గుట్టలో ఘనంగాఏకాదశి పర్వదినం

- నయనానందకరంగా వేడుక
- కొవిడ్ నిబంధనలతో కొనసాగిన దర్శనాలు
- యాదాద్రి ఆలయ అష్టభుజ మండపాలపై కవర్లు కప్పివేత
- నిర్మాణాల లోటుపాట్లపై దృష్టి సారించిన అధికారులు
యాదాద్రి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామికి బుధవారం లక్ష పుష్పార్చనను కనుల పండువగా నిర్వహించారు. ఏకాదశి కావడంతో శ్రీవారికి లక్ష పుష్పాలతో కొలుస్తూ అపురూపంగా పూజాకైంకర్యాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బట్టర్ సురేంద్రాచార్యులు, మోహనాచార్యులు, వేదపండితుల ఆధ్వర్యంలోని అర్చక బృందం శ్రీలక్ష్మీనరసింహుడికి లక్ష పుష్పార్చనను ఘనంగా నిర్వహించింది. లక్ష పుష్పాలతో శ్రీవారిని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఏకాదశి రోజున శ్రీలక్ష్మీనరసింహుడికి లక్ష పుష్పార్చన చేయడం ఆనవాయితీ.
కరోనా నేపథ్యంలో ఆన్లైన్లో రుసుం చెల్లించిన భక్తుల గోత్రనామాలతో పలు పూజా కైంకర్యాలు నిర్వహించారు. అదేవిధంగా నిత్య పూజల సందడి కూడా కొనసాగుతున్నది. ఏకశిఖరవాసుడిని దర్శించి తరించాలన్న సంకల్పంతో వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా గంటకోసారి దేవస్థానం మైకు ద్వారా భక్తులు ఆచరించాల్సిన విధి విధానాలను అనౌన్స్మెంట్ చేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ దర్శనాల ప్రక్రియ కొనసాగుతున్నది. ముఖమండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం జరిపారు. రోజూ జరిగే నిత్యకల్యాణోత్సవం నిర్వహించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.
శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన శ్రీస్వామి అమ్మవార్లకు హారతి నివేదన జరిపారు. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. రామలింగేశ్వరుడి ఆలయ సన్నిధిలో మహాశివుడిని ఆరాధిస్తూ అభిషేకం, అర్చన జరిపారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపించారు. ఆలయ పుష్కరిణి వద్ద ఆంజనేయస్వామికి కైంకర్యాలు నిర్వహించారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మేడి శివకుమార్, సూపరింటెండెంట్లు వేముల వెంకటేశ్, ఎస్. వెంకటేశ్వర్రావు, సార నర్సింహ, బాలాజీ, కృష్ణయ్య పాల్గొన్నారు.
నిర్మాణం లోటుపాట్లపై దృష్టిసారించిన అధికారులు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో లోటుపాట్లను సరిదిద్దుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. యాదాద్రిలో ఆధారశిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణశిలలతో నిర్మాణ పనులు చేపట్టినందున వాటి అమరికకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది.
నాలుగైదు ఏండ్లలో లేనివిధంగా జూన్‌లోనే భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రభావం యాదాద్రి నిర్మాణ పనులపై పడుతున్నది. ప్రధానాలయంలోకి నీళ్లు వస్తుండటంతో వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారం రోజులుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల పురావస్తుశాఖ అధికారులతో పాటు ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ప్రతినిధులు యాదాద్రిలో పర్యటించి చేసిన సూచనల మేరకు అష్టభుజ మండపాల అమరిక నుంచి సన్నటి జలధారలు వస్తున్నట్లు గుర్తించి వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావుకు తెలియపర్చారు.
దాంతో ప్రాకారాలపైన నిర్మాణం చేసిన అష్టభుజ మండపాలపై బుధవారం ప్లాస్టిక్ కవర్లను కప్పే పనులు ప్రారంభించారు. కొండపైన 28 అష్టభుజ మండపాల నిర్మాణం జరుగగా నాలుగింటిపైన సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం భారీగా వర్షం కురిసినప్పుడు వీటి నుంచే నీళ్లు వస్తున్నట్లు స్థపతులు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా వర్షం కురిసినప్పుడు ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయనే విషయంపై పురావస్తుశాఖ అధికారులు ఒక నివేదికను కూడా అధికారులకు అందజేసినట్లు సమాచారం.
కొత్తగా నిర్మాణం చేస్తున్న అద్దాలమండపం పైభాగంలో కూడా కవర్లు కప్పుతున్నారు.తుది దశ పనులు జరిగే సమయానికి అంతా సర్దుకుంటుందని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు చెప్పారు.