బుధవారం 21 అక్టోబర్ 2020
Yadadri - Jun 19, 2020 , 00:52:10

ప్రత్యేక పూజల కోలాహలం

ప్రత్యేక పూజల కోలాహలం

  • యాదాద్రిలో శ్రీవారి ఖజానాకు  రూ. 1,97,975  ఆదాయం

యాదాద్రి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం జరిగాయి. కొండపైన గల  పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. ఆన్‌లైన్‌లో కల్యాణం, సుదర్శన హోమం, సువర్ణ పుష్పార్చన, జోడు సేవల కోసం బుక్‌ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు జరిపారు. ప్రధానార్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు చింతపట్ల రంగాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు జరిగాయి. పలువురు తల్లులు చంటి బిడ్డలతో శ్రీలక్ష్మీనరసింహుడి దర్శనానికి వస్తుండగా..వారిని అనుమతించకపోవడంతో నిరాశతో ఆలయం బయట కూర్చుంటున్నారు. ఇటీవల పత్రికల్లో చంటిబిడ్డల దర్శనాల గురించి కథనాలు రావడంతో పిల్లలను దర్శనాలకు అనుమతించడం లేదు. కాగా శ్రీవారి ఖజానాకు రూ. 1, 97, 975 ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మేడి శివకుమార్‌, పర్యవేక్షకులు ఎస్‌. వెంకటేశ్వర్‌రావు, వేముల వెంకటేశ్‌, సార నర్సింహ, కృష్ణయ్య, బాలాజీ పాల్గొన్నారు 

చిన్న పిల్లల తల్లులకు ఈవో గీత విజ్ఞప్తి   

పదేండ్లలోపు చిన్న పిల్లలతో భక్తులు యాదాద్రికి రావద్దని  ఆలయ ఈవో ఎన్‌. గీత కోరారు. కొంత మంది తల్లులు తమ చంటి బిడ్డలతో కొండపైకి చేరుకుంటున్నారని, దర్శనానికి నిరాకరించడంతో వారు ఆవేదనతో తిరుగుప్రయాణమవుతున్నారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ముందుగానే దేవాదాయశాఖ నిబంధనలు ఖరారు చేసిందని వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ పాటించాల్సిందేనని చెప్పారు. కొండ కింద అన్ని  పరీక్షలు చేసిన తర్వాతనే భక్తులను కొండపైకి అనుమతిస్తున్నట్లు ఆమె వివరించారు. 


logo