శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 14, 2020 , 03:59:58

రైతులందరికీ రైతు బంధు..

రైతులందరికీ రైతు బంధు..

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి,నమస్తేతెలంగాణ : వానకాలం సాగుకు రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. జూన్‌ నెలాఖరు వరకే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నది. ఐదో విడుతలో అందించే పెట్టుబడి సాయాన్ని మరికొంత మందికి అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం కొత్తగా పాసుపుస్తకాలు పొందిన వారితో పాటు.. ఇంతకు ముందే పాసుపుస్తకాలు వచ్చినా.. రైతు బంధుకు దరఖాస్తు చేసుకోని వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 13వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా 13,586 దరఖాస్తులు రాగా.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

రైతులందరికీ రైతు బంధు..

రైతులపై పంటల సాగు భారం పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర  ప్రభుత్వం రైతులందరికీ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నది. రైతులకు మొదట్లో ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడి సాయాన్ని ఇచ్చిన ప్రభు త్వం రేండేండ్ల కిందట రూ.5 వేలకు పెంచి రైతుల ఖా తాల్లో సాయం మొత్తాన్ని జమచేస్తూ వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 2.12 లక్షల మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు ఇంకా 15,195 మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయలేదు. అలాగే ఇటీవలి కాలంలో మరో 17,890 మంది రైతులు కొత్త పాసుపుస్తకాలు పొందారు. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తవారికి కూడా అవకాశం కల్పించడంతో పాటు ఇప్పటి వరకు రైతు బంధుకు దరఖాస్తు చేసుకోని రైతులు అన్ని మండల కేంద్రాల్లోని వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి తమ బ్యాంకుల ఖాతా నెంబర్లను శనివారం సాయంత్రం వరకు అందజేశారు.

నాలుగు విడుతల్లో అందిన పెట్టుబడి సాయం..

జిల్లాలోని రైతాంగానికి ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు విడుతలుగా పెట్టుబడి సాయాన్ని అందజేసింది. 2018 వానకాలం సాగుకు 1,71,882 మంది రైతులకు రూ.203.42 కోట్లు, 2018 యాసంగిలో 1,62,858 మంది రైతులకు రూ.198.5 కోట్లను పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేసింది. 2019 వానకాలంలో 1,72,343 మందికి రూ.216.83 కోట్లు, 2019 యాసంగిలో 1,25,205 మందికి రూ.127.85 కోట్లను పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించింది. అదేవిధంగా ఐదో విడుతలో వానకాలం సాగుకు జూన్‌ నెలాఖరు నాటికి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తున్నది.

కొత్తగా రైతుబంధు దరఖాస్తుల వివరాలు ఇలా..

భువనగిరి మండలంలో 3,600 మంది రైతులకు కొత్త పాసుపుస్తకాలను ప్రభుత్వం జారీ చేయగా అందులో 500 మంది రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్నారు. యాదగిరిగుట్ట మండలంలో 2,500 మంది రైతులకు కొత్త పాసుపుస్తకాలు రాగా 1500 మంది రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆత్మకూరు (ఎం) మండలంలో 814 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 425 మంది రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు. మోత్కూరు మండలంలో 1,237 మంది రైతులకు కొత్త పాసుపుస్తకాలు రాగా 823 మంది రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు. మోటకొండూరు మండలంలో 1300 మంది రైతులకు కొత్త పాసుపుస్తకాలు రాగా 760 మంది రైతు బంధుకు దరఖాస్తు చేసుకున్నారు. రాజాపేట మండలంలో 2,346 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 1,006 మంది రైతు బంధుకు దరఖాస్తు చేసుకున్నారు. చౌటుప్పల్‌ మండలంలో 1,600 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 800 మంది రైతులు రైతు బంధుకు దరఖాస్తు చేస్తున్నారు. తుర్కపల్లి మండలంలో 2,867 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 1,134 మంది రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలో 1,126 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 811 మంది రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆలేరు మండలంలో 1,146 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 490 మంది రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు.

గుండాల మండలంలో 437 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 232 మంది రైతు బంధుకు దరఖాస్తు చేసుకున్నారు. రామన్నపేట మండలంలో 1,350 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 721 మంది రైతు బంధుకు దరఖాస్తు పెట్టుకున్నారు. బొమ్మలరామారం మండలంలో 772 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 608 మంది రైతు బంధుకు దరఖాస్తు చేసుకున్నారు. అడ్డగూడూరు మండలంలో 1,266 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 770 మంది రైతు బంధుకు దరఖాస్తు చేసుకున్నారు. భూదాన్‌పోచంపల్లి మండలంలో 1,071 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 640 మంది రైతు బంధుకు దరఖాస్తు చేసుకున్నారు. వలిగొండ మండలంలో 1,991 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 966 మంది రైతు బంధుకు దరఖాస్తు చేసుకున్నారు. బీబీనగర్‌ మండలంలో 2,294 మందికి కొత్త పాసుపుస్తకాలు రాగా 1500 మంది రైతు బంధుకు దరఖాస్తు చేసుకున్నారు.

VIDEOS

logo