సామాజిక భవనాలకు సంబంధించిన నిర్మాణ పనులకు వినియోగించవచ్చు.
- వీధి దీపాల నిర్వహణతోపాటు ఎల్ఈడీ దీపాలు, విడి భాగాల కొనుగోలు,
- మరమ్మతులకు నిధులను కేటాయించవచ్చు.
- శ్మశానవాటికలకు ఫెన్సింగ్ ఏర్పాటు, అందులో నీటివసతి, మొక్కలు నాట డం, సంరక్షణ వంటి పనులకు ఖర్చు చేయవచ్చు.
తాజావార్తలు
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం
- కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
- ఐపీఎల్- 2021కు ఆతిథ్యమిచ్చే నగరాలు ఇవేనా?
- అలిపిరి నడకమార్గంలో భక్తుడు గుండెపోటుతో మృతి
- చైనాకు అమెరికా బాకీ.. ఎంతంటే..?
- పొరపాటున గన్‌తో వ్యక్తి కాల్పులు.. మరణించిన మేనల్లుడు
- కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలయ్యిందా..?
- అనసూయ మాస్ మసాలా డ్యాన్స్.. స్టిల్స్ చక్కర్లు
- మార్చి 16న న్యూ ఐపాడ్ ప్రొ, యాపిల్ టీవీ, ఐమ్యాక్ లాంఛ్‌కు యాపిల్ సన్నాహాలు!
- రూ. 2937 కోట్లతో టీటీడీ బడ్జెట్‌కు ఆమోదం