ఆదివారం 09 ఆగస్టు 2020
Yadadri - Jul 11, 2020 , 00:10:38

ఆత్మైస్థెర్యం ముందు చిన్నబోయిన వైరస్‌

ఆత్మైస్థెర్యం ముందు చిన్నబోయిన వైరస్‌

 •  ప్రభుత్వ వైద్యుల కృషితో ఆరోగ్యంగా ఇంటిబాట
 • కరోనా వస్తే కంగారు పడొద్దు...
 • కొద్దిపాటి చిట్కాలతోనే కరోనాకు చెక్‌
 •  ‘నమస్తేతెలంగాణ’తో బాధితుల మనోగతం 
 • జిల్లాలో కరోనా హీరోలు 
 • ఆత్మైస్థెర్యంతో వైరస్‌ను  జయించిన బాధితులు 
 • సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పయనం 
 • చక్కటి చిట్కాలు, నిత్యం వ్యాయామంతో ఆరోగ్యం పదిలం  
 • బలవర్థకమైన ఆహారంతో వైరస్‌ పరార్‌ 
 • బాధితుల్లో కానిస్టేబుల్‌, వలసకూలీలు 
 • కరోనా వస్తే కంగారొద్దంటున్న బాధితులు 
 • ఆస్పత్రి నుంచి ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత దంపతుల డిశ్చార్జి 

విశ్వమారి కరోనా పేరు వింటేనే ఇపుడు హడల్‌. ఎక్కడి  నుంచి ఒంట్లోకి ప్రవేశిస్తుందోనన్న భయం. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా వైరస్‌ చొరబడకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 

అత్యవసర పనుల మీద బయటకెళ్లినా ప్రతిఒక్కరికీ మాస్కు తప్పనిసరయ్యింది. భౌతికదూరం పాటించడం అనివార్యమైంది. 

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏదోపనిమీద బయటకెళ్లినప్పుడో, విధి నిర్వహణలోనో అనేకమంది వైరస్‌ బారిన పడుతున్నారు. ఇలా కరోనా సోకిన వారు ఎంతో ధైర్యంతో, గుండె నిబ్బరం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికొచ్చారు. ‘తొలుత భయమైంది. ఏం చేయాలో అర్థం కాలె. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు బాగా చూసుకుండ్రు. సమయానికి చక్కటి భోజనంతో పాటు ధైర్యమిచ్చిండ్రు. వంటింటి చిట్కాలు, పరిశుభ్రత పాటించాం. వైరస్‌ సోకిందని భయపడకుండా మనోధైర్యంతో ఇంటికొచ్చినం’ అని బాధితులు చెప్పారు. జిల్లాలో కరోనా బారిన పడి ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్న బాధితులను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. ప్రభుత్వాస్పత్రుల్లో చక్కటి వసతులున్నాయని, భయపడాల్సిన పన్లేదని భరోసా ఇచ్చారు. అపోహలు మాని డాక్టర్ల సలహాలు పాటిస్తే కరోనాతో హైరానా చెందొద్దని సూచిస్తున్నారు. వైరస్‌ను జయించిన వారిలో అధికశాతం 30 ఏండ్ల నుంచి 50 ఏండ్లలోపు వారే ఉన్నారు. వారి మనోగతం..వారి మాటల్లోనే..     

-ఆలేరు  

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని  ఆత్మైస్థెర్యంతో ఎదుర్కొని కరోనా విజేతలుగా నిలిచాం. కంటికి కనిపించని వైరస్‌కు ఎవ్వరూ కంగారు పడొద్దు. మొదటగా మాకు కరోనా అని తెలియగానే వణిపోయాం. కానీ ప్రభుత్వ దవాఖానలో వైద్య సిబ్బంది ఇచ్చిన సలహాలు, సూచనలు,  వైద్యంతో కరోనాను జయించాం. ఇంట్లోనే తయారు చేసుకునే చిట్కాలతో కరోనాను తగ్గించుకోవచ్చు. వైరస్‌ సోకిందని భయపడొద్దు. మనోధైర్యమే అసలైన మందు అంటూ కరోనా నుంచి బయటపడ్డ బాధితులు చెబుతున్నారు. ‘నమస్తే తెలంగాణ’తో తమ అనుభవాలను పంచుకున్నారు. 

