శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jul 07, 2020 , 23:24:00

వైరస్‌ కాటు

వైరస్‌ కాటు

కరోనాకు ఒక్కరోజే ముగ్గురు బలి యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ మండలాల్లో మృతి - జిల్లాలో ఐదుకు చేరిన మరణాల సంఖ్య మంగళవారం ఏడు పాజిటివ్‌ కేసులు నమోదు - నిర్లక్ష్యం వద్దంటున్న వైద్య నిపుణులు  కంటికి కనిపించని శత్రువు మంగళవారం ముగ్గురిని బలి తీసుకున్నది. కరోనా బారినపడి యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ మండలాల్లో ముగ్గురు కన్నుమూశారు. గతంలో ఇద్దరు మృతిచెందగా, మరణాల సంఖ్య ఐదుకు చేరింది. మంగళవారం ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా ఏడు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 28కి చేరాయి. మొన్నటివరకు జిల్లాస్థాయి అధికారులంతా హోంక్వారంటైన్‌లోకి వెళ్లగా..ఇటీవల ఎమ్మెల్యేతోపాటు ఆమె భర్తకు కరోనా సోకింది. రోజురోజుకు విజృంభిస్తున్న మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే వారితో హడలిపోతున్నారు. 

భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తోంది. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఇది విస్తరిస్తోంది. మంగళవారం ఒక్క రోజే భువనగిరి, యాదగిరిగుట్ట, వలిగొండ మండలాలకు చెందిన ముగ్గురు మృత్యువాత పడగా.. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 28 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఒక్క కేసు కూడా నమోదుకాని జిల్లాలో నెల రోజుల్లోనే ఊహించని విధంగా  కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మొన్నటికి మొన్న జిల్లా స్థాయి అధికారులంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లగా.. ఇటీవల ఎమ్మెల్యేతోపాటు ఆమె భర్తకు కరోనా సోకింది. ఇప్పటివరకు కరోనాతో ఐదుగురు మృతి చెందగా, నలుగురు ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్నారు. 202 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. 

మాలాలన్నీ రాజధానివే...

జిల్లాలోని కరోనా కేసుల మూలాలన్నీ రాజధాని హైదరాబాద్‌తో ముడిపడినవే. కరోనాతో మృత్యువాత పడినవారు కూడా హైదరాబాద్‌ మూలాలు ఉన్నవారే. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు, ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ తరువాత జిల్లా నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరిగాయి. ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వచ్చిన వారి ద్వారానే కరోనా సంక్రమిస్తున్నట్లు వైద్యవర్గాల పరీశీలనలో తేలింది. దీంతో హైదరాబాద్‌ పేరు వింటేనే జిల్లా ప్రజలు భయపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పట్టణ ప్రాంతాల్లోనే కనిపించిన వైరస్‌ తీవ్రత క్రమంగా పల్లెలకు పాకింది. మొదట్లో ముంబయి నుంచి వచ్చిన వలస కార్మికుల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇలా తక్కువ వ్యవధిలోనే ఐదుగురు మృతి చెందడం.. 28 వరకు పాజిటివ్‌ కేసులు రావడం ప్రజలను కలవరానికి గురిచేస్తున్నది. 

అప్రమత్తతే శ్రీరామరక్ష..

లాక్‌డౌన్‌ తర్వాత జనంలో పెరిగిన నిర్లక్షమే కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. చాలామంది బయట సంచరించే సమయంలో మాస్కులు లేకుండా తిరుగుతుండడంతోపాటు భౌదిక దూరాన్ని పాటించకపోవడంతో అనర్థం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించడంతోపాటు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

VIDEOS

logo