ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jun 10, 2020 , 23:39:45

కరోనా ఆపత్కాలంలోగర్భిణులు, బాలింతల సంరక్షణ

కరోనా ఆపత్కాలంలోగర్భిణులు, బాలింతల సంరక్షణ

 • గర్భిణులకు సురక్షిత  కాన్పయ్యేలా ఐసీడీఎస్‌ చర్యలు
 • టేక్‌ హోం రేషన్‌ ద్వారా పౌష్ఠికాహారం అందజేత
 • ఇంటింటికి తిరిగి అందించిన అంగన్వాడీ టీచర్లు
 • బాలింతలు, వృద్ధులు,  వికలాంగులకూ అండ 
 • జిల్లాలో 864అంగన్‌వాడీ కేంద్రాలు 
 • లాక్‌డౌన్‌ కాలంలో 5,719 మంది గర్భిణులకు సేవలు

గర్భిణులు, బాలింతలు, మూడేండ్లలోపు చిన్నారుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు వారికి కల్పతరువులా మారాయి.  లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితుల్లోనూ వారికి పౌష్ఠికాహారం అందిస్తూ అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు అమ్మలా వ్యవహరించారు. ప్రతీ పూట వారి బాగోగులను పర్యవేక్షిస్తూ కావాల్సిన ఆహారాన్ని అందించారు. ప్రభుత్వ సూచన మేరకు టేక్‌ హోం రేషన్‌ ద్వారా బియ్యం, పప్పు, పాలు, గుడ్లు, నూనెప్యాకెట్లను నాలుగు విడుతలుగా పంపిణీ చేశారు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు హైరిస్క్‌, రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతలకు మల్టీగ్రెయిన్‌ రాగిపిండి, బెల్లం, కర్జూరాన్ని అదనంగా అందజేశారు. జిల్లావ్యాప్తంగా నాలుగు ప్రాజెక్టుల పరిధిలో 864 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో మూడేండ్లలోపు చిన్నారులు 19,529 మంది, 5,719 గర్భిణులకు నిత్యం పోషకాహారమందిస్తూ వారి ఆలనాపాలన చూస్తున్నారు. పోషకాహారం లోపం ఉన్న చిన్నారులకు వారానికి నాలుగు కోడిగుడ్లు, 100 లీటర్ల పాలు అందించారు. లాక్‌డౌన్‌ కాలంలో సుమారు 5,719 మంది గర్భిణులకు సకాలంలో సేవలందించి సురక్షిత ప్రసవం జరిగేలా చేశారు. అంతేకాదు సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం మహిళా శిశుసంక్షేమ శాఖ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంచాయతీల ద్వారా అంగన్వాడీ సెంటర్లకు సరఫరా అవుతున్న బియ్యం, ఇతర వస్తువులను ఈ యాప్‌లో ఫొటోలతో సహ అప్‌లోడ్‌ చేస్తున్నారు.                                                                                                                           -ఆలేరు  

 • జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు : 864
 • గర్భిణులు : 5,719
 • బాలింతలు : 4,674
 • మూడేండ్లలోపు చిన్నారులు : 19,529
 • ఆరేండ్ల లోపు పిల్లలు : 12,005

ఆలేరు: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా విపత్తు కాలంలో స్త్రీ,శిశు సంక్షేమశాఖ అమ్మకు ఆసరాగా నిలిచింది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలను కంటికి రెప్పలా చూసింది. ప్రతి పూట వారి యోగక్షేమాలు పర్యవేక్షిస్తూ పౌష్టికాహారం అందించింది. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించింది. సురక్షిత ప్రసవాలు జరిగేలా క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు అమ్మలకు అమ్మలయ్యారు. వృద్ధులకు, వికలాంగులకు సైతం ఆసరాగా నిలిచారు. 

