మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jun 23, 2020 , 23:05:08

మొక్కే కదాని నిర్లక్ష్యం చేస్తే...ఉద్యోగాలు ఊడుతాయి

మొక్కే కదాని నిర్లక్ష్యం చేస్తే...ఉద్యోగాలు ఊడుతాయి

  • మొక్కలు నాటడం, పెంచడాన్ని ఉద్యమంలా చేపట్టాలి 
  • నిర్వహణ గాలికొదిలేస్తే వేటు తప్పదు 
  • మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత 
  • సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ స్పష్టీకరణ 
  • చౌటుప్పల్‌ తంగెడువనంలో మూడు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష  

‘మొక్కే కదాని నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగాలు పోతాయి. నాటడం, నిర్వహణ, పెంచే వరకు అధికారులు, సిబ్బందిదే బాధ్యత. నాటిన మొక్కలను గాలికొదిలేస్తే మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులపై వేటు వేస్తాం. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ప్రభుత్వ ప్రాధామ్యాన్ని గుర్తించి పనిచేయండి. గతంలో నాటిన మొక్కలు ఎండిపోతే వెంటనే కొత్తవి నాటాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి పొడవు 182 కి.మీ. రేపటి నుంచి ప్రారంభమయ్యే హరితహారంలో జాతీయ రహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో పెద్దఎత్తున మొక్కలు నాటాలి. సిద్దిపేట, గజ్వేల్‌ తరహాలో హైవేకు రెండు వైపులా పచ్చదనం పెరగాలి’ అని సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ స్పష్టం చేశారు. మూడు జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం చౌటుప్పల్‌ సమీపంలోని తంగెడువనంలో ఆమె సమీక్ష నిర్వహించారు.  -చౌటుప్పల్‌

చౌటుప్పల్‌ : మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన అధికారుల ఉద్యోగాలు ఊడుతాయని సీఎం వో ఓఎస్‌డీ ప్రియాంకవర్గీస్‌ హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం తంగెడు వనం లో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు, డీఎఫ్‌వోలతో మంగళవారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారంపై సీఎం కేసీఆర్‌ చేసిన సూచనలను వివరించారు. జాతీయ రహదారి వెంట నాటిన మొక్కల పరిస్థితిపై ఆరా తీశారు. వాడిపోయిన మొక్కలను తొలగించి వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలన్నారు. ఈ నెల 25న సీఎం కేసీఆర్‌ ఆరో విడుత హరితహారాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు ఉమ్మడి జిల్లాలోని 182 కి.మీ మేర ఉన్న జాతీయ రహదారికి ఇరువైపుల మొక్కలు నాటాలన్నారు.జాతీయ రహదారి వెంట ఉన్న హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్ల ఎదుట మొక్కలు నాటాలని, నిర్వాహకులు అడ్డు చెప్తే జరిమానా విధించాలని చెప్పారు. జాతీయ రహదారి పరిధిలోని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలను మొక్కల పెంపకంలో భాగస్వామ్యం చేయాలన్నారు. మొక్కల నిర్వహణ గాలికొదిలేస్తే ఆ పరిధిలోని మున్సిపాలిటీ కమిషనర్లు, పంచాయ తీ కార్యదర్శులపై వేటు తప్పదని హెచ్చరించారు. నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు మొక్కల పెంపకం నిర్వహణకు డబ్బులు చెల్లించాలని సూచించారు. 

ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌,సూర్యాపేట కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, డీఎఫ్‌వోలు, ఎఫ్‌ఆర్‌వోలు, డీఆర్‌డీవో లు, నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు, మున్సిపల్‌ , రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

రాష్ర్టానికే ఆదర్శంగా యాదాద్రి మోడల్‌ ఫారెస్ట్‌..

యావత్‌ రాష్ర్టానికే చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని యాదా ద్రి మోడల్‌ ఫారెస్ట్‌ ఆదర్శంగా మారిందని సీఎంవో ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ తెలిపారు. హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు 180 కోట్ల మొక్కల పెంపకం చేపట్టామన్నారు.  మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం యాదాద్రి మోడల్‌ నేచురుల్‌ పార్క్‌, తంగెడు వనం, అర్బన్‌పార్క్‌ను మంగళవారం ఆమె సందర్శించారు. యాదాద్రి మోడల్‌ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసిన జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎఫ్‌ఆర్వో సర్వేశ్వర్‌, ఫారెస్ట్‌ సిబ్బందిని ఆమె అభినందించారు. ఇక్కడ చేపట్టిన ఎకరం విస్తీర్ణంలో 4 వేల మొక్కల పెంపకాన్ని  రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నామని తెలిపారు. అనంతరం తంగెడువనంలో ఆమె మొక్కను నాటారు.ఈ సందర్భంగా సీఎంవో ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ను కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సన్మానించి, చేనేత మాస్కులను అందజేశారు. 

VIDEOS

logo