గురువారం 04 మార్చి 2021
Yadadri - Jun 14, 2020 , 03:49:10

వినాయక విగ్రహాల తయారీపై కరోనా ఎఫెక్ట్‌

వినాయక విగ్రహాల తయారీపై  కరోనా ఎఫెక్ట్‌

బీబీనగర్‌: కరోనా మహమ్మారి వల్ల వినాయక విగ్రహాల తయారీదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మార్చి 22 నుంచి మొదలైన లాక్‌డౌన్‌ కొంత కొనసాగుతుండటంతో విగ్రహాలు తయారు చేసుకొని జీవనం కొనసాగించేవారికి ఇక్కట్లు తప్పడం లేదు. ఇటీవల జూన్‌ 30వతేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలులో ఉన్నాయి. ఆగస్టు 22న వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించకపోతే తమ పరిస్థితి ఏమిటని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయోమయంలో తయారీదారులు 

భువనగిరితో పాటు బీబీనగర్‌ మండలం కొండమడుగుమెట్టు, గూడూరు గ్రామ శివారులో రాజస్థాన్‌ కార్మికులు  గణేశ్‌ విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. మొత్తంగా జిల్లాలో దాదాపు వంద కుటుంబాల వరకు ఇక్కడ పదేండ్లుగా విగ్రహాలు తయారు చేయడంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 1000 విగ్రహాల వరకు తయారు చేసి సిద్ధంగా ఉంచాలనే ఆలోచనకు కరోనా గండికొట్టింది. అప్పు చేసి మరీ వినాయక ప్రతిమలు తయారు చేస్తుండగా ఈ ఏడాది కరోనా నేపథ్యంలో వారి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొంత మొత్తంలో తయారు చేస్తున్న విగ్రహాలకు రంగులు వేయాలా..? వద్దా..? అన్న సందిగ్ధంలో  ఉన్నారు. తయారు చేసిన కొద్దిపాటి విగ్రహాలకు కవర్లు కప్పి ఉంచారు. ఇప్పుడు విగ్రహాలను తయారు చేయడమే కాదు.. తయారు చేసిన వాటికి రంగులు వేస్తే మరింత ఆర్థిక భారం పడే అవకాశం లేకపోలేదు.

VIDEOS

logo