జిల్లాలోని  ఐసీడీఎస్‌ ఆధ్యర్యంలో ఉన్న 4 ప్రాజెక్టుల పరిధిలో 864 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆయా సెంటర్ల పర్యవేక్షణలో ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలను కరోనా సమయంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు అమ్మల్లా వ్యవహరించారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతల సంరక్షణలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు టేక్‌ హోం రేషన్‌ ద్వారా బియ్యం, పప్పు, పాలు, గుడ్లు, ఆయిల్‌ ప్యాకెట్లు నాలుగు విడుతలుగా పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు హైరిస్క్‌, రక్తహీనత ఉన్న గర్భిణులు, బాలింతలకు మల్టీగ్రెయిన్‌ రాగిపిండి, బెల్లం, కర్జూరం అదనంగా పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని మూడేండ్ల లోపు చిన్నారులు 19,529 మందితోపాటు మిగిలిన సెంటర్లలో పోషకలోపం ఉన్న చిన్నారులకు వారానికి నాలుగు కోడిగుడ్లు, 100 లీటర్ల పాలు అందించారు.

సీడీపీవోల పర్యవేక్షణ..

జిల్లాలోని 4 ప్రాజెక్టులలో సీడీపీవోలు కరోనా విపత్తు సమయంలోనూ ప్రతిరోజు మూడు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శిస్తూ ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులతో మమేకమయ్యారు. వారికి వైద్య సలహాలతోపాటు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. పౌష్టికాహారం పంపిణీపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. ఒక వేళ 108 అందుబాటులో లేకుంటే ఐసీడీఎస్‌ అధికారులే ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి వారిని ప్రభుత్వ దవాఖానలకు తరలించారు. లాక్‌డౌన్‌ కాలంలో ఇప్పటి వరకు సుమారు 5,719 మంది గర్భిణులకు సకాలంలో సేవలు అందించి సురక్షితంగా ప్రసవం జరిగేలా చేశారు. బాలింతలు, చిన్నారుల విషయంలో కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే వారికి పౌష్టికాహారం అందేలా చేశారు. ప్రతిరోజూ సీడీపీవో, సూపర్‌వైజర్లు తనిఖీలు చేసి కామన్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌(కాస్‌) ద్వారా లైవ్‌ ఫొటోలు అప్‌లోడ్‌ చేశారు.

వృద్ధులు, వికలాంగులకు ఆసరాగా..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు రాని వృద్ధులు, వికలాంగులకు సైతం అంగన్‌వాడీ టీచర్లు అండగా నిలిచారు. సరుకులను నేరుగా ఇంటికే అందజేశారు. ఇందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. వయోవృద్ధులకు టోల్‌ ఫ్రీ నంబర్‌: 14567, వికలాంగులకు:180057289 90 ఉండగా, ఫోన్‌ సమాచారం అందిన వెంటనే అంగన్‌వాడీ టీచర్లు వారికి కావాల్సిన సదుపాయాలు, దాతల సహకారం తీసుకుని సరుకులు అందజేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

పారదర్శకత కోసం ప్రత్యేక యాప్‌..

అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన బియ్యం సరఫరాను ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామ పంచాయతీ కార్యాలయాల ద్వారా ఆయా కేంద్రాలకు నాణ్యమైన బియ్యాన్ని చేరవేసింది. పారదర్శకత కోసం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ సాయంతో పంపిణీ చేశారు. బాలింతలు, గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.  

మాతా, శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా..

మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో బలవర్ధక ఆహారం(బాలామృతం, పాలు, గుడ్లు తదితర సరుకులు) అందిస్తున్నారు. కేంద్రాల్లో నమోదైన లబ్ధిదారులకు అంగన్‌వాడీ టీచర్లు నాణ్యమైన బియ్యాన్ని, ఇతర సరుకులను ఇంటికే తీసుకెళ్లి అందజేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన కొవిడ్‌-19నిబంధనలు అమలు చేసేందుకు జిల్లా ఐసీడీఎస్‌ అధికారులు నిమగ్నమయ్యారు.  

ఆపత్కాలంలో ప్రత్యేక కార్యాచరణ

లాక్‌డౌన్‌ కాలంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. గర్భిణులు, బాలింతలకు కష్టకాలంలో తోడుగా ఉన్నాం. గర్భిణులు, బాలింతలు, ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చాం. ప్రతిరోజు వారిని పరామర్శిస్తూ ఆరోగ్యంపై జాగ్రత్తలు సూచించాం. ఆపదకాలంలో అండగా ఉండాలి. లాక్‌డౌన్‌ కాలంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం.

- ర్యాకల స్వరాజ్యం, ఇన్‌చార్జి పీడీ యాదాద్రిభువనగిరి


VIDEOS

logo