మంగళవారం 04 ఆగస్టు 2020
Yadadri - Jul 12, 2020 , 00:02:09

క‌క్కిరేణి క‌దిలింది

క‌క్కిరేణి క‌దిలింది

  • అవయవదానంలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామస్తులు 
  • 70 మందికి పైగా అవయవదాన హామీ పత్రాలు అందజేత 
  • పంచాయతీ పాలకవర్గంలోనూ ఎనిమిది మంది సభ్యులు.. 
  • బుక్క ఈశ్వరయ్య స్ఫూర్తితో కదిలిన జనం  
  • రాజకీయకక్షలు రగిలిన గ్రామంలో  ఐక్యతారాగం 
  • ఈ పల్లె మరింత మందికి స్ఫూర్తి 

మనం బాగుంటే చాలు..పక్కోళ్లకు ఏమైతే నాకేంది అనుకుంటున్న ఈ రోజుల్లో తాము మరణించిన తర్వాత తమ అవయ వాలను మరొకరికి అందించి వారికి ఓదార్పు ఇవ్వాలని గ్రామస్తులు కదిలారు. రాజకీయకక్షలు రగిలిన ఆ గ్రామంలో ఐక్యతతో ముందుకురావడం కొత్తదనాన్ని నింపుతున్నది. రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామవాసులు అవయదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందు కొచ్చి ఆదర్శంగా నిలిచారు. తాము చనిపోయిన తరువాత తమ అవయవాలు మరొకరి ప్రాణాలు కాపాడడానికి ఉపకరించాలనే సదాశయం మరింత మందికి స్ఫూర్తినిస్తున్నది. వీరి ఆశయానికి పంచాయతీ పాలకవర్గం కూడా తోడుగా నిలిచింది. గ్రామానికి చెందిన 70 మందికి పైగా అవయవదాన హామీప త్రాలను ఇటీవల ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ పుల్లారావుకు అందజేశారు. అవయవదాన హామీపత్రాలు ఇచ్చిన వారిలో మహిళలు కూడా ఉండడం విశేషం. గ్రామపం చాయతీ పాలకవర్గసభ్యుల్లో 8 మంది సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు రావడం అభినంద నీయం. కక్కిరేణి గ్రామం మాదిరి మిగతా వి ముందుకొస్తే అవయవాల్లేక జీవచ్చావల్లా ఉన్న ఎంతోమందికి కొత్త జీవితమిచ్చినట్లువుతుంది.         

రామన్నపేట : మండల కేంద్రానికి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్కిరేణి గ్రామం రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది. అదేస్థాయిలో రాజకీయ కక్షలు కూడా ఉండేవి. ఇటీవల గ్రామానికి చెందిన యువకులు రాజకీయాలకతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యను ఆదర్శంగా తీసుకొని ప్రజావాణి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రంథాలయం వేదికగా అనేక సామాజిక కార్యక్రమాలు, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. యువకులు చేపడుతున్న కార్యక్రమాలకు గ్రామపెద్దలు తోడయ్యారు. 

ఈశ్వరయ్య స్ఫూర్తితో...

కక్కిరేణి గ్రామానికి చెందిన బుక్క ఈశ్వరయ్య 30 సంవత్సరాల కిందట నల్లగొండలో స్థిరపడ్డారు. సంఘసేవకుడైన ఈశ్వరయ్య తన స్వగ్రామాన్ని మరువలేదు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సభ్యుడు అయిన ఈశ్వరయ్య గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఆయన స్ఫూర్తితో గ్రామస్తులు కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. ఇటీవల సుమారు 70 మంది నల్లగొండలోని రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవయవదాన కార్యక్రమంలో హమీపత్రాలను అందజేశారు. గ్రామానికి చెందిన కన్నెబోయిన సూరయ్య(55) ఏడునెలల కిందట మరణించగా కుటుంబసభ్యులు అతని కండ్లను దానం చేశారు. 

పాలకవర్గమే ముందుకొచ్చింది 

అవయవదానం చాలా మంచి కార్యక్రమం. మా గ్రామంలో బుక్క ఈశ్వరయ్య శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మా పంచాయతీ పాలకవర్గం మద్దతు పలికింది. పాలకవర్గంలో ఎనిమిది మంది సభ్యులం మొదటగా సంతకాలు చేశాం. అనంతరం గ్రామంలో యువత కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం గొప్ప విషయం. అందరికీ అభినందనలు.

- వేముల సైదులు, వార్డు సభ్యుడుlogo