శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 14, 2020 , 03:45:53

ఆదర్శంగా కొత్తజాల గ్రామ పంచాయతీ

ఆదర్శంగా కొత్తజాల గ్రామ పంచాయతీ

రాజాపేట: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం నడుంబిగించింది. దేశానికి పట్టుకొమ్మలైన పల్లెసీమలను ఆదర్శంగా  తీర్చిదిద్దాలనే  సంకల్పంతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా ఇటీవల నూతన గ్రామ పంచాయతీగా మారిన  ఓ పల్లె పారిశుధ్యం, హరితహారం, స్వచ్ఛతతో పాటు అభివృద్ధి వైపు పరుగులు పెడుతుండటంతో ఆగ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలోనే ఆభివృద్ధిలో కొత్తజాల గ్రామ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని  పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. 

వ్యవసాయ ఆధారిత గ్రామపంచాయతీ

మండలంలోని కొత్తజాలలో 120 నివాస గృహాలు, 580  మం ది జనాభా ఉన్నారు. మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న  కొత్తజాల గ్రామ పంచాయతీని  గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవం చేసుకున్నారు. పల్లె ప్రజలంతా  వ్యవసాయం, పాడి పరిశ్రమతో జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ పెద్దగా జలవనరులు లేక పోయినా రైతులు విభిన్న  పంటలు సాగు  చేపట్టి అధిక లాభాలు పొంది పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.  అభివృద్ధి కోసం గ్రామస్తులు కలిసి కట్టుగా శ్రమిస్తున్నారు.

పారిశుధ్యం.. గ్రామ స్వచ్ఛత

గ్రామ రూపు రేఖలు మార్చేందుకు  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల పల్లె ప్రగతిని గ్రామస్తులు పక్కాగా అమలు పర్చారు. గ్రామ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక కమిటీలతో పాటు  ప్రజలను భాగస్వాములను చేశారు.  గ్రామంలో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు, డంపింగ్‌ యార్డు, కంపోస్ట్‌ యూనిట్‌ నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంటింటికీ తడి, పొడి చెత్త బుట్టలు ఉపయోగిస్తుండటంతో పంచాయతీ  పరిశుభ్రంగా కనిపిస్తున్నది. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నారు.

మొక్కలు నాటి సంరక్షించి..

తొలి విడుత పల్లె ప్రగతిలో ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటి సంరక్షించారు. రోడ్డుకు ఇరువైపులా  నాటిన 480   మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఆదే విధంగా గ్రామ నర్సరీ ద్వారా 10 వేల మొక్కలను గ్రామ పాఠశాల ఆవరణ, ఇంటింటికీ, విధుల్లో నాటి సంరక్షిస్తుండటంతో ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. 

పల్లె రోడ్డుకు మహర్దశ

పల్లె రోడ్డుకు మహర్దశ పట్టుకున్నది.  సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేసింది. దీని ద్వారా రూ. 60 లక్షలు మంజూరు చేయించేందుకు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ నిధులతో గ్రామ శివారులో గల ప్రాథమిక పాఠశాల నుంచి కొత్తజాల వరకు  రెండు కిలో మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం  చేపట్టారు. ఆదే విధంగా గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్లు సైతం నిర్మించారు.  


VIDEOS

logo