గురువారం 03 డిసెంబర్ 2020
Yadadri - Jun 18, 2020 , 01:12:37

యాదాద్రిలో కొత్త కాంతులు

యాదాద్రిలో కొత్త కాంతులు

  • సీఎంవో భూపాల్‌రెడ్డి బృందానికి నాలుగు సంస్థల ప్రతినిధుల ప్రజంటేషన్‌ 

యాదాద్రి,నమస్తేతెలంగాణ : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో దేశంలో  ఎక్కడాలేని పద్ధతుల్లో లైటింగ్‌ విధానం ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. బుధవారం సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఆర్కిటెక్టు ఆనందసాయి, ఆలయ ఈవో గీత, ట్రాన్స్‌కో ఎస్‌ఈ లింగారెడ్డిలకు లైటింగ్‌ ఎలా ఉండాలనే విషయమై దేశంలోనే పేరెన్నికగన్న నాలుగు కంపెనీల ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు.  యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు పూరి ్తకావస్తుండటంతో లైటింగ్‌ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి, వైటీడీఏ  చైర్మన్‌ కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రెండో ఘాట్‌రోడ్డులో నెరి లైటింగ్‌ విధానం ఏర్పాటు చేయడంతో ఎంతో ఆకర్షణీయంగా పరిసరాలు కనిపిస్తున్నాయి.

నెరి లైటింగ్‌ విధానం ఏర్పాటు చేసిన సంస్థ వారు ఇప్పటికే పలు దఫాలుగా వైటీడీఏ అధికారులకు ప్రజంటేషన్‌ ఇచ్చారు. అధునాతన పధ్ధతుల్లో లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలని సీఎం చేసిన సూచనల మేరకు రంగంలోకి దిగిన వైటీడీఏ అధికారులు పలు కంపెనీల ప్రత్యేకతలు తెలుసుకుంటున్నారు. వారం రోజుల్లో సీఎం కేసీఆర్‌కు ప్రజంటేషన్‌ ఇవ్వటానికి ముందస్తుగా భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందానికి పూర్తి వివరాలు అందజేసి ప్రాథమికంగా తమ తమ ప్రాధాన్యతలను ఆయా సంస్థల ప్రతినిధులు వివరించే ప్రయత్నం చేశారు.  ప్రపంచంలోని పలు పేరొందిన దేశాల్లోగల పార్కులు, సందర్శిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న లైటింగ్‌ విధానాన్ని యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నారని సమాచారం.