సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jun 30, 2020 , 03:01:20

చెరువంత సంబురం

చెరువంత సంబురం

  • కొండపోచమ్మ నుంచి చేరుకుంటున్న నీళ్లు 
  • పారే కాల్వ, నిండిన చెరువులను చూసి రైతన్న మురిపెం 
  • కొండపోచమ్మ నుంచి పరుగులు పెడుతున్న గోదావరి జలాలు
  • నిండుతున్న చెరువులు.. గలగలా పారుతున్న కాలువలు 
  • గంగమ్మను చూసి సంబురపడుతున్న రైతులు
  • పసుపు, కుంకుమ సమర్పించి మంగళహారతులు
  • అపరభగీరథునికి అన్నదాతల జేజేలు  

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : ఎట్టకేలకు రైతాంగం కోరుకున్న కాలం వచ్చింది. కొండపై ఉన్న గోదావరి జిల్లా పాలిట కల్పవల్లిగా చెరువులు, కుంటల్లోకి సాగి వచ్చింది. ఆలేరు నియోజకవర్గంలో గలగలా పారుతున్న గోదావరి నీళ్లను చూసి సంబురపడుతున్నారు. ఈ నెల 24న కొండపోచమ్మ రిజర్వాయర్‌ వద్ద రెండు గేట్లను ఎత్తి నీళ్లను విడుదల చేశారు. ప్రధాన కాల్వలు, పిల్ల కాలువల్లో పారుకుంటూ వస్తున్న గోదావరి తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువుల్లోకి వచ్చి చేరుతోంది. వారం రోజులుగా వస్తున్న నీటితో గోపాలపురం గ్రామ పరిధిలోని పొట్టోనికుంట, మల్ల య్య కుంట,నాగారంపల్లి చెరువులు, తిమ్మాపూర్‌ గ్రామంలోని గూడెం చెరువు అలుగుపోస్తున్నా యి. ఇక్కడి నుంచి గం గమ్మ గొలుసు కట్టు చెరువుల ద్వారా పోచమ్మ చెరువు, దాపల్‌ చెరువు, జగ్గయ్య చెరువు, కొత్త చెరువు, చౌట్ల కుంట, నల్ల చెరువు, ఎర్ర కుంట, ఊర చెరువుల్లోకి చేరనుం ది. ఈ చెరువులు, కుంటలు పూర్తిగా నిండితే 1,350 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచ నా వేశారు. అనధికారిక లెక్కల ప్రకారం 8వేల ఎకరాల వరకు పంటలు పండుతాయని రైతులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ నీళ్లు లేక పడావుంచిన భూముల్లో ఇక సిరులు పండించవచ్చని రైతులు సంబురపడుతున్నారు.

ఇక యేటా రెండు పంటలు 

వర్షాన్ని నమ్ముకునే పంటలను సాగు చేసేటోళ్లం. నాకున్న 3ఎకరాల భూమిలో రెండు ఎకరాలను పడావు పెట్టేది. ఎకరంలో బోరు కింద కూరగాయలు పండించేది. ఈ సారి కాళేశ్వరం నీళ్లొచ్చి చెరువులు నిండాయి. ఇక నుంచి యేటా రెండు పంటలను పండించుకుంట.

- తరిగొప్పుల ఆనందం, రైతు, గోపాలపురం

కండ్ల సంబురమైంది

ఇన్నేండ్లు నీళ్లు లేక గోస పడ్డం. మా ఊరి చెరువులకు గోదావరి నీళ్లొస్తయని కలలో కూడా అనుకోలేదు. పైన ఉన్న కుంటలు నిండి అలుగు పారుతుంటే కండ్ల సంబురంగా ఉన్నది. నేడో, రేపో మా ఊరి పోచమ్మ చెరువులకు నీళ్లొస్తయని అంటుంటే రైతులమంతా సంతోషపడుతున్నం. 

- మెరుగు కృష్ణ, రైతు, గోపాలపురం

నీళ్ల రంది పోయింది 

మా ఊరి పరిధిలో ఉన్న ఏడు చెరువులను గోదావరి నీళ్లతో నింపుతున్నం. నీళ్లొస్తయని ముందే చెప్పడంతో ఉపాధి హామీ పథకంలో ఫీడర్‌ చానళ్లను బాగు చేసుకున్నం. కేసీఆర్‌ సార్‌..  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి  నీళ్ల రంది లేకుండా చేసిండు. 

- పూలపల్లి జ్యోతి, సర్పంచు, గోపాలపురం 

VIDEOS

logo