శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jun 20, 2020 , 00:31:38

మూడేండ్లలో నాలుగు చిట్టడవులు

మూడేండ్లలో నాలుగు చిట్టడవులు

*  అనంతగిరి, ధారూర్‌లోని స్మృతివనం,   అంతారం, అప్పాయిపల్లి,  వికారాబాద్‌ మున్సిపాలిటీలో ఒకచోట

*  ప్రతి చోట రెండున్నర ఎకరాల్లో   చిట్టడవులు  పెంచేందుకు నిర్ణయం

*  ఎకరాకు 4 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళిక

*  నెలాఖరులోగా మియవాకీ ప్రక్రియ     ప్రారంభించేందుకు జిల్లా అటవీ శాఖ నిర్ణయం

*  ఎకరాకు రూ. 3-4 లక్షలు వ్యయం  అంచనా

*  జిల్లాకు రూ.30 లక్షలు మంజూరు 

* 45 రకాల మొక్కలను నాటనున్న అటవీశాఖ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : అటవీ సంపదను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమాన్ని అమలుచేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం అటవీ సాంద్రతను పెంచి హరిత తెలంగాణగా మార్చేందుకు కార్యాచరణను రూపొందించింది. అణు విస్ఫోటనంతో పూర్తిగా ఏడారిగా మారిన జపాన్‌ను మియవాకీ అనే ప్రకృతి ప్రేమికుడు చిట్టడవులను పెంచి తిరిగి వాతావరణంలో మార్పులు తీసుకురావడంతో ఆయన స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చిట్టడవులను పెంచేందకు నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్టుగా ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాను ఎంపిక చేసి సక్సెస్‌ కావడంతో అన్ని జిల్లాల్లో చిట్టడవులను పెంచేందుకు ప్రణాళికను రూపొందించారు. కేవలం మూడేండ్లలోనే చిట్టడవుల్లా మారే విధంగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో రకరకాల మొక్కలను నాటనున్నారు, వీటిలో పొడువు జాతి మొక్కలతో పాటు చిన్నజాతి, పెద్ద జాతి మొక్కలను నాటనున్నారు. జిల్లాలో చిట్టడవులు(మియవాకీ) పెంచేందుకుగాను ప్రభుత్వం ఇప్పటికే రూ.30 లక్షలను మంజూరు చేసింది. అయితే జిల్లాలోని నాలుగు అటవీ ప్రాంతాల్లో దట్టమైన చిట్టడవులను పెంచేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. అదే విధంగా పట్టణాల్లో కూడా చిట్టడవులను పెంచేందుకు ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలోని వికారాబాద్‌ మున్సిపాలిటీలోని అనువైన ప్రాంతంలో చిట్టడవులను పెంచేందుకు స్థలాన్ని గుర్తించనున్నారు.

జిల్లాలో 4 చోట్ల చిట్టడవులు..

