మంగళవారం 11 ఆగస్టు 2020
Yadadri - Jul 07, 2020 , 00:37:21

ఐక్యత పెంపునకే రైతు వేదికలు

ఐక్యత పెంపునకే   రైతు వేదికలు

  • అందరూ ఒకేచోట కూర్చొని మాట్లాడుకోవచ్చు.. 
  • వ్యవసాయాధికారులతో సమావేశాలు పెట్టుకోవచ్చు  
  • రైతులకు మేలు చేయాలన్నదే సీఎం లక్ష్యం  
  • బస్వాపూర్‌ జలాశయంతో పుష్కలంగా నీళ్లు 
  • పిలాయిపల్లి కాల్వ పనులు త్వరగా పూర్తి చేస్తాం 
  • విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి 

రామన్నపేట : రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.సోమవారం మండల కేంద్రంతో పాటు వెల్లంకి గ్రామల్లో నిర్మించే రైతు వేదిక భవనాలను, మండల కేంద్రంలో రూ. 16.80 లక్షలతో నిర్మించే పశువుల దవఖానా భవన నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపనలు చేశారు. సిరిపురం గ్రామంలో దాత ఏలె చంద్రశేఖర్‌ సహకారంతో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆరో విడత హరితహారంలో భాగంగా ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. 

అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన  మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కొండపోచమ్మ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా రాబోయే రెండేండ్లలో ఉమ్మడి నల్లగొండ రైతులకు సాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. రైతు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బడ్జెట్‌లో 65 శాతం నిధులు వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు తెలిపారు. రైతు వేదికలు అన్నదాతల్లో ఐక్యతను పెంచుతాయన్నారు. ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. 

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రూ. 50 వేల కోట్లతో అభివృద్ధి పనులను చేయించిన ఘనత మంత్రి జగదీశ్‌రెడ్డిదేనని చెప్పారు. 

నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రామన్నపేటను మోడల్‌ పట్టణ కేంద్రంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. బస్టాండ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అమరేందర్‌, వ్యవసాయశాఖ జిల్లా అధికారి అనురాధ, ఆర్డీవో సూరజ్‌ కుమార్‌, జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ క్రిష్ణ, డీఈ వై. మురళీధర్‌రెడ్డి, ఎడీఏ సంజీవరావు, ఎంపీపీ కన్నెబోయి న జ్యోతి బలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ నంద్యాల భిక్షంరెడ్డి, సర్పంచ్‌లు గోదాసు శిరీషాపృథ్వీరాజ్‌,ఎడ్ల మహేందర్‌రెడ్డి, అప్పం లక్ష్మినర్సు, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, గొరిగే నర్సింహ్మ, ఎండి రేహాన్‌, వనం హర్షిణి, ఎర్రోళ్ల లక్ష్మమ్మ, పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయికుమార్‌, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ.ఆమేర్‌, రవీందర్‌రెడ్డి, రమేష్‌, ఉదయ్‌రెడ్డి, బందెల రాములు తదితరులు పాల్గొన్నారు.

 సీసీ రోడ్డుకు శంకుస్థాపన  

ప్రభుత్వం ఇస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. సోమవారం మండలంలోని వెల్లంకిలో గ్రామపంచాయతీ నిధులతో సీసీరోడ్డు పనులను కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతిబలరాం, జడ్పీటీసీ లక్ష్మీజగన్‌మోహన్‌, ఎంపీడీవో రాకేశ్‌రావు, ఎంపీవో అంజిరెడ్డి, సర్పంచ్‌ మహేందర్‌రెడి,్డ ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

చెక్కు అందజేత....

మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి బాతుక సైదులుకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 26వేల చెక్కును ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లబ్ధిదారునికి అందజేశారు. ఆయన వెంట సర్పంచ్‌ ఉప్పు ప్రకాష్‌, మాజీ సర్పంచ్‌ బత్తుల శంకరయ్య, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు నీల లింగయ్య ఉన్నారు. 


logo