బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 13, 2020 , 00:02:59

అల యాదాద్రిలో...

అల యాదాద్రిలో...

  • తుది దశకు చేరిన ప్రధాన ఆలయ పనులు
  • గోపురాలు, మండపాలకు తుది మెరుగులు
  • ఆధ్యాత్మిక భావన కలిగించేలా నిర్మాణాలు 
  • అడుగడుగునా అద్భుత రాతి శిల్పాలు 
  • ఆలయం మెరిసిపోయేలా విద్యుత్‌ సొబగులు 
రాష్ర్టానికి ఇలవేల్పుగా.. తలమానికంగా భావించే యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు జోరందుకున్నాయి. వచ్చే బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలన్న సంకల్పంతో పనులు సాగుతున్నాయి. ప్రధానాలయం, రాజగోపురాలు, మాడ వీధులు, ఆలయ నగరి ఇలా.. పంచనారసింహుల క్షేత్రం కండ్లకు కట్టేలా రూపుదిద్దుకుంటుంది. గర్భాలయ పనులు పూర్తికావొస్తుండగా.. ప్రధాన ఆలయం పనులు తుది దశకు చేరుకున్నాయి. రాజసాన్ని చాటిచెప్పే రాజగోపురాలు.. ఆకర్షిస్తున్న అష్టభుజి మండపాలు.. అద్భుత శిల్పకళా సౌందర్యాలతో భక్తులను అలరించేలా ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆధార శిల నుంచి గోపురాల వరకు కృష్ణశిలతో చేపడుతున్న ఆలయ సప్త రాజ గోపురాలు, వివిధ మండపాలు ఆకట్టుకుంటున్నాయి. వెండి మెరుపులు, బంగారు తాపడాలతో యాదాద్రికి మరింత వైభవం రానున్నది. వీటితోపాటు ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను విద్యుత్‌ కాంతులతో జిగేల్‌ మనిపించేందుకు వైటీడీఏ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రిని మహాదివ్యంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. అత్యద్భుత, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మూడేండ్ల కిందట చేపట్టిన బృహత్తర కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. సీఎం కార్యాలయ నిరంతర పర్యవేక్షణలో 4.25 ఎకరాలలో జరుగుతున్న ప్రధాన ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గర్భాలయం, ముఖ మండపం, అళ్వార్‌ పిల్లర్‌, కాకతీయ స్తంభాలు, వేంచపు మండపం, అంతర, బాహ్య ప్రాకార మండపాలు, అష్టభుజి మండపాలు, దివ్య విమానం, ఆరు రాజగోపురాలు, బ్రహ్మోత్సవ మండపం, పుష్కరిణి మండపం వంటి పనులు పూర్తి కావొస్తుండగా.. తుది మెరుగులు దిద్దుతున్నారు.