జిల్లాలో వ్యవసాయానికి మహర్దశ

- ప్రాజెక్టులు, దాని అనుబంధ రంగాలకు సర్కారు పెద్దపీట
- వాయువేగంతో బస్వాపురం జలాశయం పనులు
- ఈ వానకాలంలోనే 1.5 టీఎంసీలు నిల్వ
- నవాబుపేట, అశ్వరావుపల్లి రిజర్వాయర్లతో ఆయకట్టుకు పుష్కలంగా నీళ్లు
- మూసీపై మూడు ఉపకాల్వలకు టీఆర్ఎస్ హయాంలోనే మోక్షం
- ఇప్పటికే కొండపోచమ్మ నుంచి జిల్లాకు చేరుతున్న గోదారమ్మ
- కాళేశ్వరంతో పరుచుకోనున్న పచ్చదనం
కరువుకు కేరాఫ్‌గా ఉన్న జిల్లాలో జలసిరులు పారించి సాగును బాగు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. వలసలను కట్టడి చేసి రెండు పంటలు పండించడంతోపాటు సాగు, దాని అనుబంధ రంగాలకు పునరుజ్జీవం కల్పించేందుకు వాయువేగంతో సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాను గోదావరి, మూసీ జలాలతో అభిషేకించేందుకు గంధమల్ల, బస్వాపురం జలాశయాల నిర్మాణంతోపాటు బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డి కాల్వ, పిలాయిపల్లి కాల్వలను పునరుద్ధరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపురం రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతుండగా, ఈ వానకాలంలోనే 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 15 ఏండ్ల కిందట మూసీపై బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డి కాల్వ, పిలాయిపల్లి మూడు ఉపకాల్వలను నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించి విస్మరించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మూడు కాల్వలను రీడిజైన్ చేసి పరిపాలన అనుమతులు మంజూరు చేసి పనులను కూడా ప్రారంభించింది. ఇప్పటికే నవాబుపేట, అశ్వరావుపల్లి జలాశయాల ద్వారా గుండాల, ఆలేరు మండలాల్లో ఆయకట్టుకు నీరందుతుండగా, ఇటీవల కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు గోదావరి జలాలను విడుదల చేయడంతో నీళ్లు కొండ దిగి చెరువుల్లోకి చేరుతున్నాయి. వారంరోజుల్లో ఐదారు చెరువులు నిండేందుకు సిద్ధంగా ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకున్నది. గత ప్రభుత్వాలకు భిన్నంగా వేల కోట్లు సాగునీటి రంగానికి కేటాయించి లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు సంకల్పిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతీసుకుని జిల్లాలో వ్యవసాయరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం ఓ చారిత్రాత్మక నిర్ణయం కాగా.. గోదావరి, మూసీ జలాలతో జిల్లాను జలాభిషేకం చేసేందుకు నడుంబిగించి రైతులకు భరోసా కల్పిస్తున్నారు. నవాబుపేట, అశ్వరావుపల్లి రిజర్వాయర్ల నుంచి జిల్లాకు నీరందించే ప్రతిపాదనలు గత ప్రభుత్వాల హయాంలో కాగితాలకే పరిమితం కాగా.. టీఆర్ఎస్ హయాంలో కార్యరూపందాల్చింది. మూసీనదిపై నిర్మించతలపెట్టిన బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వల పనులకు గత ప్రభుత్వాలు శంకుస్థాపనలు చేసి వదిలేశాయి. అయితే ఆ కాల్వల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చెరువులను నింపడంతో పాటు వేల ఎకరాలకు సాగు నీరందించే దిశగా చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటైన బస్వాపూర్ ప్రాజెక్టు పనులు ఓ పక్క జరుగుతుండగానే ఈ వానకాలంలోనే 1.5 టీఎంసీల నీరందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
సాగునీటి ప్రాజెక్టులకు యోగం
జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ వచ్చింది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు.. ఏండ్లతరబడి కొనసాగుతున్న ప్రాజెక్టులకు ప్రభుత్వం పునరుజ్జీవం కల్పిస్తోంది. ‘మిషన్ కాకతీయ’ కింద నాలుగు దశల్లో రూ.342 కోట్లతో వెయ్యి చెరువులు పునరుద్ధరణకు నోచుకుంటుండటంతో చిన్న నీటి వనరుల స్వరూపం పూర్తిగా మారబోతోంది. సీమాంధ్ర పాలనలో పడకేసిన ప్రాజెక్టుల్లో చలనం తెచ్చిన సీఎం కేసీఆర్ కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లను పారించి జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నారు.
