శుక్రవారం 07 ఆగస్టు 2020
Yadadri - Jul 06, 2020 , 00:40:10

వేదిక‌కు వేళాయే

వేదిక‌కు వేళాయే

  • జిల్లాలో 92 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం
  • ఒక్కో వేదికకు రూ.22 లక్షల వ్యయం 
  • రైతులకు మేలు చేకూర్చేలా నిర్మాణం 
  • అనువైన స్థలాల అన్వేషణలో అధికారులు 
  • స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్న దాతలు 
  • నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి జగదీశ్‌రెడ్డి 

                                                                                                                         

సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు ప్రతిరూపం అయిన రైతు వేదికల నిర్మాణానికి జిల్లా వ్యవసాయ శాఖ కసరత్తు పూర్తిచేసింది.జిల్లాలో92క్లస్టర్లను గుర్తించగా..క్లస్టర్‌కు ఒక వేదిక చొప్పున రూ.22 లక్షల వ్యయంతో నిర్మాణాలు చేపట్టనున్నారు. రైతులు, వ్యవసాయ అధికారుల సమావేశాలు, సలహాలు, సూచనలకు ఇది వేదిక కానున్నది. నియంత్రిత సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈ వేదికలు రైతులకు మరింత ప్రయోజనం చేయనున్నాయి. మొత్తం రూ. 20.24 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వేదికల నిర్మాణానికి నేడు తొలి అడుగు పడనున్నది. సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో, వెల్లంకి గ్రామంలో రైతు వేదికల నిర్మాణానికి మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు రైతు వేదికలకు ప్రతిపాదించిన స్థలాలను, మంత్రి పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం పరిశీలించారు. 

- భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

                                                                                                                                                      రైతులు ఒకచోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా.. రైతు వేదిక నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పం. క్లస్టర్‌కు ఒక వేదిక చొప్పున నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ఆ దిశగా అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఎన్ని క్లస్టర్లు..ఎన్ని భవనాలు..ఇందుకు ఎన్ని నిధులు అవసరం అన్న విషయాలపై కసరత్తు చేసిన జిల్లా వ్యవసాయ శాఖ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.  జిల్లా వ్యాప్తంగా.. 3,64,793 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఐదు వేల ఎకరాలకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన జిల్లాలో 92 క్లస్టర్లలో 92 వేదికలను నిర్మించేందుకు అవసరమైన ప్రణాళికను పూర్తి చేశారు. ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షల వ్యయంతో నిర్మించనున్నట్లు అంచనా. ఈ లెక్కన జిల్లాలో 92 రైతు వేదికల నిర్మాణానికి రూ.20.24కోట్లు అవసరం కానున్నాయి. ఒక్కో వేదికను ఇరవై గుంటల స్థలంలో నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ జిల్లాలో అనువైన స్థలాలు లేక పది గుంటల మేర స్థలాలను వేదికల కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే 92 రైతు వేదికలకు సంబంధించి స్థలాలు గుర్తించి  ప్రభుత్వానికి నివేదించారు.     

                

రైతులను ఒకచోట చేర్చి సమావేశం నిర్వహించేందుకు వేదికలు లేక వ్యవసాయ శాఖ సిబ్బందికి గతంలో ఇబ్బందిగా మారింది. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అవసరమైన సమావేశ నిర్వహణకు స్థలం కరువవ్వడంతో చెట్ల కింద, పంచాయతీ కార్యాలయాల ఆవరణలో, ఆలయాల్లో, ఇతర ప్రభుత్వ భవనాల్లో శిక్షణా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించాల్సి వస్తుంది. ప్రతి సారి సమావేశం ఎక్కడో తెలియక అన్నదాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రైతు వేదికల నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం కార్యరూపం ఇవ్వడంతోపాటు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు కూడా జరుపడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రైతుకు పంట పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి పథకాలతో రైతులకు చేయూతను ఇచ్చే ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ వానకాలం నుంచి నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేసి రైతులను రాజును చేసేందుకు సీఎం కేసీఆర్‌ సంకల్పిస్తున్నారు. 

ముందుకొస్తున్న దాతలు...

ఒక్కో రైతు వేదికను 20 గుంటల స్థలంలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖలు స్థలాల అన్వేషణలో నిమగ్నమయ్యాయి. కొన్నిచోట్ల అనువైన స్థలాలు లేక పది గుంటల స్థలంలోనే వేదికలు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేదికల నిర్మాణానికి అవసరమైన స్థలం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావడం, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో కొంత మేర స్పందన వచ్చింది. ఆత్మకూరు మండలంలోని పల్లెర్లలో 20 గుంటల భూమిని, తుర్కపల్లి మండంలోని దత్తాయపల్లిలో 20 గుంటల భూమిని ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు.       

ఏడాదిన్నర క్రితమే మొదలైన కసరత్తు..

వాస్తవానికి రైతు వేదికల నిర్మాణం ఆలోచన ఇప్పటిది కాదు. ఏడాదిన్నర నుంచి ఈ దిశగా కసరత్తు జరుగుతోంది. స్థలాల కొరత వల్ల కొంత జాప్యం నెలకొన్నప్పటికీ ఎట్టకేలకు రైతు వేదికలపై ఒక స్పష్టత వచ్చింది. రైతు వేదిక భవనంలో సమావేశ మందిరం, ఏఈవో గది, చిన్నపాటి గోదాం ఉండేలా డిజైన్‌ చేశారు. రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.350 కోట్లను కేటాయించడంతో వేదికల నిర్మాణాలపై ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా అధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించి నిధులు విడుదలైన వెంటనే రైతు వేదికలను కార్యరూపంలోకి తెచ్చేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

నిధులు మంజూరైన వెంటనే నిర్మాణాలు

జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికలతో రానున్న రోజుల్లో రైతాంగానికి ఎన్నో ప్రయోజనాలు కలుగనున్నాయి. ప్రభుత్వం అందించే పథకాలతోపాటు సాగులో సలహాలు, సూచనలు మరింత చేరువై రైతులకు మేలు జరుగనున్నది. జిల్లాలో 92 వేదికల నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ పూర్తి అయింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే వేదికల నిర్మాణాల పనులను మొదలుపెడుతాం. 

- అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

వేదికలతో రైతులకు లాభం..

రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఫలాలు పూర్తిగా రైతులకు చేరాలంటే ఓ వేదిక అంటూ ఉండాలి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ రైతు వేదికల ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా వేదికలు ఉండనున్నాయి. నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు ఇప్పటికే ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ తరహాలోనే వ్యవసాయంలో వస్తున్న కొత్త కొత్త సాగు పద్ధతులపై రైతులు చర్చించుకోవడంతోపాటు ప్రభుత్వం సంబంధిత కార్యక్రమాలపై అవగాహనను పెంపొందించేందుకు వేదికలు ఎంతగానో దోహదపడనున్నాయి. 

- కొలుపుల అమరేందర్‌, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా

    

 logo