గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 25, 2020 , 22:54:38

పోచంపల్లిలో మూడు రోజులు లాక్‌డౌన్‌

 పోచంపల్లిలో మూడు రోజులు లాక్‌డౌన్‌

భూదాన్‌పోచంపల్లి : కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తుండడంతో పోచంపల్లిలో మూడు రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు పట్టణంలోని దుకాణాలు అన్నీ మూసి ఉంచుతామని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీ శ్రీనివాస్‌ తెలిపారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావొద్దని ఆమె కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు.మాస్క్‌ లేకుండా బయట తిరిగే వ్యక్తులకు రూ. 1000 జరిమానా విధిస్తామని ఆమె చెప్పారు. 

ఇదిలా ఉంటే గురువారం పట్టణంలోని రాంనగర్‌కు చెందిన ఓ యువకుడు  గుండెపోటుతో మృతి చెందాడు. అతనికి కరోనా వచ్చి ఉండవచ్చనే అనుమానంతో వైద్యులు శాంపిల్స్‌ సేకరించారు. అతని కుటుంబ సభ్యుల నుంచి కూడా శాంపిల్స్‌ తీసుకుని పరీక్షలకు పంపారు. అతనితో కాంటాక్ట్‌ ఉన్న మరో 11మందిని అధికారులు బీబీనగర్‌ ఎయిమ్స్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు.

పడమటి సోమారంలో కరోనా కలకలం  

బీబీనగర్‌: మండలంలోని పడమటిసోమారం గ్రామంలో శుక్రవారం తండ్రీకొడుకులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సర్పంచ్‌ తలబోయిన గణేశ్‌ యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు మండల వైద్యులతో కలిసి తాసిల్దార్‌ వెంకట్‌రెడ్డి, ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌ గ్రామానికి చేరుకొని పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులలో ఒకరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. మరొకరిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వీరితో కాంటాక్టు ఉన్న వారి వివరాలను సేకరించారు. వీరికి మరోసారి టెస్టులు నిర్వహిస్తామని, వారి రిపోర్టులు వచ్చే వరకు కాంటాక్టులో ఉన్నవారందరూ స్వచ్ఛందంగా హోంక్వారంటైన్‌లో ఉండాలని కోరారు. ఇదిలా ఉంటే సర్పంచ్‌ గణేశ్‌ గ్రామంలో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 

జూలూరులో... 

భూదాన్‌పోచంపల్లి: మండల పరిధిలోని జూలూ రు గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్‌ఐ ఈ నెల 21న రోడ్డు ప్రమాదంలో గాయపడగా హైదరాబాద్‌లో ని ప్రైవేట్‌ దవాఖానకు  తరలించారు. అక్కడ అతనికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌  వచ్చినట్లు మండల వైద్యాధికారి యాదగిరి తెలిపారు. దీంతో అతని కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, గ్రామంలోని దుకాణాలు స్వచ్ఛందంగా బంద్‌ చేయడంతోపాటు గ్రామస్తులు ఎవరూ బయటకు రాకుండా గ్రామ పంచాయతీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

 హోంక్వారంటైన్‌లో 264 మంది 

భువనగిరి: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 264 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  సాంబశివరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 19 మందికి పాజిటివ్‌ వచ్చిందని, 294 మంది నుంచి శాంపిల్స్‌ సేకరించామని చెప్పారు. ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లో  నలుగురు ఉన్నట్లు తెలిపారు.

VIDEOS

logo