 ఆలేరు ప్రజల దీవెనలతో కరోనాను జయించాం

దవాఖాన నుంచి డిశ్చార్జి అయిన ప్రభుత్వ విప్‌ దంపతులు

ఆలేరు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, ఆలేరు ప్రజల దీవెనలతో కరోనా వైరస్‌ను జయించామని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. కొద్దిరోజులుగా కరోనాతో దవాఖానలో చికిత్స పొంది శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు అండగా నిలిచి, అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రతి నిత్యం ప్రజలతో గడిపామని తెలిపారు. తమ వంతు సహకా రం అందిస్తూ ప్రతి ఊరికి నిత్యావసర సరుకులు, బియ్యం, మాస్కులు, శానిటైజర్లను అందించామన్నారు. అత్యంత విపత్కర పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆగకూడదని ఆ దిశగా అడుగులు వేశామన్నారు. ఈ క్రమంలోనే దంపతులిద్దరం కరోనా బారినపడ్డామని తెలిపారు. ఆపత్కాలంలో ప్రజలు మాపై చూపిన ఆదరణతో మాకు ఎంతో ఆత్మైస్థెర్యాన్ని నింపిందని, ప్రతి ఒక్కరిని రుణపడి ఉంటామని చెప్పారు. ప్రస్తుతం కరోనా నెగెటివ్‌ వచ్చిందని,  మరో వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లోఉండి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. అప్పటి వరకు తమను చూసేందుకు ఎవరూ ఇంటికి రావొద్దని సూచించారు. అత్యవసరమైతే ఫోన్‌ ద్వారా సంప్రదించాలన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని, నిర్లక్ష్యం వీడి ఆనందంగా జీవిద్దామని సూచించారు. 

గాంధీలో వైద్యం బాగుంది

మహారాష్ట్రకు వలసవెళ్లాం. అక్కడే మా ఇద్దరికి కరోనా సోకింది. లాక్‌డౌన్‌ సడలింపుతో సొంతూరికి వచ్చాం. సర్పంచ్‌, అధికారులు వెంటనే మమ్మల్ని గాంధీ దవాఖానకు పంపించిండ్రు. అక్కడ డాక్టర్లు మంచిగ చూసుకున్నరు. 14 రోజుల్లో ప్రతీ రోజు టిఫిన్‌, పండ్లు, డ్రై పూట్స్‌, భోజనం, మందులు  ఇచ్చారు. కరోనా తగ్గగానే ఇంటికి వచ్చాం. ఇప్పుడు ఉపాధి పనులకు పోతున్నాం.

- అంబోజు అంజయ్య, అంజమ్మ, గ్రా. పల్లెర్ల, మం : ఆత్మకూరు(ఎం). 

వారంలోనే రోగం మాయం.. 

మా ఊరికి పక్క రాష్ట్రపోళ్లు వచ్చిండ్రు. వాళ్లతోనే నాకు కరోనా వచ్చింది. డాక్టర్లు నన్ను గాంధీకి పట్టుకుపోయిండ్రు. దవాఖానకు పోంగనే నాకు భయమైంది. కానీ డాక్టర్లు మంచిగ మాట్లాడిర్రు. టైమ్‌ ప్రకారం మందులు, తిండి పెట్టేటోళ్లు. వారం రోజుల్లోనే రోగం మాయం అయింది. మళ్లీ నాకు పరీక్ష చేసిండ్రు. పరీక్షలో రోగం లేదని కాగితం వచ్చింది. ఇగ నన్ను ఇంటికి పోమ్మన్నరు. 14 రోజులదాక ఇంట్లనే ఉండమన్నరు. భయపడితేనే రోగం. ధైర్యం చేస్తే ఏం ఫికర్‌లేదు. 

- 50 ఏండ్ల బాధితురాలు, గ్రామం. తుక్కాపురం, మండలం. ఆత్మకూరు(ఎం)

మంచి తిండి తిన్నా...కైకిలి పోతున్న.. 

15 ఏండ్ల నుంచి మహారాష్ట్రలోనే బతికినం. లాక్‌డౌన్‌ల మా ఊరికి వచ్చాం. రాగానే డాక్టర్లు పరీక్ష చేసి హైదరాబాద్‌లోని కింగ్‌కోఠికి తీసుకుపోయిండ్రు. అక్కడ నాతో పాటు కొడుకు, బిడ్డకు పరీక్ష చేసిండ్రు. ఏం జరుగుతుందో అర్థం కాలే. రిపోర్టులో మాత్రం కరోనా వచ్చింది. మొదలు కొంచెం భయమైంది. కానీ ఎట్లయితేగట్ల అనుకున్న. డీలా పడితే పిల్లలు ఆగమైతరు. డాక్టర్లు చెప్పినట్లు విన్న. రోజు గుడ్లు, పాలు, పండ్లు.. ఇట్ల మంచి తిండి తిన్నా. రోగం ఎటో పోయింది. మళ్లీ ఎప్పటిలాగే ఇంటికి వచ్చాం. ఇప్పుడు కైకిలి పోతున్న. 

