కేసులెన్ని వచ్చినా వైద్యానికి సిద్ధం

- స్థానికంగానే కరోనాకు చక్కటి వైద్యం
- జిల్లాలో నాలుగుచోట్ల 50 పడకలతో ఐసోలేషన్ కేంద్రాలు
- మరో నాలుగు ప్రాంతాల్లో 500 పడకలతో క్వారంటైన్ కేంద్రాలు
- బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్న ప్రభుత్వ సిబ్బంది
- ఇప్పటి వరకు 12 పాజిటివ్ కేసులు, 300 మంది డిశ్చార్జి
- హోంక్వారంటైన్లో 198 మంది
- ఎంతమంది వచ్చినా చికిత్సకు సిద్ధం : డీఎంహెచ్‌వో
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటూనే మరోపక్క వైరస్ బారిన పడి ఆయా దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నది. బాధితులు త్వరగా కోలుకునేలా బలవర్థకమైన ఆహారం అందజేస్తున్నది. వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులున్న వారికి రోగ నిరోధకశక్తి పెంచే మందులిస్తూ వారి ఆయుష్షు పెంచుతున్నది. వలసకార్మికులు, హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించిన వారితోనే జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటివరకు 12 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. మిగతా వారు ఆయా దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కేసుల ఉద్ధృతి పెరిగినా వేగంగా వైద్యమందించేలా భువనగిరి, ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్‌లలో 50 పడకలతో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు 500 పడకలతో బీబీనగర్‌లోని ఎయిమ్స్, భూదాన్‌పోచంపల్లిలోని రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ, భువనగిరిలోని గురుకుల పాఠశాల, ప్రభుత్వ దవాఖానలో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పక్కాగా పారిశుధ్యం చేపట్టడం, కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్ చేయడంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెద్దగా పెరుగలేదు. స్థానికంగానే చక్కటి వైద్యమందిస్తుండడంతో బాధితులకు మానసిక సాంత్వన చేకూరి త్వరగా కోలుకొని ఇండ్లకు వెళ్లిపోతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. తెలిసో తెలియకో వైరస్ బారి న పడిన బాధితులకు సాంత్వన కలిగించేలా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లి వ్యయప్రయాసలకు గురికాకుండా స్థానికంగానే చికిత్స అందించి బాధితులకు గొప్ప ఊరటను కల్పిస్తోంది. యాదా ద్రి భువనగిరి జిల్లాలో నాలుగు ప్రభుత్వ దవాఖానలలో 50 పడకలతో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మరో నాలుగు ప్రాంతాల్లో 500 పడకలతో క్వారంటైన్ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్లో ఉన్న వారికి ఎప్పటికప్పుడు వైరస్‌ను తట్టుకుని రోగ నిరోధక శక్తిని పెంచే మందులను ఇవ్వడంతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో సర్కారు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో విజయవంతం అవుతున్నాయి. ప్రాణాంతక కరోనాను అదుపు చేసేందుకు వ్యాక్సిన్ లేని నేపథ్యంలో దానిని ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకునేందుకు వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, పరిశుభ్రతను పాటించడం వంటి చర్యలను చేపడుతూనే కరోనా బాధితులను గుర్తించి సత్వరమే దవాఖానాకు తరలిస్తున్నారు. కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్ చేయడం వంటి ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెద్దగా లేదు. మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారు ఈ ప్రాంతంలో లేనప్పటికీ ముంబయి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులకు పాజిటివ్ రావడంతో వారిని గాంధీ దవాఖానాకు తరలించి అధికారులు జాగ్రత్త పడ్డారు. కరోనా అనుమానితులను ఉంచేందుకు బీబీనగర్ ఎయిమ్స్ లో 200 పడకలతో క్వారంటైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వారి రోగనిరోధక శక్తి పెరిగేలా చర్యలు తీసుకున్నారు.
కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా...
మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 12 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృత్యువాత పడ్డారు. ముంబయి నుంచి 3,400 వలస కార్మికులు జిల్లాకు రాగా.. ఇందులో 36 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిని గాంధీ దవాఖానకు తరలించి, మిగిలిన కార్మికులను ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. వారు ఆరోగ్యంగా ఉన్న తరువాత స్వగ్రామాలకు పంపించారు. అయితే ఇటీవలి కాలంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలోని దవాఖానలో 20 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని, ఆలేరు, చౌటుప్పల్, రామన్నపేట ప్రభుత్వ దవాఖానలలో 10 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో 200 పడకలతో, భూదాన్ పోచంపల్లిలోని రామానందతీర్థ గ్రామీణ విద్యా సంస్థలో 170 పడకలతో, భువనగిరి పట్టణంలోని బాలుర సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 120 పడకలతో, భువనగిరి ప్రభుత్వ దవాఖానలోని హోమియోపతి విభాగంలో 10 పడకలతో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వైద్యుల నిరంతర పర్యవేక్షణలో...
జిల్లాలో ప్రస్తుతం 198 మంది హోం క్వారంటైన్లో ఉండగా..ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ అయిన బీబీనగర్ ఎయిమ్స్‌లో 8 మంది చికిత్స పొందుతున్నారు. వారికి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో వైరస్‌ను తట్టుకునే మం దులను అందిస్తున్నారు. బీపీ, షుగర్, గుండెజబ్బులు, టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. వీరందరికీ ప్రతి రోజు పౌష్టికాహారం ఇవ్వడంతో వేగంగా కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు బీబీనగర్ ఎయి మ్స్ నుంచి 330 మంది డిశ్చార్జి అయ్యారు.
హోంక్వారంటైన్లో 198మంది
భువనగిరి : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జిల్లాలో 198 మందిని హోంక్వారంటైన్లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు గురువారం తెలిపారు. జిల్లాలో 10 మందికి పాజిటివ్ వచ్చిందని, 242 మంది నుంచి శాంపిల్స్ సేకరించామన్నారు. ప్రభుత్వ క్వారంటైన్లో ఎవరూ లేరని తెలిపారు.
ఆందోళన వద్దు
కరోనా వైరస్ బారిన పడినవారు ఆందోళన చెందవద్దు. కరోనా బాధితులు, అనుమానితులకు జిల్లా పరిధిలోనే చికిత్స అందించే ఏర్పాట్లు చే శాం. జిల్లాలో నాలుగు చోట్ల ఐసోలేషన్ కేంద్రాలు, మరో నాలుగు చోట్ల క్వారంటైన్ కేంద్రాలు ఉన్నాయి. ఎంత మంది బాధితులు వచ్చినా చికిత్స అందిస్తాం. బాధితులకు పోషకాహారం ఇవ్వడంతో పాటు మందులను అందిస్తూ వైద్యుల సమక్షంలో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. - డీఎంహెచ్‌వో సాంబశివరావు
తాజావార్తలు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!
- బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ..?