శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jul 01, 2020 , 00:04:27

యాదాద్రిలో స్వాతి నక్షత్రపూజలు

యాదాద్రిలో స్వాతి నక్షత్రపూజలు

యాదాద్రి,నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా సోమవారం ఆలయంలో శతఘటాభిషేకం నిర్వహించారు. 108 కలశాలలోకి ఆవాహనం చేసి, మంత్రించిన జలంతో శ్రీవారికి అభిషేకం నిర్వహించారు. ప్రభాత వేళ వందలాది మంది భక్తులు భౌతిక దూరం పాటిస్తూ యాదాద్రి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం కొండ కింద గల వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. వేకువజామునకే స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి, ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, స్థానాచార్యులు రాఘవాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ.నర్సింహమూర్తి, ఏఈవోలు మేడి శివకుమార్‌, దోర్భల భాస్కరశర్మ, వేముల రామ్మోహన్‌, గజవెల్లి రమేష్‌బాబు, పర్యవేక్షకులు వేముల వెంకటేష్‌, ఎస్‌. వెంకటేశ్వర్‌రావు, రాజన్‌బాబు, గట్టు శ్రావణ్‌కుమార్‌, గజవెల్లి రఘు, సార నర్సింహ, బాలాజీ, కృష్ణాగౌడ్‌  తదితరులు పాల్గొన్నారు.

22 రోజుల్లో రూ. 24, 74, 478 ఆదాయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి హుండీలను మంగళవారం లెక్కించారు. 22 రోజుల్లో శ్రీవారికి రూ. 24, 74, 478 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్‌. గీత తెలిపారు. 29 గ్రాముల మిశ్రమ బంగారం, 700 గ్రాముల వెండి వచ్చినట్లు చెప్పారు.  

VIDEOS

logo