శనివారం 05 డిసెంబర్ 2020
Yadadri - Jul 10, 2020 , 23:04:36

టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి స్వాధీనం

 టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి స్వాధీనం

  • ఏసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి 

చౌటుప్పల్‌ : ఉత్తరప్రదేశ్‌కు గుట్టుగా గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ, చౌటుప్పల్‌ పోలీసులు పంతంగి టోల్‌ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల్‌ ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను డీసీపీ నారాయణరెడ్డి వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ పట్టణం, కొలిలోని బుజ్‌పురాకు చెందిన మహ్మద్‌ జాహిద్‌, అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ముస్తాఖాన్‌, అదే రాష్ట్రంలోని అత్రాస్‌ జిల్లా సికింద్రరావు నగర్‌కు చెందిన మహ్మద్‌ షానోలతో కలిసి గంజాయి సరఫరా చేస్తుంటాడు. ఈ ముగ్గురు ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపూర్‌ జిల్లా జోలాపూర్‌ గ్రామానికి చెందిన మదన్‌ సహాయంతో గంజాయి సరఫరా చేసేవారు. ఇతను విశాఖపట్నంలోని నర్సీపట్నం నుంచి గంజాయి కొనుగోలు చేసి వీరికి విక్రయించేవాడు. వీరంతా నర్సీపట్నం సమీపంలో చిన్న గుడారాలను ఏర్పాటు చేసుకుని, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఢిల్లీ నాన్‌లోకల్‌ మిక్సీలను నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో విక్రయించేవారు.  మహ్మద్‌ జాహిద్‌ తన స్నేహితులు మస్తాఖాన్‌, షానోలతో కలిసి మదన్‌ నుంచి కొనుగోలు చేసిన  గంజాయిని టాటా విస్టా కారులో హైదరాబాద్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు సరఫరా చేసేవారు. పోలీసుల కండ్లు కప్పేందుకు మిక్సీ బాక్సుల్లో గంజాయి ప్యాకెట్లను సరఫరా చేసేవారు. గత రెండేండ్లుగా వీరు గంజాయి సరఫరా చేస్తున్నారు. 

 కాగా జాహిద్‌ సోదరుడు హఫీజ్‌ గతంలో గంజాయిని నర్సీపట్నం నుంచి ఒడిస్సాకు సరఫరా చేసేవాడు. హఫీజ్‌కి సహాయంగా వెళ్లి జాహిద్‌ గంజాయి వ్యాపారాన్ని తెలుసుకున్నాడు. అయితే హఫీజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో గంజాయి సరఫరా పనిని జాహిద్‌ తీసుకున్నాడు. ఈ క్రమంలో  పక్కా సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ, చౌటుప్పల్‌ పోలీసులు పంతంగి టోల్‌ప్లాజా వద్ద మాటు వేశారు. శుక్రవారం ఉదయం గంజాయి  తరలిస్తున్న కారును ఆపి జాహిద్‌, ముస్తాఖాన్‌, షానోలను అరెస్ట్‌ చేశారు. కారులో ప్రయాణిస్తున్న మరో నిందితుడు మదన్‌ పారిపోయాడు. వారి నుంచి రూ. 10లక్షల విలువైన కారు, 86 కేజీల గంజాయి, రూ. 2వేల నగదు, రెండు సెల్‌ఫోన్లు, 12 మిక్సీలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని రామన్నపేట కోర్టులో హాజరు పరుస్తామని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న ఎస్‌వోటీ, చౌటుప్పల్‌ పోలీసులను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి, ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌బాబు, ఎస్‌వోటీ సిబ్బంది ఉన్నారు.