శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Jun 25, 2020 , 00:46:47

నేటి నుంచి ఆరోవిడుత హరితహారం

నేటి నుంచి ఆరోవిడుత హరితహారం

  • జిల్లావ్యాప్తంగా లక్ష్యం 46.59 లక్షలు 
  • తుర్కపల్లి మండలం బీల్యానాయక్‌ 
  • తండాలో మొక్కలు నాటనున్న ప్రభుత్వ విప్‌

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ప్రారంభించిన హరితహారం ఆరో విడుత గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఉద్యమ తరహాలో మొక్కలు నాటేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. పల్లె,పట్నం తేడా లేకుండా అన్నిచోట్ల మొక్కలు నాటేలా ప్రణాళిక పూర్తి చేసింది. జిల్లాలో 421 పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీల్లో 46.59 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాఖల వారీగా ఎన్నెన్ని మొక్కలు నాటాలో ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. తుర్కపల్లి మండలం బీల్యానాయక్‌ తండాలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ఆధ్వర్యంలో ఒకేసారి 2 వేల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు.   

భువనగిరి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అధికారులు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం నుంచి జిల్లాలో ప్రారంభం కానున్న హరితహారం ఆరో విడుతకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పూర్తిస్థాయిలో మొక్కలు నాటేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో పలు శాఖల ఆధ్వర్యంలో నాటే మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 46లక్షల 59వేల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధిగమించేందుకు వివిధ శాఖల సమన్వయంతో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఆరో విడుత కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్‌, వ్యవసాయ, ఉద్యానవన, ఎక్సైజ్‌, అటవీ, మున్సిపాలిటీలు, విద్య, పరిశ్రమలు, ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో ఎంత మేరకు మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని ఇప్పటికే చేసినట్లు అధికారులు చెప్పారు.

46లక్షల 59వేల మొక్కలు నాటే లక్ష్యంగా..

హరితహారం ఆరో విడుత కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 46లక్షల 59వేల మొక్కలు నాటే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 420 గ్రామ పంచాయతీలలో అధికారులు నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు. ఒక్క భూదాన్‌పోచంపల్లి మండలంలోని సాయినగర్‌లో మా త్రమే నర్సరీని ఏర్పాటు చేయలేదని అధికారులు తెలిపా రు. ఒక్కో గ్రామ పంచాయతీ నర్సరీలో 10వేల నుంచి 20వేల మొక్కల పెంపకానికి తగ్గకుండా నర్సరీలను నిర్వహించారని, ఇందులో భాగంగానే ఆరో విడుత హరితహారానికి మొక్కలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఏ శాఖకు ఎన్ని మొక్కలు..

డీఆర్‌డీఏ- పంచాయతీరాజ్‌ శాఖలకు 22లక్షల 64 వేలు, వ్యవసాయశాఖకు లక్ష, ఉద్యానవన శాఖకు లక్ష, ఎ క్సైజ్‌శాఖకు 50వేలు, అటవీశాఖకు 7.50 లక్షలు, జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు 13 లక్షల 35వేలు, విద్యాశాఖకు 25వేలు, పరిశ్రమలశాఖకు 25వేలు, ఆరోగ్యశాఖ కు 10వేల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు.

మొక్కలు నాటనున్న ప్రభుత్వవిప్‌..

హరితహారం కార్యక్రమంలో భాగంగా నేడు తుర్కపల్లి మండలం బీల్యానాయక్‌తండాలో 2వేల మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందరెడ్డి పాల్గొననున్నారు. 

ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం..


హరితహారం ఆరో విడుత కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. హరితహారంలో మొక్కలు నాటే లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖలను సమన్వయపరిచాం. ప్రతి శాఖకు హరితహారం లక్ష్యాలను కేటాయించాం. 

          -డీఆర్‌డీఏ పీడీ, ఉపేందర్‌రెడ్డి