సోమవారం 08 మార్చి 2021
Yadadri - Jun 21, 2020 , 23:02:26

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి

  • సన్నరకాల్లో ఉత్తమం తెలంగాణ సోనా
  • చక్కెర పదార్థాల శాతం తక్కువ
  • యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి

ఆలేరు : 6.5 మిల్లీ మీటర్ల మించి ఉండే వరి వంగడం తెలంగాణ సోనా. ఈ రకానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్‌ ఉన్నది. ఇందులో షుగర్‌ పరిమాణం తక్కువగా ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. తెలంగాణ సోనా రకం హాట్‌ కేక్‌లా అమ్ముడు పోతున్నందున రైతులు ఎక్కువశాతం సాగు చేసి, లాభాల బాట పట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది. రైతు బిడ్డగా, వారి కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఎలాంటి పంటలు వేస్తే లాభాలు వస్తాయో పూర్తిస్థాయిలో అవగాహనతో సీఎం కేసీఆర్‌ చెప్పడంతో రైతులు సన్నరకాలు సాగు చేయడంపై దృష్టి సారిస్తున్నారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు అధిక లాభాలు వచ్చే తెలంగాణ సోనా సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు..

ఈ రకం బియ్యంతో చేసిన అన్నం మధుమేహ వ్యాధితో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. మిగతా రకాలతో పోల్చుకుంటే తెలంగాణ సోనాలో కార్బోహైడ్రేట్స్‌ తక్కువ. మిగతా కొన్ని రకాల్లో 60 శాతం పైగానే ైగ్లెసోమిట్‌ ఇండెక్స్‌ ఉంటుంది. తెలంగాణ సోనాలో మాత్రం 51.5 శాతం మాత్రమే ైగ్లెసోమిట్‌ ఇండెక్స్‌ ఉంటుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అనే సంస్థ కూడా నిర్ధారించింది. 55 శాతం కంటే తక్కువ ైగ్లెసోమిట్‌ ఇండెక్స్‌ ఉన్న పదార్థాలు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. వడ్లను మరపట్టేటప్పుడు పాలిష్‌ తక్కువగా వేస్తే మరో రెండుశాతం జీఐ తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2014లో విత్తనం విడుదల..

తెలంగాణ సోనా మసూరి.. వరి సన్నరకాల్లో ఒకటి. దీనికి ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 అని కూడా వాడుకలోఉన్నది. ఈ వంగడాన్ని జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ శా స్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎంటీయూ 1010 రకంలో నుంచి ఆడజన్యువు, జేబీఎల్‌ 3855 రకంలో నుంచి మగ జన్యువుతో సంపర్కం చేసి ఆర్‌ఎన్‌ఆర్‌ అనే కొత్తరకాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. 

అయిదారేండ్ల పరిశోధన అనంతరం 2014లో తెలంగాణ సోనా రకాన్ని విడుదల చేశారు.

చీడ పీడల బెదడ తక్కువ..

ఆర్‌ఎన్‌ఆర్‌ వరి రకానికి చీడపీడల బెడద చాలా తక్కువ. ముఖ్యంగా వరిపంటకు ఎక్కువగా ఆశించే అగ్గితెగులు, దోమకాటును ఈ రకం తట్టుకుంటుంది. యూరియా తక్కువ వాడకం వల్ల అగ్గితెగుల బాధ నుంచి ఉపశమనం ఉంటుంది. దీర్ఘకాలిక పంటలకు ఎక్కువగా దోమకాటు వస్తుంది. ఇదిస్వల్పకాలిక పంట కావడంతో దోమ ఉధృతి పెరిగే సమయంలోనే కోతకు వస్తుంది.

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు..

తెలంగాణ సోనా రకం సాగుచేసినప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ రకం వరికి 120 నుంచి 125 రోజుల వరకు కాలపరిమితి ఉంటుంది. సాగు సమయాలు పాటించకపోవడంతో కోతకు వచ్చే సమయం పెరుగుతుంది. వానకాలం జూలై మొదటివారంలో నారుపోస్తే అక్టోబర్‌ చివరిలో లేదా నవంబర్‌ మొదటివారంలో పంటచేతికి వస్తుంది. చాలామంది రైతులు రోహిణీ కార్తెలో నారుపోయడం వలన 150 రోజుల తర్వాతనే కోతకు వస్తుంది. అదే యాసంగిలో డిసెంబర్‌ మొదటివారంలో నారు అలుకుడు చేస్తే మార్చి చివరిలో, ఏప్రిల్‌ మొదటివారంలో పంట చేతికి వస్తుంది.

సేంద్రియ ఎరువులతోనే అధిక లాభాలు..

మిగతా పంటలతో పోలిస్తే తెలంగాణ సోనాకు సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడులు సాధించవచ్చు. సాధ్యమైనంత వరకు రసాయన ఎరువులను తక్కువగా వాడాలి. ఈ వరి వంగడం 100 సె.మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇతర రకాలతో పోల్చుకుంటే పది సె.మీటర్లు ఎక్కువ. దీర్ఘకాలిక పంటలకైతే యూరియా మరోసారి అదనంగా ఉపయోగిస్తారు. వీటి మాదిరిగానే తెలంగాణ సోనాకు వాడకూడదు. 30 కిలోలు మాత్రమే ప్రతి దఫాకు వాడితే మంచి లాభాలు వస్తాయి.

-రాజేశ్‌కుమార్‌, ఏవో యాదగిరిగుట్ట 

VIDEOS

logo