శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jun 07, 2020 , 23:43:47

లాక్‌డౌన్‌లో ఇచ్చింది సడలింపులే...

లాక్‌డౌన్‌లో ఇచ్చింది సడలింపులే...

  • కొవిడ్‌ నిబంధనలు బేఖాతరు.. 
  • కోరలు చాస్తున్న కరోనా... 
  • జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు 
  • ఆంక్షల గీత దాటుతున్న ప్రజలు
  • అప్రమత్తంగా లేకుంటే  అంతే సంగతులు

లాక్‌డౌన్‌ కొనసాగుతూనే ఉంది.. ఆంక్షల గీత దాటి స్వేచ్ఛగా విహరిస్తానంటే కరోనా కోరలు చాపి కూర్చున్నది. అదును చూసి దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నది. ఇవేమీ పట్టని ప్రజానీకం నిబంధనలన్నీ బేఖాతరు చేస్తున్నారు. భయం లేకుండా బాజాప్తాగా రోడ్లపైకి వస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణానికే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. జిల్లాలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. రాజధాని సరిహద్దులు దాటుకుని జిల్లాలోకి వచ్చిన కరోనా మీ ఇంటి వరకూ రావొచ్చు.   ఇప్పటికైనా మేలుకోకుంటే ముప్పు తప్పదంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. బాధ్యతగా మసులుకుంటేనే బతుకు నిలుస్తుందని గుర్తెరుగుదాం. అవసరానికే అడుగు బయట పెడదాం. ఆంక్షల గడువు లోపలే గూటికి చేరుదాం. 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమక్రమంగా ఎత్తేస్తున్నారు..  నిబంధనల సడలింపుతో జనం బయటకు వస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా మార్కెట్లు సైతం తెరుచుకున్నాయి. రవాణా ఇతరత్రా వాటిపై క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు..కాని కరోనా భూతం మాత్రం ఇంకా భయపెడుతూనే ఉంది. జిల్లాలో రోజుకోచోట ఉనికిని చాటుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. అయితే జనం మాత్రం సడలింపులంటే స్వేచ్ఛ అనుకొని బాజాప్తాగా రోడ్లపైకి వస్తున్నారు. భౌతికదూరం పాటించక పోవడం.. మాస్కులు ధరించకపోవడం వంటి నిబంధనలను సైతం గాలికొదిలేస్తున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాక ఇతరులకు ప్రమాదకరంగా మారుతున్నారు. ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత విషమించి తీవ్ర ఆందోళనకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.’

 హైదరాబాద్‌ నగరం కరోనా తాండవంతో చిగురుటాకులా వణుకుతోంది. సడలింపుల తర్వాత అక్కడ వైరస్‌ మరింత విజృంభిస్తోంది. మొన్నటి వరకు ఒక్క కేసు కూడా లేకుండా ప్రశాంతంగా ఉన్న  జిల్లా నాలుగైదు రోజులుగా నమోదవుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సరిహద్దు జిల్లాలో ఉన్నంత తీవ్రత జిల్లాలో లేకపోయినా..ప్రతి ఒక్కరూ అప్రమత్తం కాకపోతే మన వద్ద ఆ పరిస్థితి ఎంతో దూరం లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చౌటుప్పల్‌లో నాలుగు కేసులు, భువనగిరి జిల్లా కేంద్రంలో, రాజపేట మండలంలోని దూదివెంకటాపూర్‌లో, రామన్నపేట, యాదగిరిగుట్టలో ఒక్కో కేసు చొప్పున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. క్రమంగా కేసులు సంఖ్య పెరగడంతో మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ తరుణంలో మరింత అప్రమత్తంగా ఉంటేనే కేసులను కట్టడి చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

నిబంధనలు పాటించే వారే కరువు.. 

