శుక్రవారం 14 ఆగస్టు 2020
Yadadri - Jul 07, 2020 , 00:32:31

ప్రతి గ్రామానికి ప్రకృతి వనం

 ప్రతి గ్రామానికి ప్రకృతి వనం

  • పట్టణాలు మాదిరి గ్రామాల్లోనూ పచ్చదనం పెంపే లక్ష్యం 
  • ఒక్కో వనం విస్తీర్ణం ఎకరం..వ్యయం రూ.9 లక్షలు 
  •  ఉపాధి హామీ పథకం కింద నిర్మించాలని నిర్ణయం 
  • వనంలో సుమారు 4 వేల మొక్కలు నాటేలా ప్రణాళిక 
  • వననిర్మాణాల ప్రక్రియ ప్రారంభం 
  • జిల్లావ్యాప్తంగా 421  పంచాయతీలు 
  •  99 గ్రామాల్లో స్థలాల గుర్తింపు పూర్తి 

ప్రకృతి ఉంటేనే మనుగడ.. పచ్చదనం లేని జీవితాన్ని ఊహించుకోవడమూ కష్టమే. పెరుగుతున్న జనాభా తగినట్లు చెట్లు లేక పర్యావరణ సమతుల్యత లోపించి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఈ దుస్థితిని పోగొట్టేందుకు ప్రభుత్వం హరితహారంలో భాగంగా భారీగా పచ్చదనం పెంచుతున్నది. మహానగరాలు, పట్టణాల్లో పార్కులు, అర్బన్‌ ఫారెస్ట్రీలు ఉండగా,ఇప్పుడు గ్రామానికొకటి చొప్పున ప్రకృతి వనం పేరుతో పార్కు ఏర్పాటు చేసే పనులు ప్రారంభమయ్యాయి.

ఎకరం స్థలంలో సుమారు 4 వేల మొక్కలు నాటి చిట్టడవి తయారు చేసే బృహత్తర కార్యక్రమం సోమవారం  జిల్లాలో షురూ అయ్యింది. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద ఒక్కో పార్కు నిర్మాణానికి దాదాపు రూ.9 లక్షల వ్యయం చేయనున్నారు. ఎకరం జాగాలో భారీ మొక్కలతోపాటు ఆహ్లాదాన్నిచ్చే విభిన్న పూల మొక్కలు, పచ్చనిగడ్డిని పెంచడంతోపాటు పిల్లలకు ఆట పరికరాలను అందుబాటులోకి తేనున్నారు. జిల్లాలో 421 పంచాయతీలుండగా, 322 గ్రామాల్లో పార్కుల ఏర్పాటుకు స్థలాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 99 పంచాయతీల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనిచోట దాతలు ముందుకొస్తే వారి పేర్లను పార్కుకు పెట్టే ప్రతిపాదనను అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, వర్మీ కంపోస్టు షెడ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  

జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు                              :  421

స్థల గుర్తింపు పూర్తయిన గ్రామ పంచాయతీలు              :   99

ప్రతి పార్కుకు కేటాయించిన స్థలం                                   :  ఎకరం

ఒక్కో పార్కులో నాటనున్న మొక్కలు                               :  4 వేలు


భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : మహా నగరాలు.. మున్సిపాలిటీల్లో నగర వాసులను ఆహ్లాదపరుస్తూ వస్తున్న పార్కులు ఇక నుంచి పల్లెవాసులను సైతం మైమరిపించనున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి గ్రామపంచాయతీలోనూ ప్రకృతి వనం పేరుతో తెలంగాణ ప్రభుత్వం పార్కులను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాలో ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైంది. పంచాయతీ ఒక్కటి చొప్పున జిల్లాలో 421 గ్రామ పంచాయతీల్లో పార్కులను ఏర్పాటు చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. ఈనెల 6 నుంచే ఎంపిక చేసిన స్థలాల్లో పార్కు ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను మొదలు పెట్టాలని జిల్లా అధికారులు మండల పరిషత్‌ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఇందులో భాగంగా పార్కు స్థలంలో పెరిగిన పిచ్చి చెట్లు, ముళ్ల పొదలను తొలగించడంతోపాటు దుక్కి దున్ని, మార్కింగ్‌ చేయడం..ఎరువులను చల్లి గుంతలు తీశాక మొక్కలను నాటడం వంటి కార్యక్రమాలను ఈనెల 14లోపు పూర్తి చేసేలా జిల్లా అధికారులు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. విశాలమైన ఎకరం స్థలంలో చుట్టూ భారీ వృక్షాలను పెంచి మధ్యలో పూల మొక్కలతోపాటు పచ్చదనం కూడిన గడ్డిని పెంచనున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల పూల మొక్కలు, ఔషధ మొక్కలకు సంబంధించి 4వేల మొక్కలను నాటనున్నారు. పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచడంతోపాటు పెద్దలు సేద తీరేందుకు ప్రత్యేకమైన సిమెంట్‌ బెంచీలను ఏర్పాటు చేయనున్నారు. నిర్వహణ బాధ్యతల కోసం ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో నిధులను వెచ్చిస్తోంది. 

స్థలాల కోసం కొనసాగుతున్న అన్వేషణ..

జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీలోనూ ప్రభుత్వం వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు వంటి నిర్మాణాలను చేపట్టింది. వీటికోసం ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేక అప్పట్లో అధికారులు చాలా ఇబ్బందులుపడ్డారు. తాజాగా.. ప్రభుత్వం ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో పంచాయతీరాజ్‌, రెవెన్యూ, డీఆర్‌డీవో శాఖలు స్థలాల అన్వేషణలో పడ్డాయి.

జిల్లాలో ఉన్న మొత్తం 421పంచాయతీల్లో పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న తరుణంలో సంబంధిత అధికారులు గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల లెక్కలను తీసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 322 పంచాయతీల్లో మాత్రమే పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండగా.. ఇప్పటి వరకు 99 పంచాయతీల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ సైతం పూర్తయింది. పార్కు ఏర్పాటుకు అవసరమైన ఎకరం స్థలం అందుబాటులో లేని గ్రామాల్లో 35 గుంటల స్థలాన్ని సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట దాతలు ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు. అవసరమైతే భూదానం చేసిన వారి పేర్లను పార్కుకు పెట్టే విధంగా అధికార యంత్రాంగం సమాలోచనలు చేస్తోంది.

స్థల పరిశీలన చేస్తున్నాం

ప్రతి గ్రామ పంచాయతీలో పార్కులను అభివృద్ధి చేసేందుకు స్థల పరిశీలన జరుగుతున్నది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేని చోట దాతల నుంచి సేకరించి పార్కులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టేందుకు మండల స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలను జారీ చేశాం. పల్లెవాసులను ఆహ్లాదపర్చేందుకు పార్కులను త్వరలోనే అందుబాటులోకి తెస్తాం.

           - ఉపేందర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ, యాదాద్రి భువనగిరి జిల్లా 


       


logo