నెరవేరిన దశాబ్దాల నిరీక్షణ

- కొండపోచమ్మ నుంచి యాదాద్రీశుని చెంతకు గంగమ్మ
- జిల్లాను ముద్దాడిన గోదావరి జలాలు
- ఆలేరు నియోజకవర్గంలోకి ప్రవేశం
- కొండపోచమ్మ, వెంకటాపురం వద్ద ప్రత్యేక పూజలు
- రెండు చోట్ల గేట్లెత్తి నీటిని విడుదల చేసిన ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి,
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
కరువు ప్రాంతమైన ఆలేరు నియోజకవర్గంలోకి గోదావరి జలాల రాక ప్రారంభమైంది. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ జలాశయం వద్ద ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఈఎన్సీ హరిరాం ప్రత్యేక పూజలు నిర్వహించి గేటెత్తి కాల్వలకు నీటిని వదిలారు. అక్కడినుంచి ఐదు కిలోమీటర్ల దూరాన వెంకటాపురం వద్ద తూం షట్టర్లను ఎత్తి యాదాద్రి జిల్లాలోకి నీటిని విడుదల చేశారు. కాళేశ్వర జలాల తొలి ఫలం ఆలేరు నియోజకవర్గానికి దక్కగా గోదారమ్మ పరుగుపరుగున చెరువుల్లోకి చేరుతున్నది. తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని 16 చెరువులను నింపేందుకు నీటిపారుదల శాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మహోజ్వల ఘట్టానికి రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా హాజరుకావడంతో రెండుచోట్లా పండుగ వాతావరణం నెలకొన్నది.
-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,నమస్తేతెలంగాణ
కాల్వల్లో నీళ్లను చూస మురిసిపోయిన రైతులు
ఎక్కడి గోదావరి.. ఎక్కడి యాదాద్రి..పట్టుబట్టి కొండపైకి నీళ్లెక్కించిన ఘనత అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌దే. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దయతో సిద్దిపేట రంగనాయకుడిని అభిషేకించి కొండపోచమ్మ సిగలో చేరి చెంగుచెంగున పరుగు పెడుతూ యాదాద్రీశుని పాదాల చెంతకు చేరింది.ఓ స్వప్నం నెరవేరింది..కరువు నేలపై గోదావరి గలగలమంది..కాల్వల్లో పారుతున్న గంగమ్మను చూసి రైతాంగం సంబురపడింది.. నీళ్ల గోస తీరిందని ఊపిరిపీల్చుకుంది..ఎవుసానికి రంది లేదని ఆనందపడింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: “ఎక్కడ గోదావరి.. ఎక్కడి యాదాద్రి. త్రివేణి సంగమం నుంచి బయలుదేరి వేములవాడ రాజన్నను.. సిద్దిపేట రంగనాయకుడిని.. గజ్వేల్ కొండపోచమ్మను అభిషేకించి యాదాద్రి నారసింహుడి పాదాల చెంతకు చేరిన గోదావరి మరో ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఏండ్లనాటి రైతాంగం గోస తీర్చేందుకు.. బీడు భూములను వెతుక్కుంటూ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మహోన్నత ఘట్టానికి నాంది పలికింది. వాగులు, వంకలు దాటుకుంటూ.. పరవళ్లు తొక్కుతూ.. పరుగులు పెడుతూ.. వచ్చిన గోదావరి నీళ్లు కండ్లముందు మరోసారి జలదృశ్యం సాక్షాత్కారమైంది.
కొండ పోచమ్మ సాక్షిగా మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కాగా.. ఈ ప్రాంత ప్రజానీకం దశాబ్దాల కల సైతం నెరవేరింది. అలుపెరగని ఆశయ సాధనలో కష్టానికి తగ్గ ఫలితం కండ్లముందు కనిపించగా.. ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం పరవశించిపోయారు. జిల్లాకు కల్పతరువై.. పచ్చని పంటల వరాలిచ్చేందుకు ముందుగా ఆలేరు నియోజకవర్గం తలుపు తట్టిన గోదారమ్మకు పూజలు నిర్వహించి చీరెసారె సమర్పించి ఘన స్వాగతం పలికారు. గత నెల 29న సీఎం కేసీఆర్ కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా చెరువులను నీటితో నింపుతానని ప్రకటించారు.
