సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jul 07, 2020 , 23:23:58

పల్లె పిలుస్తోంది.

పల్లె పిలుస్తోంది.

  • పట్టణాల్లో మహమ్మారి భయం  
  • కరోనాతో గ్రామాలకు వలసలు  
  • ఉపాధి హామీ పనులకెళ్తున్న చిరుద్యోగులు

ఆలేరు: కరోనా వైరస్‌ కల్లోలాన్ని సృష్టించడమే కాదు.. పల్లెకు కొద్దిపాటి కళను తెచ్చిందనే చెప్పాలి. బాధ్యతలను గుర్తు చేయడంతో పాటు బంధాలను బలపర్చింది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన పట్టణాల్లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో ఉపాధి కోసం పట్నం వెళ్లిన పల్లెవాసులు తిరిగి వస్తున్నారు. పట్నం కష్టాలు పడలేక ఊరికి చేరుకుంటున్నారు. 

పల్లెల్లో నిత్యం మందుబిల్లలతో కాలమెల్లదీసే ముసలవ్వలు.. చిన్నారులు కండ్లముందుండగా.. ఆ ఆనందంతో వారి రోగాలన్నీ రాజీపడ్డాయి. కరోనా మహమ్మారితో పట్నం అంతా షట్‌డౌన్‌ అయింది. డ్రైవర్ల నుంచి సాఫ్ట్‌వేర్‌ దాక పనులన్నీ బంద్‌ అయినయ్‌. కొందరికి వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశమొచ్చింది. పట్నాల్లో కరోనా భయంతో నిత్యం భయపడే కంటే ఊర్లనే కలోగంజో తాగుదామంటూ తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతున్నారు. గడిచిన నాలుగు నెలలుగా పట్నం కంటే పల్లె చాలా ఉత్తమమైందని గుర్తించారు. అందుకే మొన్నటి వరకు ఊరొద్దని పేచీ పెట్టి, భర్తలపై ఒత్తిడి తీసుకొచ్చిన మహిళలు కూడా నేడు పల్లెల్లోనే ఆరోగ్యముందంటున్నారు. విద్యావంతులు కూడా మొన్నటివరకు హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కొలువుల్లో ఇబ్బంది పడ్డవారు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన వారంతా ఇప్పుడు పల్లె చౌరస్తాల్లో కనిపిస్తున్నారు.  

సాఫ్ట్‌వేర్‌కు బై.. వ్యవసాయానికి జై.. 

కరోనా మహమ్మారితో చాలా మంది యువకులు తమ రూట్‌ను మార్చుకున్నారు. పల్లెల్లో హాయిగా జీవనం సాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పెట్టుబడిసాయం ఆసరాగా చేసుకుని వ్యవసాయం చేసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఆత్మకూరు(ఎం) మండలంలోని కొరటికల్‌ గ్రామానికి చెందిన శ్రీరాముల ప్రదీప్‌  బీటెక్‌ పూర్తి చేసి గత ఐదేండ్లుగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ. 35 వేల జీతం వచ్చేది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు బై చెప్పి  రెండు ఎకరాల్లో  వ్యవసాయం చేస్తున్నాడు. మూడు నెలలుగా తల్లిదండ్రులతోనే ఉంటూ నాగలిపట్టి రైతుగా మారాడు. 

మూడు నెలల నుంచి ఊళ్లోనే.. 

కరోనా నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఆఫీసులు వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం ఇచ్చాయి. హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య  పెరుగుతున్న నేపథ్యంలో మూడునెలలుగా ఊళ్లోనే ఉంటున్నా. హైదరాబాద్‌లో  ఆఫీసుకు వెళ్లటానికి రెండు గంటల సమయం పట్టేది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ఆఫీసులో గడిపేవాళ్లం. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నా. ఆఫీసు వారు అదనంగా రెండుగంటలు పని చేయిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నామన్న సంతృప్తి ఉంది.   

-మౌనిక, విర్టుసా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, హైదరాబాద్‌  (మన్నెవారిపంపు, భువనగిరి మండలం)

కుటుంబసభ్యులతో గడపడం ఆనందంగా ఉంది 

గత కొన్నేండ్లుగా హైదరాబాద్‌లో విప్రో టెక్నాలజీ లిమిటెడ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా. కరోనా కారణంగా ఆఫీసు వారు ఇంటి వద్దే ఉండి పనిచేయాలని సూచించారు. లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందే గ్రామానికి చేరుకున్నా. ఇంటి వద్ద ఉంటూ లాప్‌టాప్‌ ద్వారా పనులు చేస్తున్నా. మిగతా సమయాల్లో కుటుంబసభ్యులతో గడుపుతున్నా.    

-పచ్చిమట్ల పాండు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌,  పహిల్వాన్‌పూర్‌ గ్రామం, వలిగొండ మండలం 

వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది 

గత 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వెళ్లా. అక్కడే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మేనేజర్‌గా పనిచేశా. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో హోటల్స్‌ మూసివేయడంతో గ్రామానికి వచ్చా. గ్రామంలో ఎకరం 30 గుంటల భూమి ఉంది. మా భూమికి పై భాగంలోని చెరువుల్లోకి నీరు వచ్చింది. మా గ్రామానికి కూడా నీరు వస్తుందనే ఆశ కలిగింది. తుర్కపల్లి, బొమ్మలరామారం చెరువులను నీటితో నింపుతున్నారు. మా గ్రామ పరిధిలోని వాగులోకి నీరు చేరుతుందనే ఆశతో వ్యవసాయంపై మరింత ఆసక్తి పెరిగింది. ప్రసుత్త పరిస్థితిలో ఊరిలోనే ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా మందులు వాడేది. ఇక్కడ ఒకరోజు  మందులు  వేసుకోకున్నా ఆరోగ్యం బాగానే సహకరిస్తుంది. త్వరగా నీరు వస్తే వ్యవసాయం చేసుకోవాలనే ఆశ ఉంది.  

-బోయిని శ్రీనివాస్‌, మన్నెవారిపంపు, భువనగిరి మండలం (భువనగిరి అర్బన్‌)

VIDEOS

logo