జిల్లాలో నాలుగు చోట్ల చిట్టడవులను పెంచేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. వికారాబాద్‌లోని అనంతగిరి, ధారూర్‌ సమీపంలోని స్మృతివనంలో తాండూర్‌ సమీపంలోని అంతారం అటవీ ప్రాంతంలో కొడంగల్‌ సమీపంలోని అప్పాయిపల్లిలోని అటవీ ప్రాంతంలో చిట్టడవులను పెంచేందుకు సంబంధిత అధికారులు కార్యాచరణను రూపొందించారు. ఈ నాలుగు అటవీ ప్రాంతాల్లో రెండున్నర ఎకరాల చొప్పున చిట్టడవులను పెంచేందుకు జిల్లా అటవీ శాఖ నిర్ణయించింది. ఈనెలాఖరులోగా మియవాకీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అయితే జిల్లాకు ఇప్పటికే రూ.30 లక్షలను ప్రభుత్వం మంజూరు చేయగా, ఎకరాకు రూ.3 నుంచి రూ.4 లక్షల చొప్పున ఖర్చు కానుంది. చిట్టడవుల పెంపకానికి ముందు 45 రోజులపాటు గుర్తించిన రెండున్నర ఎకరాల భూమిని సిద్ధం చేయనున్నారు. చిట్టడవులను పెంచేందుకు గుర్తించిన భూమిలో మూడు ఫీట్ల మేర మట్టిని తీయనున్నారు, అనంతరం ఆ ప్రాంతంలో ఎర్రమట్టితో నింపనున్నారు. అదేవిధంగా ఆకులను, 400-500 వానపాములను వదిలిపెట్టనున్నారు. దీంతో ఆకులను తిని వానపాములతో ఎరువులు తయారుకానుంది, దీంతో మొక్కల పెరుగుదల చాలా త్వరగా జరుగనుంది. అంతేకాకుండా రోజు విడిచి రోజు నీరు పట్టనున్నారు. ఇలా 15 రోజుల తర్వాత సంబంధిత భూమిని దున్ని, తదనంతరం మొక్కలను నాటేందుకు గుంతలను తీయనున్నారు. 45 రోజుల్లో మియవాకీకి అనుగుణంగా సంబంధిత భూములను సిద్ధం చేసిన అనంతరం మొక్కలను నాటనున్నారు. మీటరు ఒక మొక్క చొప్పున చిన్న, పెద్ద జాతి మొక్కలతోపాటు పొడువు జాతి మొక్కలను నాటనున్నారు. ఎకరానికి 4 వేల మొక్కల చొప్పున రెండున్నరెకరాల్లో 10 వేల మొక్కలను నాటనున్నారు. అయితే నాటే మొక్కల్లో వరుస క్రమంగా ఒకే రకమైన మొక్కలను నాటకుండా మొదట చిన్నజాతి మొక్క మరో మీటరుకు పెద్ద జాతి మొక్క, మరో మీటరుకు పొడువు జాతి మొక్క ఉండే విధంగా మొక్కలను నాటనున్నారు.  

మూడేండ్లలో చిట్టడవులు..

చిట్టడవుల్లో 45 రకాల మొక్కలను నాటనున్నారు. మారేడు, నేరేడు, రేల, ఇప్ప, మోదుగు, మద్ది, ఎర్రకలప, నెరపి, మద్ది, జువ్వి, నిమ్మ, శ్రీగంధం, తని, జమ్మి, టేకు, ఉసిరి, సీతాఫల్‌, హెన్నా, వెదురుతోపాటు వివిధ రకాల మొక్కలను నాటనున్నారు. అయితే సంబంధిత మొక్కలను పెంచేందుకుగాను ఆయా ప్రాంతాల్లో బోర్లు వేసి డ్రిప్‌ విధానంలో నీరందించనున్నారు. ఒకవేళ బోర్లు లేకపోతే ట్యాంకర్లతో మొక్కలకు నీరు పోసేందుకు నిర్ణయించారు.  అనంతగిరి, ధారూర్‌లోని స్మృతివనంలో బోరు అందుబాటులో ఉంది, అంతారం, అప్పాయిపల్లిలో మాత్రం బోరు వేయనున్నారు. మియవాకీతో అడవుల పెరుగుదలతోపాటు పక్షులకు ఆవాసం ఏర్పడుతుంది. వాతావరణంలో చాలా మార్పులు రానున్నాయి, అటవీ సాంద్రత పెద్దఎత్తున పెరుగుతుంది. పట్టణాల్లోనూ మియవాకీతో కాలుష్యమయంగా మారిన పట్టణాల్లో మంచి వాతావరణం అందుబాటులోకి రానుంది. 

ఈ నెలాఖరులోగా పనులు షురూ... - డీఎఫ్‌వో వేణుమాధవ్‌

ఈనెలాఖరులోగా మియవాకీ ప్రక్రియ ప్రారంభిస్తాం. జిల్లాలోని నాలుగు అటవీ ప్రాంతాల్లో రెండున్నర ఎకరాల చొప్పున ఇప్పటికే గుర్తించామన్నారు.  వికారాబాద్‌ మున్సిపాలిటీలో  శ్రీకారం చుట్టేందుకు త్వరలో అనువైన స్థలాన్ని గుర్తిస్తాం. మియవాకీ విధానంతో మూడేండ్లలో ప్రయోజనం చేకూరనుందన్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటడమే ఈ విధానం యొక్క ముఖ్యోద్దేశం.


VIDEOS

logo