ఇచ్చిన మాట ప్రకారం.. కొండపోచమ్మ గేటును ఎత్తి నీటిని విడుదల చేయాలని ఆదేశించడంతో బుధవారం ఉదయం 10 గంటలకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద జగదేవ్‌పూర్‌కు వెళ్లే ప్రధాన కాల్వ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. అనంతరం అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద తూం షట్టర్లను ఎత్తి జిల్లాలోకి నీటిని విడుదల చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని ఎం.తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లోని చెరువులకు నీటిని విడుదల చేశారు. కాల్వ మరమ్మతులు పూర్తయి నీటి నిల్వకు అనువుగా ఉన్న 16 చెరువులను నింపేందుకు ఇరిగేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా తుర్కపల్లి మండలంలోని మాదాపురం, గోపాలపురం, చిన్నలక్ష్మాపురంలోని ఐదు చెరువులు, బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి, రామస్వామితండా, తిమ్మాపురం, సోలీపేట, పేరారం గ్రామాల్లోని పదకొండు చెరువులను నింపేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే బుధవారం సాయంత్రానికి ఎం.తుర్కపల్లి మండలంలోని గోపాలపురం గ్రామ పరిధిలో ఉన్న పోచమ్మ చెరువులోకి మాత్రమే నీరు వచ్చి చేరింది. గురువారం నుంచి మిగతా చెరువుల్లోకి క్రమక్రమంగా గోదావరి జలాలు చేరనున్నాయి.
రిజర్వాయర్ వద్ద జన జాతర
ఆలేరు నియోజకవర్గానికి కాళేశ్వరం నీటిని తరలించే సందర్భంలో పండుగ వాతావరణం నెలకొన్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద ప్రధాన గేటు, తుర్కపల్లి కాల్వ వద్ద గేటును ఎత్తిన సందర్భంగా రైతులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి బతుకమ్మను నెత్తిపై పెట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ విప్ కాల్వల్లో నీరు పారుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. తుర్కపల్లి మండలంలోని గోపాలపురం పోచమ్మ చెరువుకు గోదావరి నీళ్లు చేరిన వెంటనే అక్కడికి చేరి మరోసారి పూజలు చేశారు. దివి నుంచి భువికి భగీరథుడు నీటిని తెప్పించగా.. సీఎం కేసీఆర్ భువి నుంచి దివికి నీటిని తరలించి అపర భగీరథుడిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం, ఎస్ఈ వేణు, ఈఈ బద్రీనారాయణ, డీఈ జితేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బీకునాయక్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్, తుర్కపల్లి, బొమ్మలరామారం ఎంపీపీలు సుశీల, సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు నర్సింహారెడ్డి, నర్సింహ, మార్కెట్ కమి టీ డైరెక్టర్ రాంరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ నర్సింహ, టీఆర్ఎస్ బొమ్మలరామారం మండల అధ్యక్షుడు వెంకటేశ్, యాదగిరిగుట్ట సర్పంచు వెంకటయ్య పాల్గొన్నారు.
ఆలేరుకు గంగమ్మ
ఆలేరు: రైతును రారాజుగా చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తోంది. కాళేశ్వరం జలాశయం 14వ ప్యాకేజీలో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ జలాశయంతో ఆలేరు ప్రాంతంలోని బీడు భూములు సాగులోకి రానున్నాయి. ఆలేరు ప్రాంతానికి సాగుజలాలు అందించేందుకు అపరభగీరథుడు సీఎం కేసీఆర్ చేసిన కృషికి సలాం చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ జలాశయంలోని జగదేవపూర్ ప్రధాన కాల్వ తూం వద్ద ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం జగదేవపూర్ తూం, తుర్కపల్లి కాల్వ తూంలను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కొండపోచమ్మ నుంచి నేరుగా తుర్కపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలోని పోచమ్మ చెరువులోకే నీరు వస్తాయన్నారు.
అపరభగీరథుడికి క్షీరాభిషేకం
తాజావార్తలు
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!
- చారిత్రాత్మకం ముజీబుర్ రహ్మాన్ ప్రసంగం.. చరిత్రలో ఈరోజు
- మెగా కాంపౌండ్ నుండి మరో హీరో.. !