- 35 ఏండ్ల మహిళ, గ్రామం శారాజీపేట, మండలం ఆలేరు.

ఇంట్లోనే ఉన్నా.. కషాయం తాగిన 

యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో మా సహచరుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అక్కడి నుంచి నాకు వచ్చింది. కరోనా అని తెలియగానే చాలా భయపడ్డ. ఏం తినాలని కూడా అనిపించలేదు. వైద్యులు హోంక్వారంటైన్‌కు పంపించారు. మంచి సూచనలు చేశారు. ఇంట్లోనే మిరియాలు, అల్లం, సొంటి, జీలకర్ర, దాల్చిన చెక్క, తులసి ఆకుల కషాయాన్ని ఉదయం, సాయంత్రం తాగిన. రోజు వేడినీళ్లు, యోగాసనాలు తప్పనిసరి చేశా. 17 రోజుల్లో మళ్లీ పరీక్ష చేస్తే నెగిటివ్‌ వచ్చింది.  

- కానిస్టేబుల్‌, యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌.

మనోధైర్యమే మందు 

మా బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చాను. ఇంటికి రాగానే తెల్లవారుజామున గుండెనొప్పి వచ్చింది. వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు కరోనా ఉన్నట్లుందని, కింగ్‌ కోఠి దవాఖానకు పంపారు. అక్కడ మళ్లీ పరీక్ష చేస్తే కరోనా అని తేలింది. కింగ్‌ కోఠి డాక్టర్లు ఎక్కువ మందులేమి ఇయ్యలే. మంచి ధైర్యం చెప్పిండ్రు. మనో ధైర్యంతోనే మందు అన్నారు. వారి సూచనలు పాటించా.. కరోనాను జయించా.. 

- 30 ఏండ్ల మహిళ, గ్రా. కొల్లూరు, మం. ఆలేరు.

 మోటకొండూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ 

మోటకొండూర్‌: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మోటకొండూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని వర్తక వ్యాపారస్తులు నిర్ణయించుకున్నారు. శుక్రవారం నుంచి 21 రోజుల పాటు ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలను తెరుచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమిస్తే రూ. 5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామస్తులు సహకరించాలని కోరారు. 

 హోంక్వారంటైన్‌లో 206మంది  

భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 206 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 44మందికి పాజిటివ్‌ వచ్చిందని, 606మంది నుంచి శాంపిల్స్‌ సేకరించామని చెప్పారు. ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లో ఏడుగురు ఉన్నట్లు తెలిపారు.

 రామన్నపేట మండలంలో....

రామన్నపేట : రామన్నపేట మండలంలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటి వరకు మండలంలో 10 కేసులు నమోదు కాగా వీరిలో ఒకరు మృతి చెందారు. శుక్రవారం  మండలంలోని ఇంద్రపాల నగరంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి డా. రవికుమార్‌ తెలిపారు. ఇటీవల ఇంద్రపాలనగరంలో లారీడ్రైవర్‌కు కరోనా రావడంతో హోంక్వారంటైన్‌లో ఉంటున్నాడు. అతని కుటుంబసభ్యులు ఈ నెల 2న హైదరాబాద్‌లోని నేచర్‌క్యూర్‌ దవఖానాలో కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. కుటుంబంలోని అతని తండ్రితో పాటు 11సంవత్సరాల బాలికకు ఈ నెల 6న  కరోనా నిర్ధారణ అయినట్లు రిపోర్టులు వచ్చినా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వలేదు. అతని తండ్రి ఈ నెల 9న రామన్నపేట ప్రభుత్వ దవఖానాలో దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసంతో బాధపడుతూ మందులు తీసుకున్నాడు. శుక్రవారం మున్సిపల్‌, వైద్య సిబ్బంది సమాచారం తెలుసుకొని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. కొవిడ్‌ పరీక్షల ఐడీ నెంబర్ల ద్వారా సమాచారం సేకరించగా, మిగిలిన కుటుంబ సభ్యులకు నెగిటివ్‌ వచ్చింది. బాలికకు కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో హోంక్వారంటైన్‌ చేశారు. తండ్రిని నేచర్‌క్యూర్‌ దవాఖానకు తరలించారు. సర్పంచ్‌ కాటేపల్లి సిద్ధమ్మ యాదయ్య గ్రామంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 

 పంతంగిలో...  

చౌటుప్పల్‌ రూరల్‌ : మండల పరిధిలోని పంతంగి గ్రామానికి చెందిన ఒక లారీ డ్రైవర్‌కు శుక్రవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఫీవర్‌ దవాఖానకి వెళ్లాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. 
logo