ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jul 01, 2020 , 23:39:09

వైభవంగా తొలి ఏకాదశి

వైభవంగా తొలి ఏకాదశి

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని  పురస్కరించుకొని బాలాలయంలో ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన చేశారు. వివిధ రకాల పూలతో సుమారు రెండు గంటల పాటు  లక్ష పుష్పార్చన కొనసాగింది. ప్రతిమాసంలోని  శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి పర్వదినాల్లో స్వయం భూ పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రిక్షేత్రంలో స్వామికి లక్ష పుష్పాలతో అర్చనలు జరపడం ఆలయ సంప్రదాయం. లక్ష పుష్పార్చనలో  దేవస్థానం ఉప ప్రధానార్చకులు, వేద పం డితులు, అర్చకబృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

వైభవంగా స్వామివారికి నిత్యపూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయం లో అర్చకులు నిత్యపూజలు చేశారు. ఉదయం ఆలయంలో సుప్రభాతం నిర్వహించిన అర్చకులు బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. మండపంలోని శ్రీసుదర్శన నారసింహహోమం, కల్యాణసేవ, నిత్యకల్యాణం జరిపారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నివేదన జరిపించి, శయనోత్సవం చేపట్టారు. వివి ధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సామాజిక దూరం పాటించి, మాస్కులు ధరించి  స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 

శ్రీవారి ఖజానాకు రూ. 1,32,420 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ. 1,32,420 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రచారశాఖ ద్వారా రూ. 1,800, ప్రసాద విక్రయాలతో రూ. 1,10,895, పాతగుట్టదేవాల యం ప్రసాద విక్రయాల ద్వారా రూ. 12,405, కొబ్బరికాయలతో రూ. 7,320 కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 1,32,420 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. 

నృసింహుడికి పూజలు

మఠంపల్లి : మండలంలోని ప్రసిద్ధ దేవాలయమైన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం అర్చకులు  తొలి ఏకాదశి పూజలు చేశారు. భక్తులకు ఆలయ ప్రవేశం లేకపోవడంతో ఆలయ ప్రాంగణం,కృష్ణానది తీరం నిర్మానుష్యంగా మారింది. అనుకోకుండా వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. భక్తులు గోమాతకు కూడా ప్రత్యేక పూజలు చేశారు.

నల్లగొండ జిల్లాలో...

నల్లగొండ కల్చరల్‌:  తొలి ఏకాదశి పర్వదినాన్ని బుధవారం భక్తులు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేవాలయాల్లో భక్తులు నిబంధనలు పాటించి పూజలు చేస్తున్నారు.  మరో వైపు జిల్లా కేంద్రంలోని ఉదయ సముద్రంతోపాటు వాడపల్లి త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లా కేంద్రంలోని రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈవో మోకిరాల రాజేశ్వరశర్మ, తులసీనగర్‌లోని శ్రీభక్తాంజనేయస్వామి సన్నిధిలోని శ్రీసత్యనారాయణస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ఆలయ మేనేజర్‌ రుద్ర వెంకటేశం పర్యవేక్షణలో అర్చక స్వాములు స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అదే విధంగా చెర్వుగుట్ట శ్రీపార్వతి జడల రామలింగేశ్వరస్వామి ఆలయం, వాడపల్లిలోని శ్రీమీనాక్షి అగస్తేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలతోపాటు అంతటా భక్తులు పూజలు చేశారు. కరోనాతో భక్తులకు  తీర్థప్రసాదాలు అందజేయలేదు.  

VIDEOS

logo