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపుతో జిల్లా వ్యాప్తంగా కొందరు కోవిడ్‌-19 జాగ్రత్తలు పాటించకుండానే తిరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ కారణంగా గతంలో కంటే బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అవసరం లేకపోయినా కొందరు బయటికి వస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. భౌతిక దూరాన్ని పాటించడం లేదు. వ్యాపార వర్గాలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. దుకాణాల వద్ద  స్క్రీనింగ్‌, శానిటైజర్‌ వంటి వాటిని కూడా అందుబాటులో ఉంచడం లేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలకు ఆంక్షల సడలింపులు ఇవ్వడంతో రాకపోకల తాకిడి పెరిగి వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. శుభ్రత విషయంలోనూ చాలామంది రాజీ పడుతున్నారు. ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. మరికొందరు విందులు, వినోదాలు, పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. వారిలో కొందరు తమకు పాజిటివ్‌ ఉన్నా..తెలియక పాల్గొంటున్నారు. ఇవన్నీ ముప్పు పెరగడానికి దోహదం చేస్తున్నాయని వైద్యాధికారులు అంటున్నారు. సోమవారం నుంచి మరిన్ని సడలింపులు అమల్లోకి వచ్చి దేవాలయాలు, హోటల్స్‌  తెరుచుకోనుండడంతో పరిస్థితి ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 

ఈ జాగ్రత్తలను పాటిద్దాం 

  • బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా వీధులు, అపార్ట్‌మెంట్లలో గుంపులుగా చేరకూడదు. వేడుకలు, ఆటలకు కొంతకాలం దూరంగా ఉండాలి.
  • నివాసాల చుట్టుపక్కల కంటైన్మెంట్‌ జోన్లు ఉంటే.. అటువైపు వెళ్లకూడదు. అటువైపు నుంచి బయటికి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • వృద్ధులను గడప దాటనీయవద్దు. చిన్న పిల్లలను షాపింగ్‌లకు తీసుకెళ్లవద్దు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే విధిగా మాస్కులు ధరించాలి.
  •  ఆట స్థలాలు, ఈత కొలనులు, పనిమనుషుల రాకను పూర్తిగా బంద్‌ చేసినప్పటికి కొన్ని చోట్ల వీటి విషయంలో సడలింపులు ఇచ్చారు. కేసులు పెరుగుతున్న క్రమంలో వీటిపట్ల కొద్ది జాగ్రత్తలు పాటించాలి.
  • ఎవరికి వారు ఇంట్లోకి వెళ్లేముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కానీ, శానిటైజర్‌తో కానీ కడుక్కోవాలి. అప్పుడే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమని వైద్యులు సూచిస్తున్నారు. 

మరో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌

హైదరాబాద్‌లో చెంగిచెర్ల కనకదుర్గ కాలనీలో నివాసముంటూ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చిందని పట్టణ ఎస్‌ఐ రాజు తెలిపారు. ఇటీవల రామంతాపూర్‌లో నివాసముంటూ యాదాద్రిలో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌తో ఇతను సన్నిహితంగా ఉండేవాడనే సమాచారంతో ఇతడితో పాటు మరో తొమ్మిది మంది కానిస్టేబుళ్ల శాంపిల్స్‌ను సేకరించి టెస్టులకు పంపించామని తెలిపారు. ఆదివారం మరో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిందని ఆయన తెలిపారు. గుట్ట పీఎస్‌లో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో పోలీసు కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.  ముఖ్యంగా నగరం నుంచి వచ్చి వెళ్లే సిబ్బందితోనే ప్రమాదం వస్తుందని గుట్టలో ఉంటూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి పలువురి శాంపిల్స్‌ సేకరించడం వారి కుంటుబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేస్తుండటంతో ఇక్కడి ఉన్న పోలీసు కుటుంబాలు భయాందోళన వ్యక్తమవుతున్నది. 

అప్రమత్తంగా ఉండాలి ..

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించి స్వీయ నియంత్రణ పాటించాలి. నిర్లక్ష్యంతో ఎంతోమంది కరోనా బారిన పడే అవకాశం ఉన్నందున  క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి హోమ్‌ క్వారంటైన్‌ చేస్తున్నాం. 

                - సాంబశివరావు, డీఎంహెచ్‌వో

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో పోలీస్‌ శాఖ తరపున కఠిన చర్యలు తీసుకుంటున్నాం. మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నాం. దుకాణాల వద్ద  గుంపులుగా ఉంటే యజమానులతో పాటు కొనుగోలుదారులు ఇద్దరిపైనా చర్యలకు  తీసుకుంటాం. కరోనా అనుమానితుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 

- కె.నారాయణరెడ్డి, డీసీపీ


VIDEOS

logo