శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 21, 2020 , 03:28:45

నా తండ్రికల నెరవేరింది

నా తండ్రికల నెరవేరింది


ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

ఆలేరు టౌన్‌ : మాది మధ్య తరగతి కుటుంబం.. నా తండ్రి కిడ్నీ వ్యాధితో పడుతున్న బాధలు చూసి భవిష్యత్‌లో ఎవరు పడొద్దన్న ఆలోచనతోనే డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేశానని, ఇప్పుడు నా తండ్రి కల నెరవేరడంతో చాలా సంతోషంగా ఉన్నదని ప్రభుత్వవిప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. భగవాన్‌ మహావీర్‌ జైన్‌ రిలీఫ్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, దాతలు సమకూర్చిన నిధులతో ఆలేరు పట్టణంలోని సీహెచ్‌సీ పక్కన రూ.30 లక్షలతో నిర్మించిన డయాలసిస్‌ సెంటర్‌ను శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్‌ సభ్యులు తమ సంప్రదాయాలకు అనుగుణంగా 3 గంటల పాటు నిర్వహించిన పూజల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌, డయాలసిస్‌లతో మధ్యతరగతి కుటుంబాలు పడుతున్న బాధలేమిటో తనకు తెలుసన్నారు. వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకునేందుకు పట్టణాల్లోని కార్పొరేట్‌ దవాఖానలకు వెళ్లేవారికి నెలకు సుమారు రూ.50 వేలు ఖర్చు అవుతుందన్నారు. దీంతో చాలా మంది మధ్య తరగతి కుటుంబాలు వైద్యం చేయించుకోలేక పోతున్నారని వారి బాధలను గుర్తించి అసెంబ్లీలో ప్రస్తావించానని తెలిపారు. ప్రభుత్వం సెంటర్‌ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేలోపు మనవంతు ప్రయత్నంగా కొంతమంది దాతలను సంప్రదించి సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేశామన్నారు. భగవాన్‌ మహావీర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాలను చూసి వారిని సంప్రదిస్తే ట్రస్ట్‌ తరపున తప్పా ఇతరులకు తమ సేవలను అందించలేమని వారు చెప్పారన్నారు.  అయినా నిరాశ చెందకుండా డయాలసిస్‌ సెంటర్‌ సాధనే ధ్యేయంగా పలుమార్లు వారితో మాట్లాడి ఒప్పించి సాధించామన్నారు. 

త్వరలోనే వైద్య సేవలు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే మొదటిసారిగా ఆలేరు పట్టణంలో ఏర్పాటు అవుతున్న డయాలసిస్‌ సెంటర్‌ సేవలు నల్లగొండతోపాటు వరంగల్‌ జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సెంటర్‌లో 10 బెడ్లకు సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 6 బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇందులో ఒక్కో బెడ్‌ ద్వారా ముగ్గురికి చికిత్స అందిచనుండటంతో ఒక్కరోజు 18 మందికి ఉచితంగా వైద్యసేవలు అందనున్నాయన్నారు. డయాలసిస్‌ సెంటర్‌లో వైద్య సిబ్బంది, నిర్వహణ బాధ్యత ట్రస్ట్‌ వారే చూసుకుంటారన్నారు. ఆదివారం అమావాస్య, సోమవారం ఆషాఢమాసం మొదలు అవుతున్న దృష్ట్యా శనివారం మంచిరోజు కావడంతో పూజాకార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ నెల 28న ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ డయాలసిస్‌ సెంటర్‌ను పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారని, జూలై 1 నుంచి రోగులకు వైద్య సేవలు అందుతాయన్నారు. ఇప్పటికే వైద్య చికిత్సల కోసం రోగులు ఫోన్‌లో సంప్రదిస్తున్నారని, వారికి త్వరలోనే మంచి వైద్యం అందించేందుకు ఇక్కడ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నదన్నారు. సెంటర్‌ ఏర్పాటుకు దాతలు, మహావీర్‌ ట్రస్ట్‌ వారు అందించిన సాయం ఎప్పుడు మరిచిపోలేమన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా సెంటర్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, పీఏసీఎస్‌ మొగులగాని మల్లేశ్‌, మోటకొండూరు జడ్పీటీసీ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో హనమంతప్రసాద్‌, యాదగిరిగుట్ట రూరల్‌ సీఐ నర్సయ్య, టీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్‌ యాదవ్‌, మొరిగాడి వెంకటేశ్‌, మహావీర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పీసీ పాఠక్‌, సెక్రటరీ ఇందర్‌చంద్‌ జైన్‌, సభ్యులు గౌతం చౌరాడియా, సతీశ్‌ కిమ్‌ సారా, రాజేందర్‌ దుగ్గర్‌, రికాబ్‌ పారాహ, సీహెచ్‌సీ వైద్యులు దుర్గ, శ్రీనివాస్‌, కాంట్రాక్టర్‌ రుక్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo