వేసవిలో 96 కుటుంబాలు..100 రోజుల పనిదినాలు

- మార్చి, ఏప్రిల్ నెలల్లోనే రూ.15.60 కోట్ల పనులు
- ఈ ఏడాది లేబర్ బడ్జెట్లో 43.59 శాతం పూర్తి
- లాక్డౌన్లో కడుపు నింపుతున్న కరువు పని..
- వలస కుటుంబాలకు సొంతూర్లోనే భరోసా
- అడిగిన వెంటనే అందరికీ జాబ్‌కార్డులు
- పెరిగిన భత్యంతో ఆసరా
లాక్డౌన్లో పనులు లేక పైసలకు ఇబ్బంది పడిన కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కొండంత భరోసానిచ్చింది. స్థానిక కూలీలతో పాటు వలస వెళ్లొచ్చిన వారికీ సొంతూరులోనే ఉపాధి దొరికింది. ఆపత్కాలంలో ‘పెరిగిన భత్యం’ ఎంతో ఆసరా అయింది. అడిగిన వెంటనే జాబ్‌కార్డులు ఇచ్చి అధికారులు ప్రతి ఒక్కరికీ పని కల్పించారు. దీంతో జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం కూలీల హాజరు శాతం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు నిత్యం 25 వేల మంది మాత్రమే ఉపాధి పనుల్లో పాల్గొనగా..ఈ ఏడాదిలో 50 వేల నుంచి 60 వేల మంది కూలీలు భాగస్వామ్యులయ్యారు. 2020-21 సంవత్సరానికి రూ.65 కోట్ల లేబర్ బడ్జెట్ నిర్ణయించగా, జూన్ నెలాఖరు నాటికి రూ.34.56 కోట్ల మేర పనులు చేయాల్సి ఉంది. అయితే కూలీల హాజరు రికార్డు స్థాయిలో ఉండడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లోనే రూ.15.60 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ వేసవిలోనే 96 కుటుంబాలు 100 రోజుల పనిదినాలను పూర్తి చేసుకోవడం జిల్లా చరిత్రలోనే ఓ రికార్డుగా నిలిచిపోయింది.
- యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ
జిల్లా పేరు : యాదాద్రి భువనగిరి
ఆవాసాల సంఖ్య : 650
జాబ్‌కార్డుల సంఖ్య : 1,49,466
ఉపాధి కూలీల సంఖ్య : 3,24,069
శ్రమశక్తి సంఘాల సంఖ్య : 8,455
ఆర్థిక సంవత్సరంలో పనుల సంఖ్య : 20,677
ఇప్పటి వరకు పూర్తయినవి : 1,320
కూలీలకు చెల్లింపులు : రూ.22.69 కోట్లు
యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకప్పుడు నిత్యం 25 వేల మంది కూలీలు మాత్రమే ఉపాధి పనుల్లో పాల్గొనగా.. ఈ ఏడాదిలో 50వేల నుంచి 60 వేల మంది కూలీలు భాగస్వాములవుతున్నారు. 2020-21 సంవత్సరానికి రూ.65కోట్ల లేబర్ బడ్జెట్ నిర్ణయించగా..జూన్ నెలాఖరు నాటికి రూ.34.56 కోట్ల మేర పనులు చేయాల్సి ఉంది. అయితే కూలీల హాజరు రికార్డు స్థాయిలో ఉండడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లోనే రూ.15.60 కోట్ల మేర పనులు జరిగాయి.
లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో వలస కూలీలకు ఉపాధి హామీ పథకం కొండంత ఆసరాగా నిలువగా.. వేసవిలోనే 96 కుటుంబాలు 100 రోజుల పనిదినాలను పూర్తి చేసుకోవడం జిల్లా చరిత్రలోనే ఓ రికార్డుగా నిలిచిపోయింది. కరువుకు మారుపేరైన యాదాద్రి భువనగిరి జిల్లాలో వలసలు కూడా ఎక్కువే. పనులు లేక సతమతమవుతున్న కూలీల ఉపాధికి లాక్డౌన్ మరింత గండి కొట్టింది. అయితే సీఎం కేసీఆర్ మానవతా ధృక్పథంతో ఉపాధి హామీ పథకంలో విరివిగా పనులు కల్పించి కూలీలకు అండగా నిలిచారు. గతంలో ఉపాధిని వెతుక్కుంటూ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో కూలీలు హైదరాబాద్, ముంబయి తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. అయితే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో.. వీరంతా తిరుగుముఖం పట్టి సొంతూర్లకు చేరుకున్నారు. దీంతో పనులు లేక వలస కుటుంబాలు ఉపాధి కరువై విలవిలలాడే పరిస్థితి నెలకొంది.
