శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 08, 2020 , 23:57:41

యాదాద్రిలో ప్రారంభమైన సేవలు

యాదాద్రిలో ప్రారంభమైన సేవలు

  • 80 రోజుల విరామం  తర్వాత దర్శన భాగ్యం  
  • తొలిరోజు ఆలయ ఉద్యోగులు,స్థానికులకే అవకాశం 
  • నేటి నుంచి అందరికీ అందుబాటులోకి.. 
  • మాస్క్‌, భౌతికదూరం తప్పనిసరి 

యాదగిరీశుడి దర్శనంతో భక్తులు పరవశమయ్యారు..స్వామి దివ్యతేజస్సును చూసి ఉప్పొంగిపోయారు..80 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం యాదాద్రి ఆలయాన్ని సోమవారం వేకువజామునే తెరవగా, సుప్రభాతంతో కైంకర్యాలు  ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఆలయ ఉద్యోగులు, స్థానికులకే దర్శనభాగ్యం కల్పించగా, క్యూలైన్‌ వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష, శానిటైజ్‌ చేశాకే స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు దర్శనాన్ని నిలిపివేశారు. నేటి నుంచి సమస్త భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. సమూహంగా కాకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆలయానికి రావాలని అధికారులు సూచించారు.  

యాదాద్రి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం దర్శనాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దేవేరులను భక్తులు దర్శించుకున్నారు.  తమ ఇష్టదైవాన్ని దర్శించుకున్నామన్న ఆనందం వారిలో వ్యక్తమైంది. తొలి రోజు స్థానికులు, ఆలయ విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో శ్రీవారి ఆలయానికి తరలివచ్చారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుని క్యూలైన్లలో భక్తులు నిలబడ్డారు. ప్రతి గంటకు ఆలయ అధికారులు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసి జాగ్రత్తలు తీసుకున్నారు.  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ట్రైనీ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, ఆలయ ఈవో ఎన్‌. గీత, అనువంశిక ధర్మకర్త బీ. నర్సింహమూర్తిలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. 80 రోజుల తరువాత దర్శన భాగ్యం కలిగిందన్న ఆనందంతో భక్తులు దేవస్థానం సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించారు. ఉదయం సుప్రభాతంతో కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. నిజాభిషేకం నిర్వహించారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న అభిషేకం పూజల్లో పాల్గొనేందుకు ఒక భక్తుడు డబ్బులు చెల్లించడంతో అతని గోత్రమనామాలతో పూజలు నిర్వహించారు. నిత్యకల్యాణం, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్‌ వచ్చినందున వారి పేర్లతో పూజలు జరిపారు. సోమవారం కావడంతో యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి  రుద్రాభిషేకం నిర్వహించారు.  కొండపైన శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో పరమశివునికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో పరమశివుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం నిర్వహించారు. శివాలయంలో జరిగిన పూజా కైంకర్యాలను ఉప ప్రధాన పురోహితులు గౌరీభట్ల నర్సింహరాములుశర్మ ఆధ్వర్యంలో జరిపారు. 

భారీ బందోబస్తు 

డీసీపీ కే నారాయణరెడ్డి, యాదాద్రి ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. పోలీసు శాఖ బాంబ్‌ డిటెక్టింగ్‌ టీమ్‌ను రంగంలోకి దించి కొండపైన అణువణువు శోధించారు. అడుగడుగునా పోలీసులు మోహరించడంతో భక్తులు సాఫీగా దర్శనాల్లో మమేకమయ్యారు. ఎక్కడా భౌతిక దూరం ఉల్లంఘించిన ఘటనలు చోటు చేసుకోలేదని ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.  యాదగిరిగుట్ట సీఐ పాండురంగారెడ్డి, ఎస్‌.ఐలు రామకృష్ణారెడ్డి, రాజులు బందోబస్తును పర్యవేక్షించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మేడి శివకుమార్‌, దోర్భల భాస్కర శర్మ, సూపరింటెండెంట్లు వేముల వెంకటేష్‌, ఎస్‌. వెంకటేశ్వర్‌రావు, సార నర్సింహ, బాలాజీ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.  

తెరుచుకున్న రామలింగేశ్వరాలయం..

ఆత్మకూరు(ఎం):  లాక్‌డౌన్‌ సడలింపుతో సోమవారం మండల కేంద్రంలోని రామలింగేశ్వర ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. స్థానిక సర్పంచ్‌ జన్నాయికోడె నగేశ్‌తో పాటు ఆలయ కమిటీ చైర్మన్‌ గడ్డం దశరథగౌడ్‌ దంపతులు తొలిరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షుడు బూడిద శేఖర్‌ పాల్గొన్నారు.

 మట్టపల్లి లక్ష్మీనృసింహస్వామి..

మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి రాజ్యలక్ష్మీ  చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం సోమవారం తెరుచుకుంది. నృసింహుని  ఆలయం తెల్లవారుజామున 4గంటలకు తెరిచిన అనంతరం ఆలయ పూజారులు స్వామివారికి  సుప్రభాత సేవ నిర్వహించారు. అదే విధంగా శివాలయంలో  ప్రాతఃకాల పూజ నిర్వహించారు.  ఉదయం 6గంటల తర్వాత ఆలయంలోకి భక్తులను థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి  ఆలయంలోకి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఈవో  ఉదయభాస్కర్‌  ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లిరావు,  ఆలయ అర్చక బృందం పాల్గొన్నారు.

వాడపల్లి ఆలయాల్లో..

దామరచర్ల: మండలంలోని వాడపల్లి ఆలయాల్లో భక్తులకు సోమవారం దైవర్శనం కల్పించారు. కృష్ణామూసీ నదుల సంగమ తీరంలోని మీనాక్షీ అగస్తేశ్వర, లక్ష్మీనర్సింహస్వామి ఆలయాల్లో పూజాది కార్యక్రమాలను అర్చకులు రామాజనుజాచార్యులు, నాగేంద్రప్రసాద్‌, సాంబశివశర్మ నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలను కల్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మృత్యుంజయశాస్త్రి, కమిటీ చైర్మన్‌ కే సిద్దయ్యలు తెలిపారు. 

 చెర్వుగట్టులో..

నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామిని సోమవారం భక్తులు దర్శించుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామివారిని తిలకించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ సిబ్బంది అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు. 

మెట్ల దారి  పనులు ప్రారంభం 

 యాదాద్రి కొండపైకి మెట్లదారి పనులను సోమవారం ప్రారంభించారు. గత ఏడాదిగా కొండ కింద గల వైకుంఠ ద్వారం వద్ద  మెట్లదారిని మూసివేసి వైకుంఠగోపురం (గాలిగోపురం) పనులు ప్రారంభించారు. గాలిగోపురం పనులు పూర్తికావడంతో మెట్ల దారి పనులు ప్రారంభించారు. తిరుమల తరహాలో అధునాతన పద్ధతిలో మెట్ల నిర్మాణం  చేయనున్నారు. 

మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం..

వలిగొండ: వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో ప్రసిద్ధి చెందిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం కొండపై శానిటైజర్‌ స్టాండ్‌ను ఏర్పాటు చేశారు. భక్తులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకున్నట్లు దేవస్థానం ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కేశిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. 


 


VIDEOS

logo