మూసీపై మూడు ఉప కాల్వలు
మూసీపై మూడు ఉప కాల్వలు నిర్మించేందుకు 2005లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.14.53 కోట్లతో బునాదిగాని కాల్వ, రూ.3.28 కోట్లతో ధర్మారెడ్డి కాల్వ, రూ.23.58 కోట్లతో పిలాయిపల్లి కాల్వలను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించడంతో పాటు శంకుస్థాపనలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆ మూడు కాల్వలను రీ డిజైన్ చేసి అంచనా వ్యయాన్ని పెంచింది. రూ.284.85 కోట్లకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చి పనులు ప్రారంభించింది.
గోదావరి నీళ్లతో జిల్లా సస్యశ్యామలం
2007-2008లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా బస్వాపూర్, గంధమల్ల జలాశయాలను నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించి సర్వే కూడా చేసింది. ఈ రెండు జలాశయాలు సర్వేకే పరిమితం కాగా..తెలంగాణ ప్రభుత్వం వీటికి పునరుజ్జీవం కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 16వ ప్యాకేజీలో బస్వాపురం, 15వ ప్యాకేజీలో గంధమల్లకు నీరు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం రూ.1,082 కోట్లతో అంచనాలు రూపొందించగా..తెలంగాణ ప్రభు త్వం ఆ అంచనా వ్యయాన్ని 1,578 కోట్లకు పెంచింది. గత ప్రభుత్వం డిజైన్ చేసిన 0.8 టీఎంసీల సామర్థ్యాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం 11.39 టీఎంసీలకు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో 22,500 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరందించే సౌలభ్యం ఉండగా..రీ డిజైన్ కారణంగా అదనంగా 22,500 ఎకరాలకు సాగునీరందించే అవకాశం కలుగుతోంది.
వరంగా పొరుగు జిల్లా ప్రాజెక్టులు
జిల్లా సరిహద్దున ఉన్న జనగాం జిల్లాలోని అశ్వరావుపల్లి, నవాబుపేట ప్రాజెక్టుల వల్ల జిల్లాలోని వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు 2007-08 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలో ఉన్నవే. తెలంగాణ ప్రభుత్వం రీ డిజైన్ చేసి 0.5 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులను కార్యరూపంలోకి తెచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అంచనా వ్యయం రూ.237 కోట్ల నుంచి రూ.295 కోట్లకు పెంచి వేగవంతంగా పనులు పూర్తి చేశారు. గుండాల మండలంలో 31 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అలాగే అశ్వరావుపల్లి ప్రాజెక్టును 0.74 టీఎంసీల సామర్థ్యంతో రూ.183 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టింది. పనులు చివరి దశకు చేరుకోగా..ఆలేరు, గుండాల మండలాల్లోని 15 వేల ఎకరాల ఆయకట్టుకు వచ్చే యాసంగి నాటికి నీళ్లు అందనున్నాయి.
నైజాం నాటి కాల్వలకు మహర్దశ
వలిగొండ మండలంలోని ఆసిఫ్‌నగర్ కాల్వను 1903లో నిర్మించారు. దీని ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అయితే నాటి కాల్వలు దెబ్బతిని నీటి పారుదల సరిగ్గా లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం 2016లో రూ.16 లక్షలు మంజూరు చేసి పనులను సైతం పూర్తి చేసింది. ఇదే మండలంలో 1959లో నిర్మించిన భీమలింగం కత్వకు కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొచ్చింది.