పనులు లేక ఏ ఒక్క కుటుంబం కూడా పస్తులతో ఉండకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వలస కూలీలకు రేషన్‌తోపాటు రూ.500 ఇచ్చి ఆదుకోగా.. మరోపక్క ఉపాధి హామీ పథకం పనులు సైతం కూలీలకు ఆసరాను ఇస్తున్నాయి. జాబ్ కార్డులలో ఇప్పటికే నమోదై ఉన్న కూలీలతోపాటు సొంతూర్లకు వలస వచ్చిన కూలీలు కూడా ఉపాధి పనుల్లో పాల్గొంటుండడంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూలీల హాజరు శాతం సైతం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో రెండు నెలల వ్యవధిలోనే 96 కుటుంబాలు 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకున్నాయి.
వలస కార్మికులకు వెనువెంటనే జాబ్ కార్డుల జారీ..
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి సొంతూర్లకు వచ్చిన కూలీలకు చాలా వరకు జాబ్ కార్డులు లేవు. ఇతర ప్రాంతాల్లో పనులు చేసుకుంటుండడంతో జాబ్ కార్డులు తీసుకోలేదు. జాబ్ కార్డు లేనిదే పనులు కల్పించే పరిస్థితి లేకపోవడంతో లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోసం జాబ్‌కార్డులు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారులు వలస కూలీలకు వెనువెంటనే జాబ్ కార్డులను మంజూరు చేస్తున్నారు. అడిగిన వారికి వెంటనే పనులు కల్పిస్తున్నారు. జిల్లాలో గతంలో 1300 కుటుంబాలకు కొత్తగా అధికారులు జాబ్‌కార్డులను మంజూరు చేశారు. ఫలితంగా 3,162 మంది కూలీలకు కరువు పరిస్థితుల్లో ఉపాధి దొరికినైట్లెంది.
ముందంజలో మూడు మండలాలు..
కూలీలకు ఉపాధి పనులు కల్పించడంలో జిల్లాలో మూడు మండలాలు ముందంజలో ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి మే 30వ తేదీ వరకు రాజపేట మండలంలో 7,161 మంది కూలీలకు 1,09,193 పనిదినాలు కల్పించి రూ.1.76 కోట్ల కూలీ డబ్బుల చెల్లింపులు జరిగాయి. అలాగే భువనగిరి మండలంలో 7,399 మంది కూలీలకు 1,03,643 పనిదినాలు పని చేసి రూ.1.72 కోట్ల మేర కూలీ డబ్బులను పొందారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో 7,416 మంది కూలీలు 79,388 రోజులు పనిచేసి రూ.1.15 కోట్ల కూలీ డబ్బులతో ఆర్థిక చేయూత పొందారు.
కుటుంబానికి ఆసరా దొరికింది..
మాయదారి కరోనా వల్ల పనులు లేక ఇంటి పట్టునే ఉన్నాం. కుటుంబం గడిచేదెట్లా అని దిగులు పడ్డాం. ఉపాధిలో పనులు దొరికాక మా కుటుంబానికి కొండంత అండ దొరికినైట్లెంది. మా ఆయనతోపాటు ఇద్దరు కొడుకులు, కోడలు ఉపాధి పనులకు పోతున్నాం. ఒక్కొక్కరికి రోజుకు రూ.175 కూలీ పడుతోంది. కరువు కాలంలో ప్రభుత్వం కల్పించిన పనులతో మా కుటుంబమంతా ఇబ్బందులు లేకుండా బతుకుతున్నం.
- నోముల అంజమ్మ, ఎల్లగిరి గ్రామం, చౌటుప్పల్ మండలం
రికార్డు స్థాయిలో పనులు కల్పించాం..
ఈ ఏడాది లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఉపాధి పనులకు డిమాండ్ పెరిగింది. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా స్వస్థలాలకు చేరుకోవడంతో వారందరికీ జాబ్ కార్డులు జారీ చేసి పనులు కల్పించాం. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో చేరుకోవాల్సిన లక్ష్యాన్ని ఈ రెండు నెలల కాలంలోనే రెండో వంతు పూర్తి చేశాం. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పనిదినాలు నమోదు కాలేదు. కూలీల హాజరుశాతం గణనీయంగా పెరగడం వల్లనే రికార్డు స్థాయిలో పనులు జరిగి 100 రోజుల పని దినాలను రెండు నెలల్లోనే పూర్తి చేసిన కుటుంబాలు చాలా ఉన్నాయి.
- ఎం.ఉపేందర్ రెడ్డి, డిఆర్డీవో, యాదాద్రి భువనగిరి జిల్లా
తాజావార్తలు
- స్నానానికి ఏ నీళ్లు మంచివి?
- ప్రయాణాల్లో ఆహార చిట్కాలు
- కుమార్తెను నరికి.. తలతో గ్రామంలో నడిచిన తండ్రి
- వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్