గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 15, 2020 , 23:15:44

పంజా విసురుతున్న మాయదారి వైరస్‌

పంజా విసురుతున్న మాయదారి వైరస్‌

  • జిల్లాలో ఇప్పటివరకు 12 పాజిటివ్‌ కేసులు  
  • బయటకెళ్లాలంటే  వణుకుతున్న జనం 
  • కరోనాతో స్తంభిస్తున్న  పాలన 
  • జడ్పీ సీఈవోతోపాటు  కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు  ఇండ్లల్లోనే.. 
  • సమీక్షలు, సమావేశాలు  లేక వెలవెలబోతున్న ఆఫీసులు 
  • లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న జనం 
  •  మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించని వైనం 
  • అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్య ఆరోగ్యశాఖ 

కనిపించని శత్రువు కరోనా జిల్లాలో పంజా విసురుతున్నది. నెలక్రితం వరకు ఒక్క కేసు నమోదు కాకుండా గ్రీన్‌జోన్‌లో ఉన్న జిల్లాలో మెల్లమెల్లగా వైరస్‌ విస్తరిస్తున్నది. వలసకూలీల తోపాటు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే వారితో కేసుల సంఖ్య పెరుగుతున్నది. పల్లె,పట్నం తేడాలేకుండా అన్ని ప్రాంతాల్లోనూ దడ పుట్టిస్తున్నది. ఎవరి నుంచి, ఎక్కడి నుంచి మహమ్మారి విరుచుకుపడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవు తున్నది. జిల్లా పరిషత్‌ సీఈవోకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయనతో పలుమార్లు సమావేశమైన కలెక్టర్‌ సహా ఇతర ఉన్నతాధికారులంతా హోంక్వారం టైన్‌లో ఉన్నారు. కిందిస్థాయి  ఉద్యోగులు, సిబ్బంది కలిపి మొత్తం 36 మంది హోం క్వారంటైన్‌కే పరిమితం కావడంతో పాలనకు గుండెకాయ లాంటి కలెక్టరేట్‌లో కార్యకలాపా లు పూర్తిగా స్తంభించాయి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చేవారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. వైరస్‌ ధాటికి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల పర్యటనలు నిలిచిపోయాయి. అయితే కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో మార్పురావడం లేదు. యథేచ్ఛగా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ సంచరిస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా తిరుగుతుండడంతో వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతోంది. ఎవరికి వారు అత్యంత జాగురుకతతో ఉండడమే మేలని వైద్యారోగ్యశాఖ సూచిస్తున్నది.  

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో వైరస్‌ విస్తరిస్తోంది. వరుస కేసులతో జనం వణికిపోతున్నారు. ఎవరికీ అతీతం కానట్లు.. జిల్లా స్థాయి అధికారితోపాటు పోలీసులు, సామాన్యులు కరోనా బాధితులు కావడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాలకే కాదు, పల్లెలకు కూడా వైరస్‌ సెగ తాకడం కంగారు పెట్టిస్తోంది. హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్న వారే వైరస్‌ బాధితులు కావడంతో అధికారులు అప్రమత్తమై వ్యాప్తి నిరోధం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్‌, జడ్పీ కార్యాలయాల్లో జిల్లా అధికారులు, కిందిస్థాయి సిబ్బంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు. జిల్లాలో పాలనా వ్యవహారాలు స్తంభించే పరిస్థితి నెలకొంది. గడప దాటితే గండం పొంచి ఉండడంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.

జిల్లాలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ విస్తరిస్తూ ప్రజానీకాన్ని కలవర పెడుతోంది. ప్రాథమిక కాంటాక్ట్స్‌ లేకపోయినా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితులకు వైరస్‌ ఎలా సోకిందో అధికారులు  గుర్తించలేకపోతున్నారు. అప్పటికే అనారోగ్యంతో ఉండి హైదరాబాద్‌లోని వివిధ దవాఖానలకు చికిత్స కోసం వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలు బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే పండుగలు, శుభ కార్యాలకు వెళ్లి వైరస్‌ బారిన పడిన వారూ ఉన్నారు.

స్తంభించిన పాలన... 

జిల్లాలో ఇప్పటివరకు 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటం.. అక్కడి నుంచి రాకపోకలు సాగించిన జడ్పీ సీఈవో దంపతులకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఉద్యోగులు, సిబ్బంది కలిపి మొత్తం 36 మంది హోం క్వారంటైన్‌కే పరిమితం కావడంతో పాలనా వ్యవహారాలు స్తంభించిపోయాయి. మరోపక్క ప్రజా ప్రతినిధులు, నేతల పర్యటనలకు సైతం బ్రేక్‌ పడింది. 

నిర్లక్ష్యమే కారణం

లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో ఒక్క కేసు నమోదు కాలేదు. సడలింపుల తర్వాతే కొత్తగా కేసులు వచ్చాయి.  వలస కూలీల రాక సందర్భంగా అప్పట్లో ఏకంగా 36 వరకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జాగ్రత్తలు పాటించాలని చెప్పినా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌ నుంచి రాకపోకలు చేసే వారు నిర్లక్ష్యంగా ఉండి వైరస్‌ను అంటించుకుని వస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా క్షణ క్షణం భయం నెలకొనగా.. అడుగు బయట పెట్టాలంటేనే జంకే పరిస్థితులు నెలకొన్నాయి.

అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం

కరోనా విజృంభిస్తుండడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. హైదరాబాద్‌ నుంచి వచ్చే వారి వల్లనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపుతున్నాం. కరోనా వ్యాప్తిపై వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నాం.

- సాంబశివరావు, డీఎంహెచ్‌వో


VIDEOS

logo