సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jun 30, 2020 , 23:51:27

చేనేతకు చేయూత

చేనేతకు చేయూత

  • కరోనా మహమ్మారితో కష్టాల్లో చేనేత కార్మికులు
  • క్రమంగా పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు
  • మంత్రి కేటీఆర్‌ పిలుపుతో చేనేత వస్ర్తాల కొనుగోళ్లు 
  • ఇటీవల మంత్రి జగదీశ్‌రెడ్డి  సహా ఎమ్మెల్యేలు, వారు కుటుంబీకుల కొనుగోలు
  • రూ.1.80 లక్షల చేనేత బట్టలు కొన్న డీసీసీబీ చైర్మన్‌  గొంగిడి మహేందర్‌రెడ్డి 
  • ఇదే బాటలో ఆయా మండలాల నేతలు
  • ఆదుకునేందుకు ముందుకొస్తున్న  నాయకులు,అధికారులు  

భూదాన్‌పోచంపల్లి : కరోనా కష్టాలు దేశంలోని అన్ని వర్గాలతోపాటు చేనేత కార్మికులను కూడా వేధిస్తున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత పరిశ్రమను గట్టెక్కించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తున్నది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం ఫలితంగా చేనేత పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న తరుణంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో చేనేత వస్ర్తాల అమ్మకాలు పోక పరిశ్రమ మళ్లీ సంక్షోభంలోకి వెళ్లిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పోచంపల్లి ఇక్కత్‌ పేరుతో ఉమ్మడి నల్లగొండతోపాటు, వరంగల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల వ్యాప్తంగా సుమారు రూ.190 కోట్ల విలువైన చేనేత వస్ర్తాలు పేరుకుపోయాయని అధికారులు, చేనేత కార్మికులు అంచనా వేస్తున్నారు.

చేనేత కార్మికులకు అండగా.. 

పేరుకుపోయిన చేనేత వస్ర్తాలను ప్రభుత్వం కొనుగోలు చేసి అండగా నిలువాలని చేనేతలు కోరుతున్నారు. దీనికి స్పందించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలు కొనుగోలు చేసి కార్మికులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. వెంటనే ఆయన పిలుపునకు రాజకీయ నాయకులతోపాటు ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాల్లోని ప్రముఖులు, సినీతారలు చేనేత వస్ర్తాలు కొనుగోలు చేసేందుకు తరలివస్తున్నారు. 

మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలో రూ.4 లక్షల వస్ర్తాలు కొనుగోలు..

చేనేత పరిశ్రమను ఆదుకోవాలనే సదుద్దేశంతో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సారథ్యంలో జిల్లా నేతలు చేనేత వస్ర్తాలు కొనుగోలు చేశారు. మే 24న ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్‌.భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వారి సతీమణులతో పోచంపల్లికి తరలివచ్చి రూ.4 లక్షల చేనేత వస్ర్తాలు కొనుగోలు చేశారు. 

డీసీసీబీ చైర్మన్‌ ఆధ్వర్యంలో రూ.1.80 లక్షల చేనేత వస్ర్తాలు..

కేటీఆర్‌ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కూడా స్పందించారు. చౌటుప్పల్‌ మండలలంలోని కొయ్యలగూడెం చేనేత సహకార సంఘానికి వచ్చి సుమారు రూ.1.80 లక్షల చేనేత వస్ర్తాలు కొనుగోలు చేశారు.  డీసీసీబీ సర్వసభ్య సమావేశంలో ఈ వస్ర్తాలను సభ్యులకు కానుకగా ఇవ్వాలనే కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా చేనేత సహకార సంఘాలతోపాటు, మాస్టర్‌ వీవర్స్‌ నుంచి పలువురు చేనేత వస్ర్తాలను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల చేనేత కార్మికులను ఆదుకోవడానికి సినీ నటి, యాంకర్‌ అనసూయ కూడా చేనేత కార్మికులకు నిత్యావసరాలు అందజేసి చేనేత వస్ర్తాలు కొనుగోలు చేశారు. 

మండల నేతల చేయూత..

మంత్రి కేటీఆర్‌ పిలుపుతో పోచంపల్లి ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి సుమారు రూ.లక్ష విలువగల చేనేత వస్ర్తాలు కొనుగోలు చేయగా జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి రూ.50 వేలు, బీబీనగర్‌ జడ్పీటీసీ గోళి ప్రణితాపింగళ్‌రెడ్డి రూ.50 వేలు, మండలస్థాయి నాయకులు కూడా చేనేత వస్ర్తాలు కొనుగోలు చేశారు. అదేవిధంగా మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఘట్‌కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ముక్తాపూర్‌ను సందర్శించి సుమారు రూ.2 లక్షల 50 వేల చేసే చేనేత వస్ర్తాలు కొనుగోలు చేశారు. 

నేతన్నలకు పండుగే..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నేతన్నల మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర నాయకులు ముందుకు వచ్చి చేనేత వస్ర్తాలు కొనుగోలు చేస్తే పోచంపల్లి ఇక్కత్‌ బ్రాండ్‌లోని రూ.190 కోట్ల విలువగల వస్ర్తాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిల్వ ఉన్న వివిధ రకాల వస్ర్తాలు ఒక్క రోజులోనే అమ్మకాలు జరుగుతాయని పలువురు నేతలు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్య తీసుకొని వస్త్రాలు మొత్తం కొనుగోలు చేసే దిశగా హైదరాబాద్‌లో మెగా మేళా నిర్వహిస్తే చేనేతలకు మంచి గుర్తింపుతోపాటు మళ్లీ మగ్గం వేసుకునేందుకు పని దొరుకుతుందన్నారు.


VIDEOS

logo